కాంపిటేటివ్ క్రికెట్లో ఆకట్టుకున్న నరైన్ | Sakshi
Sakshi News home page

కాంపిటేటివ్ క్రికెట్లో ఆకట్టుకున్న నరైన్

Published Mon, Feb 1 2016 5:34 PM

కాంపిటేటివ్ క్రికెట్లో ఆకట్టుకున్న నరైన్

పోర్ట్ ఆఫ్ స్పెయిన్:సందేహాస్పద బౌలింగ్ శైలి కారణంగా ఇటీవల సస్పెన్షన్కు గురైన వెస్టిండీస్ స్పిన్నర్ సునీల్ నరైన్‌ కాంపిటేటివ్ క్రికెట్ లో ఆకట్టుకున్నాడు. దేశవాళీ  లీగ్ లో భాగంగా ఆదివారం  క్వీన్స్ పార్క్ తరపున వన్డే ఆడిన నరైన్ 10.0 ఓవర్లలో 37 పరుగులిచ్చి రెండు వికెట్లు తీశాడు. కాగా, ట్రిన్ డాడ్ -టుబాగో చీఫ్ కోచ్ గుస్ లోగీ,  జాతీయ కోచ్ కెల్విన్ విలియమ్సన్ కోచ్ల సమక్షంలో నరైన్ బౌలింగ్ ను పరీక్షించారు. మ్యాచ్ అనంతరం క్వీన్స్ పార్క్ కోచ్ డేవిడ్ ఫర్లోంగ్ మాట్లాడుతూ.. నరైన్ బౌలింగ్ శైలి చాలా మెరుగుపడినట్లు పేర్కొన్నాడు. ప్రత్యేకంగా చివర్లో నరైన్ వేసిన బౌలింగ్ తో తాము సంతృప్తి చెందినట్లు పేర్కొన్నాడు.

నరైన్ బంతులు విసిరేటప్పుడు తన మోచేతిని 15 డిగ్రీల కంటే ఎక్కువగా వంచుతున్నాడని తేలడంతో గతేడాది నవంబర్ లో సస్పెన్షన్ కు గురయ్యాడు. ఐసీసీ ఆర్టికల్ 6.1 ప్రకారం ఇది బౌలింగ్ నిబంధనలకు విరుద్ధంకావడంతో అతనిపై వేటు పడింది.  అయితే బౌలింగ్ యాక్షన్‌ను సరి చేసుకున్న తర్వాత నిబంధన 2.4 ప్రకారం తనను మరోసారి పరీక్షించుకునే అవకాశం ఉండటంతో ఆ పనిలో పడ్డాడు నరైన్. విండీస్ బోర్డు కూడా అతనికి అండగా నిలవడంతో నరైన్ మరోసారి అంతర్జాతీయ మ్యాచ్ల్లో ఆడే అవకాశం ఉంది. దీనిలో భాగంగానే త్వరలో భారత్ లో జరగబోయే టీ 20సిరీస్ కు నరైన్ కు విండీస్ జట్టులో అవకాశం దక్కింది. కాకపోతే నరైన్ ఐసీసీ పరీక్షలో సఫలం కావాల్సి ఉంది.

Advertisement
Advertisement