సింధు శుభారంభం | Sakshi
Sakshi News home page

సింధు శుభారంభం

Published Thu, Nov 28 2013 1:13 AM

P.V. Sindhu enters the second round of Kumpoo Macau Open 2013

సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ బ్యాడ్మింటన్ యువతార పి.వి.సింధు మకావు ఓపెన్ గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నమెంట్‌లో శుభారంభం చేసింది. మకావు సిటీలో బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో టాప్ సీడ్ సింధు 15-21, 21-12, 21-9తో కిమ్ సూ జిన్ (దక్షిణ కొరియా)పై విజయం సాధించింది.
 
 
 45 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ప్రపంచ 11వ ర్యాంకర్ సింధు స్మాష్‌లతో చెలరేగి 26 పాయింట్లు సంపాదించింది. ఇదే టోర్నీలో భారత్‌కే చెందిన సయాలీ గోఖలే, పి.సి.తులసీ కూడా రెండో రౌండ్‌లోకి అడుగుపెట్టారు. తొలి రౌండ్‌లో మహారాష్ట్ర క్రీడాకారిణి సయాలీ 24-22, 21-15తో చీ యా చెంగ్ (చైనీస్ తైపీ)పై నెగ్గగా... కేరళ అమ్మాయి తులసీ 22-20, 21-19లో రెండో సీడ్ నిచావోన్ జిందాపోన్ (థాయ్‌లాండ్)ను బోల్తా కొట్టించింది.
 
 పురుషుల సింగిల్స్ తొలి రౌండ్‌లో ఆంధ్రప్రదేశ్ కుర్రాడు భమిడిపాటి సాయిప్రణీత్ 19-21, 17-21తో సోల్ కూ చోయ్ (దక్షిణ కొరియా)చేతిలో ఓటమి పాలయ్యాడు. పీ రోంగ్ వాంగ్-కువో యూ వెన్ (చైనీస్ తైపీ) జంటతో జరిగిన మహిళల డబుల్స్ తొలి రౌండ్‌లో గుత్తా జ్వాల-అశ్విని పొన్నప్ప ద్వయం తొలి గేమ్‌లో 0-2తో వెనుకంజలో ఉన్న దశలో గాయం కారణంగా వైదొలిగింది. మిక్స్‌డ్ డబుల్స్ తొలి రౌండ్‌లో కోనా తరుణ్-అశ్విని పొన్నప్ప జోడి 10-21, 21-17, 13-21తో నిపిత్‌పోన్-పుతియా సుపాజిర్‌కుల్ (థాయ్‌లాండ్) జంట చేతిలో ఓడిపోయింది. గురువారం జరిగే రెండో రౌండ్‌లో ప్రపంచ 62వ ర్యాంకర్ సలక్‌జిత్ పొన్సానా (థాయ్‌లాండ్)తో సింధు ఆడుతుంది.

 

Advertisement
Advertisement