కీపింగ్‌ వదిలేసి కాళ్లు మొక్కుతావేంట్రా నాయనా!

9 Mar, 2020 13:55 IST|Sakshi

లాహోర్‌: క్రికెట్‌లో ఫీల్డింగ్‌ చేసే జట్టు.. బ్యాట్స్‌మన్‌ కొట్టే బంతుల్ని ఆపడానికి యత్నించడమే సాధారణంగా చేసే పని. మరి ఫీల్డింగ్‌ చేసే క్రికెటర్‌ బంతిని వదిలేసి బ్యాట్స్‌మన్‌ పట్టుకుంటే ఏమనాలి. బ్యాట్స్‌మన్‌ పరుగు తీయకుండా చేయడానికి చేసిన ఒక ప్రయత్నమనే అనుకోవాలి. ఇది తొందరపాటులో జరిగినా అది చూసిన అభిమానులకు మాత్రం సరదాగా మారిపోతుంది.  ప్రస్తుతం జరుగుతున్న పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌(పీఎస్‌ఎల్‌)లో ఇదే జరిగింది. ఆదివారం లాహోర్‌ క్వాలండర్స్‌-కరాచీ కింగ్స్‌ల మధ్య మ్యాచ్‌ జరిగింది. దీనిలో భాగంగా లాహోర్‌ క్వాలండర్స్‌ ఛేజింగ్‌కు దిగిన సమయంలో సెకండ్‌ డౌన్‌ ఆటగాడు బెన్‌ డంక్‌ ఇచ్చిన క్యాచ్‌ పట్టుకోవడంలో విఫలమైన కరాచీ వికెట్‌ కీపర్‌ చాడ్విక్‌ వాల్టన్‌ చేసేది లేక చివరికి ఇలా బ్యాట్స్‌మన్‌ను చుట్టేశాడు. (తాహీర్‌ ఓవరాక్షన్‌ చూడలేకపోతున్నా!)

డెల్‌పోర్ట్‌ వేసిస10 ఓవర్‌ ఐదో బంతిని బెన్‌ డంక్‌ రివర్స్‌ స్వీప్‌ ఆడబోయాడు. అది కాస్తా ఎడ్జ్‌ తీసుకుని పైకి లేచింది. అయితే ఆ బంతి బ్యాట్స్‌మన్‌కు పైనే లేవడంతో కీపర్‌ చాడ్విక్‌ తడబడ్డాడు. ఆ బంతి బ్యాట్స్‌మన్‌ భుజానికి తాకిన గ్రౌండ్‌ను తాకే సమయంలో ఎక్కడుందో కనబడలేదు. దాంతో బెన్‌ డంక్‌ కాళ్లను అమాంతం చుట్టేశాడు. క్యాచ్‌ వదిలేసి ఇలా కాళ్లను చుట్టేయడం మాత్రం ఫన్నీగా అయ్యింది. ఆ సమయానికి బెన్‌ డంక్‌ 10 పరుగుల వద్ద ఉండగా, ఆపై వీరబాదుడు బాదాడు.  40 బంతుల్లో 12 సిక్స్‌లు, 3 ఫోర్లతో  అజేయంగా 99 పరుగులు సాధించాడు. డంక్‌ ధాటిగా బ్యాటింగ్‌ చేయడంతో ఇంకా ఐదు బంతులు ఉండగానే లాహోర్‌ విజయాన్ని సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన కరాచీ ఐదు వికెట్ల నష్టానికి 187 పరుగులు చేయగా, దాన్ని లాహోర్‌ రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. కాగా, సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన బెన్‌ డంక్‌-చాడ్విక్‌ల ఫన్నీ వీడియోకు మాత్రం సెటైర్లు పేలుతున్నాయి. ఇది కేవలం పీఎస్‌ఎల్‌లో మాత్రమే జరుగుతుందని కొంతమంది అభిమానులు ఎద్దేవా చేయగా, కీపింగ్‌ చేయకుండా కాళ్లు మొక్కుతావేంట్రా నాయనా అని మరి కొంతమంది జోకులు పేల్చుతున్నారు.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు