డ్యూడ్‌ ఇది క్రికెట్‌.. రన్నింగ్‌ రేస్‌ కాదు!

5 Nov, 2018 08:43 IST|Sakshi
ఒకేవైపు పరుగెత్తిన హెట్‌మైర్‌, హై హోప్‌

వెస్టిండీస్‌ బ్యాట్స్‌మెన్‌పై సెటైర్స్‌

కోల్‌కతా : వెస్టిండీస్‌తో ఆదివారం జరిగిన తొలి టీ20లో టీమిండియా ఆపసోపాలతో గట్టెక్కిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌లో చోటుచేసుకున్న ఓ ఆసక్తికర సంఘటన ఇప్పుడు సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌ అయింది. టాస్ గెలిచిన భారత సారథి రోహిత్‌ ఫీల్డింగ్‌ ఎంచుకోగా.. విండీస్‌ వరుసగా వికెట్లను కోల్పోయింది. అయితే బుమ్రా వేసిన నాలుగో ఓవర్‌లో హెట్‌మైర్‌తో సమన్వయ లోపం కారణంగా షై హోప్‌ రనౌటయ్యాడు. హోప్‌ ఆడిన షాట్‌ను ఫార్వార్డ్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న కేఎల్‌ రాహుల్‌ అందుకున్నాడు. (చదవండి: ఆపసోపాలతో... ఐదు వికెట్లతో...)

కానీ అతను విసిరిన త్రో కీపర్‌ పైనుంచి వెళ్లిపోయినా పక్కనే ఉన్న మనీశ్‌ పాండే దానిని చక్కగా అందుకున్నాడు. దీంతో అయోమయానికి గురైన బ్యాట్స్‌మెన్‌ ఒకేవైపుకు పరుగెత్తారు. అనంతరం పాండే సునాయాసంగా రనౌట్‌ చేయడంతో హోప్‌ పెవిలియన్‌ బాట పట్టాడు. ఈ ఘటనతో మైదానంలో నవ్వులు పూసాయి. ఇక నెటిజన్లైతే దీనికి సంబంధించిన ఫొటోలపై వింత క్యాఫ్షన్స్‌ ఇస్తూ విండీస్‌ ఆటగాళ్లను ఓ ఆట ఆడుకుంటున్నారు. ‘ఈ రేస్‌ హెట్‌మైర్‌ గెలిచాడోచ్‌.!, డ్యూడ్‌ ఇది క్రికెట్‌.. రన్నింగ్‌ రేస్‌ కాదు’అని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. దీంతో ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తోంది. (చదవండి: పోలా..! అదిరిపోలా.. ఈ క్యాచ్‌!)

వీడియో కోసం క్లిక్‌ ఇక్కడ చేయండి

ఇక ఈ మ్యాచ్‌లో భారత్‌ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన విండీస్‌ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 109 పరుగులు చేసింది. అలెన్‌ (20 బంతుల్లో 27; 4 ఫోర్లు) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ కుల్దీప్‌ యాదవ్‌ (3/13), కృనాల్‌ పాండ్యా (1/15) ప్రత్యర్థిని పడగొట్టారు. అనంతరం భారత్‌ 17.5 ఓవర్లలో 5 వికెట్లకు 110 పరుగులు చేసి గెలిచింది. దినేశ్‌ కార్తీక్‌ (34 బంతుల్లో 31 నాటౌట్‌; 3 ఫోర్లు, 1 సిక్స్‌) ముందుండి జట్టును విజయం దిశగా నడిపించాడు. మూడు టీ20ల సిరీస్‌లో భారత్‌ 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. రేపు లక్నోలో రెండో మ్యాచ్‌ జరుగునుంది.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు