Sakshi News home page

నష్టం క్రికెట్‌కే... ఆయనకు కాదు!

Published Mon, Nov 9 2015 11:48 PM

నష్టం క్రికెట్‌కే... ఆయనకు కాదు!

‘ఇలా చేస్తే క్రికెట్‌కు మేలు జరుగుతుంది. కాబట్టి ఇలానే చేస్తాం. మీరు మాతో వచ్చినా రాకపోయినా ఇలాగే జరుగుతుంది. వస్తే మిమ్మల్నీ కలుపుకుని పోతాం’ ఏడాది క్రితం ఐసీసీలో కొత్త సంస్కరణల సందర్భంగా శ్రీనివాసన్ వ్యాఖ్య ఇది. ఐసీసీ పాత నిబంధనలన్నీ మార్చివేసిన సందర్భంలో అభ్యంతరం చెప్పిన దేశాల సభ్యులకు ఆయన చెప్పిన మాట ఇది. ఈ ఒక్క విషయంలోనే కాదు... ఆయన ఏ విషయంలో అయినా అలాగే ఉన్నారు. ఈ వైఖరి కాస్త బెదిరింపు తరహాలో కనిపించవచ్చు. కానీ అనుకున్నది చేయడానికి ఆయన ముక్కుసూటి మార్గాన్నే ఎంచుకుంటారు. అందుకే సుదీర్ఘకాలం భారత క్రికెట్‌లో ‘కింగ్’లా నిలిచారు.
 2002లో తమిళనాడు క్రికెట్ సంఘం అధ్యక్షుడిగా ఎన్నికైన శ్రీనివాసన్... ఆ తర్వాత దాదాపు ప్రతిసారీ ఏకగీవ్రంగా ఈ పదవిని గెలిచారు.

తమిళనాడు అధ్యక్షుడిగా వరుసగా 14 సార్లు ఎన్నికై రికార్డు సృష్టించారు. 2008లో బీసీసీఐ కార్యదర్శిగా ఎన్నికైన శ్రీనివాసన్, అప్పటి అధ్యక్షుడు శశాంక్ మనోహర్ సన్నిహితంగానే ఉండేవారు. 2011లో శ్రీనివాసన్ కార్యదర్శి నుంచి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 2014 వరకు ఆయన ఈ పదవిలో కొనసాగారు. అయితే అదే ఏడాది ఐసీసీ చైర్మన్‌గానూ బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఐసీసీకి కేవలం అధ్యక్షుడు మాత్రమే ఉండేవారు. కానీ గత ఏడాది నుంచి కొత్తగా చైర్మన్ పదవిని సృష్టించారు. ఇందులో కేవలం భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ బోర్డులకు మాత్రమే చైర్మన్ పదవి తీసుకునే హక్కు ఉంది. ఇది కూడా శ్రీనివాసన్ ఆలోచనే. ప్రపంచ క్రికెట్‌పై భారత పట్టు కాపాడటం కోసం ఆయన దూరదృష్టితో చేసిన ఏర్పాటు ఇది.

 చేసిన తప్పేంటి..?
 బీసీసీఐ అధ్యక్ష పదవి నుంచి తొలగించాల్సిన, ఐసీసీ చైర్మన్ పదవి నుంచి పంపించాల్సిన తప్పు శ్రీనివాసన్ ఏమీ చేయలేదు. స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ వివాదం 2013లో బయటకు వచ్చినప్పుడు... శ్రీనివాసన్ అల్లుడు, చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ప్రిన్సిపల్ గురునాథ్ మెయ్యప్పన్ బెట్టింగ్‌కు పాల్పడ్డారనేది ఆరోపణ. ఈ ఆరోపణల మీద విచారణ కోసం సమావేశం జరిగినప్పుడు శ్రీనివాసన్ ఆ సమావేశానికి కూడా దూరంగా ఉన్నారు. అయితే ఎప్పుడైతే మెయ్యప్పన్ మీద ఆరోపణలు వచ్చాయో... ఆ వెంటనే శ్రీనివాసన్ వ్యతిరేక శక్తులన్నీ ఏకమయ్యాయి. ఇలాంటి వాళ్లందరినీ తన బలంతో అధిగమిస్తూ వచ్చిన శ్రీనివాసన్... కాన్‌ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రస్ట్ అనే ఆరోపణను ఎదుర్కొన్నారు. ఈలోగా రకరకాల విచారణలు, కేసుల నేపథ్యంలో క్రమంగా శ్రీనివాసన్ అనుచరులు ఒక్కొక్కరు దూరమయ్యారు.
 
అధికారం లేకపోతే అంతే..
.
 గత ఏడాది కాలంగా జరిగిన పరిణామాలు శ్రీనివాసన్‌కు ఓ కొత్త విషయాన్ని కూడా నేర్పాయి. శ్రీనివాసన్ అధికారంలో ఉన్నప్పుడు లబ్ధి పొందిన అనేక సంఘాలు, ఇప్పుడు అదే లబ్ధి కోసం మనోహర్ పంచన చేరాయి. కార్పొరేట్ రంగంలో ఢక్కామొక్కీలు తిన్న ఆయనకు ఇది కొత్త కాకపోయినా, క్రికెట్‌లో రాజకీయాలు ఎలా ఉంటాయనేది కూడా తెలిసొచ్చింది.
                                -సాక్షి క్రీడావిభాగం
 
 ‘ఐసీసీలో ఎవరిని ప్రతినిధిగా ఉంచాలో నిర్ణయించేది బీసీసీఐ. వారి నిర్ణయాన్ని నేను గౌరవిస్తా. బోర్డు అభివృద్ధిలో నేను పోషించిన పాత్ర పట్ల గర్వంగా ఉన్నా. ఐసీసీ ఇప్పుడు మరింత బలంగా తయారైంది. క్రికెట్ ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ క్రికెట్ బోర్డుల సహకారంతో ఐసీసీ చైర్మన్ హోదాలో మీడియా హక్కులకు సంబంధించి తీసుకున్న నిర్ణయం అత్యుత్తమమని చెప్పగలను. క్రికెట్ పరిపాలనను నేను ఒక ఉద్యోగంలా, బాధ్యతలా భావించాను. నాకు పెద్ద వ్యాపార ప్రపంచం ఉంది. దానిపై ఇప్పుడు చాలా దృష్టి పెట్టాలి. సరదాగా చెప్పాలంటే ఇక ముందు గోల్ఫ్‌లో నా ఆటను మరింత మెరుగు పర్చుకోవడంపై దృష్టి పెడతా. ఎనిమిదేళ్లలో నేను ఏమాత్రం పట్టించుకోని అంశం అంటే గోల్ఫ్ ఒక్కటే.’
 -ఎన్. శ్రీనివాసన్, ఐసీసీ మాజీ చైర్మన్
 
 మళ్లీ వస్తారా...?

 నిజానికి ఐసీసీ చైర్మన్ పదవి మరో 8 నెలలు మాత్రమే ఉంది. ఈ ఎనిమిది నెలలు ప్రస్తుతం కార్యవర్గం ఓపిక పడితే ఆయనంతట ఆయనే పూర్తిగా క్రికెట్ నుంచి తప్పుకునేవారు. భారత క్రికెట్‌లోనే కాదు... ప్రపంచ క్రికెట్‌లోనే ఎన్నో మార్పులు తీసుకొచ్చి అభివృద్ధి బాటలోకి తెచ్చిన శ్రీనివాసన్‌ను ఇలా పంపించాల్సింది కాదేమో. దీని వల్ల ఆయన బాధపడటం కూడా సహజమే. ఈ కేసులు, గొడవలు మహా అయితే రెండేళ్లు ఉంటాయి. మెయ్యప్పన్ చేసిన తప్పులకు వ్యక్తిగా శ్రీనివాసన్‌కి ఎలాంటి బాధ్యతలు లేవు. నిజానికి ఆయనను తొలగించడానికి సరైన కారణమే లేదు. కాకపోతే ప్రస్తుతం ఆయనకు నమ్మకస్తులు బీసీసీఐలో ఎక్కువమంది లేకపోవడం వల్ల ఇదంతా వచ్చింది. అయితే దీనిని పరిష్కరించుకుని మళ్లీ మద్దతు కూడగట్టుకోవడానికి శ్రీనివాసన్‌కు రెండేళ్లు చాలు. తనని పంపించిన విధానం బాధపెట్టి ఉంటే మాత్రం తిరిగి రెండేళ్ల తర్వాత గోడకు కొట్టిన బంతిలా తిరిగొస్తారా చూద్దాం!        
 
 

Advertisement

What’s your opinion

Advertisement