అయ్యో గేల్‌.. ఇలా అయ్యిందేమిటి?

10 Aug, 2019 12:58 IST|Sakshi

గయానా: స్వదేశంలో భారత్‌తో జరుగనున్న రెండు టెస్టుల సిరీస్‌ తర్వాత తాను అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు చెబుతానని వెస్టిండీస్‌ స్టార్‌ క్రికెటర్‌ క్రిస్‌ గేల్‌ ఇదివరకే ప్రకటించాడు.  ఇటీవల ముగిసిన వన్డే వరల్డ్‌కప్‌ తర్వాత తన రిటైర్మెంట్‌ ఉంటుందని గేల్‌ తొలుత ప్రకటించినా, ఆ తర్వాత మనుసు మార్చుకుని భారత్‌తో టెస్టు సిరీసే తనకు చివరదని వెల్లడించాడు.  అదే సమయంలో అంతర్జాతీయ టీ20లకు దూరంగా ఉంటానని కూడా పేర్కొన్నాడు.

పరిమిత ఓవర్ల క్రికెట్‌లో విధ్వంసకర ఆటగాడిగా పేరు తెచ్చుకున్న గేల్‌.. టెస్టు క్రికెట్‌ ఆడి చాలా రోజులే అయ్యింది. ఎప్పుడో ఐదేళ్ల క్రితం చివరిసారి టెస్టుల్లో కనిపించాడు గేల్‌. మరి ఎప్పట్నుంచో టెస్టులకు ఎంపిక కాని గేల్‌ను మళ్లీ ఎలా ఎంపిక చేస్తారని భావించాడో తెలీదు కానీ టీమిండియాతో టెస్టు సిరీస్‌ తనకు ఆఖరిదంటూ స్పష్టం చేశాడు. దీనిపై అప్పట్లోనే విమర్శలు కూడా వచ్చాయి. ‘నువ్వు టెస్టు క్రికెట్‌కు అసలు సరిపోవు’ అంటూ ఆ దేశ దిగ్గజ క్రికెటర్‌ కర్ట్‌లీ ఆంబ్రోస్‌ మండిపడ్డాడు. తాజాగా విండీస్‌ క్రికెట్‌ బోర్డు ప్రకటించిన టెస్టు జట్టులో గేల్‌ను పక్కన పెట్టేశారు. శనివారం 13 మంది కూడిన టెస్టు జట్టును ప్రకటించిన విండీస్‌ సెలక్టర్లు.. గేల్‌ను పట్టించుకోలేదు. అదే సమయంలో కొత్త వారికి అవకాశం ఇచ్చారు. గేల్‌ ఒకటి అనుకుంటే, విండీస్‌ బోర్డు మరొకటి అనుకుంది. అసలు గేల్‌ సేవలు టెస్టులకు అవసరం లేదని చెప్పకనే చెప్పింది. అయితే భారత్‌తో వన్డే సిరీస్‌లో మాత్రం గేల్‌ ఉన్నాడు. అంటే భారత్‌తో వన్డే సిరీస్‌లోనే గేల్‌ రిటైర్మెంట్‌ ప్రకటిస్తాడా.. లేక కనీసం వేరే దేశంతో టెస్టు మ్యాచ్‌ ఆడిన తర్వాతే వీడ్కోలు చెబుతానని ప్రకటిస్తాడా అనేది చూడాలి.

వెస్టిండీస్‌ టెస్టు జట్టు ఇదే

జేసన్‌ హోల్డర్‌(కెప్టెన్‌), క్రెయిగ్‌ బ్రాత్‌వైట్‌, డారెన్‌ బ్రేవో, షమరాహ్‌ బ్రూక్స్‌, జాన్‌ క్యాంపబెల్‌, రోస్టన్‌ ఛేజ్‌, రకీమ్‌ కొర్నవాల్‌, డొవ్రిచ్‌, గాబ్రియెల్‌, హెట్‌మెయిర్‌, షాయ్‌ హోప్‌, కీమర్‌ రోచ్‌, కీమో పాల్‌

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా