ఆహా... ‘ఏ’మి ఆడారు | Sakshi
Sakshi News home page

ఆహా... ‘ఏ’మి ఆడారు

Published Mon, Aug 10 2015 2:58 AM

ఆహా... ‘ఏ’మి ఆడారు

- చెలరేగిన భారత ‘ఎ’ జట్టు
- దక్షిణాఫ్రికాపై బోనస్‌తో గెలుపు
- మయాంక్ సెంచరీ, రాణించిన ఉన్ముక్త్ చంద్
చెన్నై:
ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన భారత్ ‘ఎ’ జట్టు... ముక్కోణపు వన్డే సిరీస్‌లో బోణి చేసింది. ఓపెనర్లు మయాంక్ అగర్వాల్ (122 బంతుల్లో130; 16 ఫోర్లు, 1 సిక్స్), ఉన్ముక్త్ చంద్ (94 బంతుల్లో 90; 8 ఫోర్లు, 2 సిక్సర్లు) దుమ్మురేపడంతో ఆదివారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా ‘ఎ’పై ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన సఫారీ జట్టు 50 ఓవర్లలో 244 పరుగులకు ఆలౌటైంది. డి కాక్ (124 బంతుల్లో 108; 13 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీతో చెలరేగాడు. భారత బౌలర్ల ధాటికి ఓ దశలో ప్రొటీస్ 92 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది.

అయితే డి కాక్, విలాస్‌లు ఐదో వికెట్‌కు 100 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. చివర్లో సందీప్, ధవల్ సమయోచితంగా బౌలింగ్ చేసి లోయర్ ఆర్డర్‌పై ఒత్తిడి పెంచడంతో దక్షిణాఫ్రికా 52 పరుగుల తేడాతో చివరి 6 వికెట్లను చేజార్చుకుంది. రిషి ధావన్ 4, సందీప్ 2 వికెట్లు తీశారు. తర్వాత భారత్ 37.4 ఓవర్లలో 2 వికెట్లకు 247 పరుగులు చేసి నెగ్గింది.  సఫారీ బౌలర్లందర్నీ దీటుగా ఎదుర్కొన్న మయాంక్, ఉన్ముక్త్ తొలి వికెట్‌కు 219 పరుగులు జోడించారు. వీరిద్దరు అవుటయ్యాక మనీష్ పాండే (9 నాటౌట్), కరుణ్ (4 నాటౌట్) జట్టును విజయతీరాలకు చేర్చారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement