కివీస్ గర్జన సఫారీ రోదన

25 Mar, 2015 01:08 IST|Sakshi
కివీస్ గర్జన సఫారీ రోదన

పడిపోయిన ప్రతిసారీ పక్షిలా పైకి లేస్తున్నారు... కానీ అనుకున్నది మాత్రం సాధించలేకపోతున్నారు... దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నారు.. కానీ తలరాతను మాత్రం మార్చుకోలేకపోతున్నారు.. ఎంతో మంది దిగ్గజాలు వచ్చారు... కానీ ఒట్టి చేతులతోనే వెనక్కి వెళ్లారు.. అయినా... న్యూజిలాండ్ పోరాడటం మానలేదు... ఆ పోరాటమే ఇప్పుడు కొత్త చరిత్రకు నాంది పలికింది. మైదానంలో స్ఫూర్తిదాయక పోరాటంతో... అదృష్టాన్నీ మార్చుకుని తొలిసారి ప్రపంచకప్‌లో ఫైనల్‌కు చేరింది. ఆక్లాండ్‌లో మంగళవారం జరిగిన సెమీఫైనల్లో కివీస్ 4 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాపై గెలిచింది.
 
 సఫారీల ఇన్నింగ్స్‌లో 38 ఓవర్లు ముగిశాక వర్షం రావడంతో మ్యాచ్‌ను 43 ఓవర్లకు కుదించారు. ప్రొటీస్ జట్టు 5 వికెట్లకు 281 పరుగులు చేసింది. డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం న్యూజిలాండ్‌కు 43 ఓవర్లలో 298 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు. కివీస్ 42.5 ఓవర్లలో ఆరు వికెట్లకు 299 పరుగులు చేసి గెలిచింది. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా చివరి వరకూ పోరాడినా ఫలితం లేకపోయింది. ఇలియట్ (73 బంతుల్లో 84 నాటౌట్; 7 ఫోర్లు, 3 సిక్సర్లు) అద్భుతంగా ఆడి కివీస్‌ను గట్టెక్కించాడు.
 
 అసలు సిసలు క్రికెట్ అంటే ఇదే. స్లెడ్జింగ్ లేదు... కవ్వింపులు లేవు... నైపుణ్యం, పోరాటం.. గుండెల నిండా స్ఫూర్తి, గెలవాలనే తపన మాత్రమే ఉన్నాయ్... దేశంతో సంబంధం లేకుండా ప్రతి క్రికెట్ అభిమాని మునివేళ్లపై నిలబడి చూసిన మ్యాచ్... ఎవరు గెలిస్తే ఏంటి? సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను మించిన వినోదం.. మొత్తం మైదానంలో ఉన్న 13 మందీ ప్రతీక్షణం మనసు పెట్టి ఆడారు... సర్వశక్తులూ ఒడ్డి పోరాడారు. ఈ మధ్య కాలంలో క్రికెట్‌లో ఇంత గొప్ప మ్యాచ్ చూడలేదు. అందుకే... ఈ మ్యాచ్ లేకపోతే ఈ ప్రపంచకప్‌కు అందమే లేదు.
 
 విజయం ఇరు జట్లతో దోబూచులాడిన మ్యాచ్‌లో... క్షణక్షణానికి ఫలితం దిశ మారిన పోరాటంలో... న్యూజిలాండ్ గట్టెక్కింది.  తమ క్రికెట్ చరిత్రలోనే అతి పెద్ద విజయంతో సగర్వంగా ప్రపంచకప్ ఫైనల్‌కు చేరింది. మరోవైపు చివరిదాకా పోరాడినా సఫారీలకు ఖేదమే మిగిలింది. ప్రపంచకప్ ‘ఫైనల్’ ద్రాక్ష మళ్లీ అందలేదు.
 
ఆక్లాండ్: ఊపిరిబిగపట్టే క్షణాలు... అనుక్షణం ఆధిపత్యం కోసం పోరాటం... ప్రతి బంతికి ఊహించని ఉత్కంఠ... ప్రతి మలుపునకు తనివితీరని వేదన... ఓ కొత్త చరిత్ర కోసం పోరాడిన రెండు జట్లలో న్యూజిలాండ్ పైచేయి సాధిస్తే... దక్షిణాఫ్రికా అంతులేని రోదనతో ఇంటిముఖం పట్టింది. ప్రపంచకప్‌లో భాగంగా మంగళవారం జరిగిన తొలి సెమీఫైనల్లో కివీస్ 4 వికెట్ల తేడాతో (డక్‌వర్త్ లూయిస్ పద్ధతి) ప్రొటీస్‌పై గెలిచింది. ఈడెన్ పార్క్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో... టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా 43 ఓవర్లలో 5 వికెట్లకు 281 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌లో 38 ఓవర్ల తర్వాత వర్షం రావడంతో మ్యాచ్‌ను 43 ఓవర్లకు కుదించారు.

డుప్లెసిస్ (107 బంతుల్లో 82; 7 ఫోర్లు, 1 సిక్స్) నిలకడకు తోడుగా, డివిలియర్స్ (45 బంతుల్లో 65 నాటౌట్; 8 ఫోర్లు, 1 సిక్స్), మిల్లర్ (18 బంతుల్లో 49; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) వీరవిహారం చేశారు. డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో న్యూజిలాండ్‌కు 298 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు. కివీస్ 42.5 ఓవర్లలో 6 వికెట్లకు 299 పరుగులు చేసి నెగ్గింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’  గ్రాంట్ ఇలి యట్ (73 బంతుల్లో 84 నాటౌట్; 7 ఫోర్లు, 3 సిక్సర్లు) యాంకర్ పాత్రను పోషించగా... మెకల్లమ్ (26 బంతుల్లో 59; 8 ఫోర్లు, 4 సిక్సర్లు), అండర్సన్ (57 బంతుల్లో 58; 6 ఫోర్లు, 2 సిక్సర్లు), గప్టిల్ (38 బం తుల్లో 34; 3 ఫోర్లు, 1 సిక్స్) దుమ్మురేపారు. టోర్నీలో న్యూజిలాండ్‌కు ఇది వరుసగా 8వ విజయం.
 
స్కోరు వివరాలు
దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: ఆమ్లా (బి) బౌల్ట్ 10; డికాక్ (సి) సౌతీ (బి) బౌల్ట్ 14; డుప్లెసిస్ (సి) రోంచీ (బి) అండర్సన్ 82; రోసోవ్ (సి) గప్టిల్ (బి) అండర్సన్ 39; డివిలియర్స్ నాటౌట్ 65; మిల్లర్ (సి) రోంచీ (బి) అండర్సన్ 49; డుమిని నాటౌట్ 8; ఎక్స్‌ట్రాలు: 14; మొత్తం: (43 ఓవర్లలో 5 వికెట్లకు) 281.
 వికెట్ల పతనం: 1-21; 2-31; 3-114; 4-217; 5-272.
 బౌలింగ్: సౌతీ 9-1-55-0; బౌల్ట్ 9-0-53-2; హెన్రీ 8-2-40-0; వెటోరి 9-0-46-0; విలియమ్సన్ 1-0-5-0; ఇలియట్ 1-0-9-0; అండర్సన్ 6-0-72-3.
 
న్యూజిలాండ్ ఇన్నింగ్స్: గప్టిల్ రనౌట్ 34; మెకల్లమ్ (సి) స్టెయిన్ (బి) మోర్కెల్ 59; విలియమ్సన్ (బి) మోర్కెల్ 6; టేలర్ (సి) డికాక్ (బి) డుమిని 30; ఇలియట్ నాటౌట్ 84; అండర్సన్ (సి) డుప్లెసిస్ (బి) మోర్కెల్ 58; రోంచీ (సి) రోసోవ్ (బి) స్టెయిన్ 8; వెటోరి నాటౌట్ 7; ఎక్స్‌ట్రాలు: 13; మొత్తం: (42.5 ఓవర్లలో 6 వికెట్లకు) 299.
 వికెట్ల పతనం: 1-71; 2-81; 3-128; 4-149; 5-252; 6-269.
 బౌలింగ్: స్టెయిన్ 8.5-0-76-1; ఫిలాండర్ 8-0-52-0; మోర్నీ మోర్కెల్ 9-0-59-3; తాహిర్ 9-1-40-0; డుమిని 5-0-43-1; డివిలియర్స్ 3-0-21-0.
 
21 ట్రెంట్ బౌల్ట్ తీసిన వికెట్లు. కివీస్ తరఫున ఒకే ప్రపంచకప్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా అలాట్ (20 వికెట్లు-1999లో)ను అధిగమించాడు.
 
299 ప్రపంచకప్ నాకౌట్ మ్యాచ్‌లో ఇదే అత్యధిక ఛేదన. గతంలో 1996 క్వార్టర్ ఫైనల్లో ఆస్ట్రేలియా 289 పరుగులు చేసి కివీస్‌పై నెగ్గింది.
 
‘చాలా గొప్పగా ఆడి తొలిసారి ఫైనల్‌కు చేరిన కివీస్‌కు అభినందనలు. సెమీస్‌లో ఇంత గొప్పగా ఆడి దక్షిణాఫ్రికా ఓడటం బాధాకరం’           - సచిన్ టెండూల్కర్
 
‘దక్షిణాఫ్రికా ఓడిపోలేదు. కివీస్ గెలిచిందంతే. మిత్రులారా మీ ఆట మాకు గర్వకారణం’                                
-జాక్ కలిస్
 
‘బ్యాడ్‌లక్ దక్షిణాఫ్రికా. మైదానంలో వారి వేదన చూస్తే మనకూ బాధ కలుగుతుంది. గెలిచేందుకు వారు చేయాల్సిందంతా చేశారు’
 - వీవీఎస్ లక్ష్మణ్
 
దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్
 
బౌల్ట్ నిప్పులు
ఆరంభంలో వికెట్‌పై ఉన్న తేమను సద్వినియోగం చేసుకున్న కివీస్ పేసర్లు స్వింగ్‌తో చెలరేగారు. బౌల్ట్ వేసిన తొలి ఓవర్ రెండో బంతికి ఫోర్ కొట్టిన డికాక్ (14), ఐదో బంతికి ఇచ్చిన క్యాచ్‌ను రోంచీ మిస్ చేశాడు. తర్వాతి ఓవర్‌లో సౌతీ రెండు ఫోర్లు ఇచ్చుకున్నా.. బౌల్ట్ తన రెండో ఓవర్‌లో ఆమ్లా (10)ను అవుట్ చేశాడు. ఈ దశలో డుప్లెసిస్‌ను కట్టడి చేయడంతోపాటు  ఇన్నింగ్స్ ఎనిమిదో ఓవర్‌లో డికాక్‌నూ అవుట్ చేశాడు. దీంతో పవర్‌ప్లే ముగిసేసరికి దక్షిణాఫ్రికా 2 వికెట్లకు 39 పరుగులు చేసింది.
 
డుప్లెసిస్ నిలకడ

ఇన్నింగ్స్‌ను నిర్మించే బాధ్యతను తీసుకున్న డుప్లెసిస్.. రోసోవ్ (53 బంతుల్లో 39; 2 ఫోర్లు, 1 సిక్స్)తో కలిసి నిల కడగా ఆడాడు. సౌతీ స్థానంలో బౌలింగ్‌కు వచ్చిన హెన్రీ కూడా లైన్ అండ్ లెంగ్త్‌తో ఆకట్టుకున్నాడు. దీంతో సఫారీ ద్వయం సింగిల్స్‌కే పరిమితమైంది. ఈ ఇద్దరు 48 బంతుల్లో కేవలం రెండు బౌండరీలు మాత్రమే కొట్టారు. 21వ ఓవర్‌లో డుప్లెసిస్ మరో రెండు ఫోర్లు కొడితే... 25వ ఓవర్‌లో ఇలియట్ బంతిని రోసోవ్ సిక్సర్‌గా మలిచాడు. నిలకడగా ఆడుతున్న రోసోవ్‌ను 27వ ఓవర్‌లో అండర్సన్ అవుట్ చేయడంతో మూడో వికెట్‌కు 83 పరుగుల భాగస్వామ్యం ముగిసింది.
 
డివిలియర్స్ విజృంభణ

డివిలియర్స్ కుదురుకున్న తర్వాత క్రమంగా వేగం పెం చాడు. హెన్రీ బంతిని స్కూప్ చేసి అర్ధసెంచరీ (85 బంతు ల్లో) సాధించిన డుప్లెసిస్.. ఆ తర్వాతి రెండో బంతికి భారీ సిక్సర్ కొట్టాడు. ఇక అండర్సన్ వేసిన ఇన్నింగ్స్ 35వ ఓవర్ రెండో బంతికి క్యాచ్ అవుట్ నుంచి బయటపడ్డ డివిలియర్స్.. వరుసగా ఓ సిక్సర్, రెండు ఫోర్లు బాది అర్ధసెంచరీ పూర్తి చేశాడు. ఈ దశలో వర్షం వల్ల మ్యాచ్ ఆగింది.  
 
మిల్లర్ మెరుపులు
వర్షం తగ్గిన తర్వాత 39వ ఓవర్ రెండో బంతికి డుప్లెసిస్ అవుట్‌కావడంతో నాలుగో వికెట్‌కు 12.2 ఓవర్లలో 103 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. అప్పుడే క్రీజులోకి వచ్చిన మిల్లర్.. కివీస్ బౌలర్లను ఊచకోత కోశాడు. ఎదుర్కొన్న 16 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లు కొట్టి అవుటయ్యాడు. ఆఖర్లో డుమిని (8 నాటౌట్) ఓ ఫోర్ బాదాడు. అండర్సన్ 3, బౌల్ట్ 2 వికెట్లు తీశారు.
 
న్యూజిలాండ్ ఇన్నింగ్స్
 
మెకల్లమ్ బాదుడు
లక్ష్య ఛేదనలో మెకల్లమ్ ప్రొటీస్ పేసర్ల భరతం పట్టాడు. స్టెయిన్ మూడో బంతికి సిక్సర్ కొట్టిన అతను ఫిలాండర్‌కు ఓ సిక్స్, రెండు ఫోర్లు రుచి చూపెట్టాడు. మోర్కెల్ మూడు ఫోర్లు సమర్పించుకోగా, స్టెయిన్ వేసిన ఐదో ఓవర్‌లో రెండు సిక్స్‌లు, మూడు ఫోర్లతో 25 పరుగులు రాబట్టాడు. అయితే మోర్కెల్ తన వరుస రెండు ఓవర్లలో మెకల్లమ్, విలియమ్సన్ (6)ను అవుట్ చేసి సునామీకి తెరదించాడు. 10 ఓవర్లలో కివీస్ స్కోరు 88/2.
 
గప్టిల్ నిరాశ
మెకల్లమ్ ధాటిలో గప్టిల్‌కు ఎక్కువగా ఆడే అవకాశం రాకపోయినా... టేలర్ (39 బంతుల్లో 30; 4 ఫోర్లు)తో జతకలిసిన తర్వాత సిక్సర్‌తో జోరు పెంచాడు. సింగిల్స్, డబుల్స్‌తో రన్‌రేట్ తగ్గకుండా చూసిన గప్టిల్... 18వ ఓవర్‌లో అనూహ్యంగా రనౌటయ్యాడు. కొద్దిసేపటికే టేలర్ కూడా అవుట్‌కావడంతో కివీస్ కాస్త తడబడింది. టేలర్, గప్టిల్ మూడో వికెట్‌కు 47 పరుగులు జోడించారు. 25 ఓవర్లు ముగిసేసరికి కివీస్ స్కోరు 173/4.
 
అండర్సన్ దూకుడు
ఇక కివీస్ గెలవాలంటే 18 ఓవర్లలో 125 పరుగులు చేయాలి. ఈ దశలో వచ్చిన అండర్సన్ ఒత్తిడిలోనూ చక్కగా ఆడాడు. వీలుచిక్కినప్పుడల్లా భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. ఇలియట్, అండర్సన్ జోడిని విడగొట్టడానికి కెప్టెన్ చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. 32వ ఓవర్‌లో అండర్సన్‌ను రనౌట్ చేసే సులువైన అవకాశాన్ని డివిలియర్స్ వమ్ము చేశాడు. బ్యాటింగ్ పవర్‌ప్లేలో 35 పరుగులు జోడించిన అండర్సన్ ఇన్నింగ్స్ 38వ ఓవర్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి అవుటయ్యాడు. ఈ ఇద్దరు ఐదో వికెట్‌కు 103 పరుగులు జోడించారు. చేజారిందనుకున్న మ్యాచ్‌లో ఈ ఇద్దరి భాగస్వామ్యంతో కివీస్ నిలబడింది.
 
ఆఖర్లో హై‘డ్రామా’
అండర్సన్ అవుటైన తర్వాత అసలు ఆట మొదలైంది. పోయిందనుకున్న మ్యాచ్‌లో కివీస్ నిలదొక్కుకోవడంతో సఫారీలు ఇక అటాకింగ్ మొదలుపెట్టారు. మైదానంలో పాదరసంలా కదులుతూ పరుగులు నియంత్రించే పనిలో పడ్డారు. 18 బంతుల్లో 29 పరుగులు చేయాల్సిన దశలో రోంచీ (8) స్టెయిన్ వేసిన 41వ ఓవర్  తొలి బంతికి అవుటయ్యాడు. మూడో బంతిని ఇలియట్ లెగ్‌సైడ్ కొట్టి రెండో పరుగు కోసం ప్రయత్నించాడు. అయితే బౌండరీ లైన్ వద్ద నుంచి రోసో విసిరిన త్రోను అందుకోవడంలో డికాక్ విఫలమయ్యాడు. దీంతో  రనౌట్ అవకాశం చేజారింది. ఈ దశలో వెటోరి (7 నాటౌట్), ఇలియట్‌లు ఒత్తిడిని సమర్థవంతంగా జయించారు.
 
గెలుపునకు 12 బంతుల్లో 23 పరుగులు అవసరం... 42వ ఓవర్‌లో మోర్కెల్ రెండో బంతిని ఇలియట్ గాల్లోకి లేపాడు.  ఇద్దరు ఫీల్డర్లు బంతి కోసం పరుగెత్తినా ఒక్కరు కూడా దాన్ని అందుకోలేకపోయారు. చివరి బంతిని మళ్లీ డీప్ బ్యాక్‌వర్డ్, ఫైన్ లెగ్ మధ్యలోకి లేపాడు. దాదాపుగా క్యాచ్ అందుకుంటున్న తరుణంలో సబ్‌స్టిట్యూట్ బెహర్డీన్‌ను డుమిని ఢీకొట్టాడు. ఇక 6 బంతుల్లో 12 పరుగులు చేయాల్సిన దశలో వెటోరి బౌండరీ కొడితే.. ఇలియట్ లాంగాన్‌లో భారీ సిక్సర్‌తో విన్నింగ్ షాట్ కొట్టి సఫారీలకు రోదన మిగిల్చాడు.

>
మరిన్ని వార్తలు