30 ఏళ్ల తరువాత తొలిసారి.. | Sakshi
Sakshi News home page

30 ఏళ్ల తరువాత తొలిసారి..

Published Tue, Nov 29 2016 10:44 AM

30 ఏళ్ల తరువాత తొలిసారి..

హామిల్టన్: పాకిస్తాన్తో జరిగిన రెండు టెస్టుల సిరీస్ను న్యూజిలాండ్ క్లీన్స్వీప్ చేసింది. చివరిదైన రెండో టెస్టులో పాకిస్తాన్ 230 పరుగులకే పరిమితం కావడంతో న్యూజిలాండ్ 138 పరుగులతో విజయం సాధించి సిరీస్ను 2-0తో చేజిక్కించుకుంది. న్యూజిలాండ్ విసిరిన 369 పరుగుల లక్ష్య ఛేదనలో పాకిస్తాన్ తడబడి ఘోర పరాజయాన్ని మూట గట్టుకుంది. పాక్ రెండో ఇన్నింగ్స్లో ఓపెనర్లు సమీ ఇస్లామ్(91), అజహర్ అలీ(58) మినహా ఎవరూ రాణించలేదు.

1/0 ఓవర్ నైట్ స్కోరుతో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన పాకిస్తాన్.. కివీస్ బౌలర్ల దాటికి నిలవలేక స్వల్ప విరామాల్లో వికెట్లను కోల్పోయింది. ఐదుగురు పాక్ ఆటగాళ్లు సింగిల్ డిజిట్కే పరిమితం కావడంతో ఓటమి తప్పలేదు. న్యూజిలాండ్ బౌలర్లలో వాగ్నర్ మూడు వికెట్లు సాధించగా,టిమ్ సౌథీ, సాంత్నార్లు తలో రెండు వికెట్లు తీశారు. గ్రాండ్ హోమ్, హెన్రీలకు చెరో వికెట్ దక్కింది. అంతకుముందు జరిగిన తొలి టెస్టులో న్యూజిలాండ్ 8 వికెట్ల తేడాతో గెలిచిన సంగతి తెలిసిందే.పాకిస్తాన్ పై న్యూజిలాండ్ టెస్టు సిరీస్ గెలవడం దాదాపు 31 ఏళ్ల తరువాత ఇదే తొలిసారి. 1985 లో చివరిసారి పాక్ పై న్యూజిలాండ్ 2-0 తో గెలిచింది. అప్పట్నుంచి ఇప్పటివరకూ ఇరు జట్ల మధ్య 12 టెస్టు సిరీస్లు జరగ్గా, అందులో న్యూజిలాండ్ ఏడింటిని కోల్పోయింది. మరో ఐదింటిని డ్రా చేసుకుంది.

Advertisement
Advertisement