పాకిస్తాన్ ఫుల్ ఖుష్ | Sakshi
Sakshi News home page

పాకిస్తాన్ ఫుల్ ఖుష్

Published Sat, May 23 2015 1:24 AM

Pakistan in full josh

ఆరేళ్ల అనంతరం స్వదేశంలో అంతర్జాతీయ క్రికెట్
తొలి టి20లో జింబాబ్వేపై విజయం

 
 లాహోర్: పాకిస్తాన్ క్రికెట్ అభిమానులు ఆరేళ్లుగా కళ్లు కాయలు కాచేలా ఎదురుచూసిన సందర్భం రానే వచ్చింది. 2009 అనంతరం తొలిసారిగా స్వదేశంలో అంతర్జాతీయ మ్యాచ్ చూసి వారు పులకరించిపోయారు. ప్రత్యర్థి జింబాబ్వే ఆటతీరునూ మనస్ఫూర్తిగా అభినందిస్తూ పొంగిపోయారు. ఈ మ్యాచ్‌కు ఆటగాళ్లను కలుసుకునేందుకు పాక్ అధ్యక్షుడు మమ్నూన్ హుస్సేన్ సైతం హాజరయ్యారు. రెండు టి20ల సిరీస్‌లో భాగంగా శుక్రవారం జరిగిన తొలి మ్యాచ్ కూడా అభిమానులను అదే స్థాయిలో ఉర్రూతలూగించింది. చివరి ఓవర్ వరకు ఉత్కంఠగా జరిగిన  మ్యాచ్‌లో పాకిస్తాన్ ఐదు వికెట్ల తేడాతో నెగ్గింది.

ముందుగా బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వే 20 ఓవర్లలో 6 వికెట్లకు 172 పరుగులు చేసింది. చిగుంబురా (35 బంతుల్లో 54; 8 ఫోర్లు; 1 సిక్స్), మసకద్జా (27 బంతుల్లో 43; 7 ఫోర్లు; 1 సిక్స్) వేగంగా ఆడారు. సమీకి మూడు, రియాజ్‌కు రెండు వికెట్లు పడ్డాయి. అనంతరం పాక్ 19.3 ఓవర్లలో ఐదు వికెట్లకు 173 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్ ముక్తార్ అహ్మద్ (45 బంతుల్లో 83; 12 ఫోర్లు; 3 సిక్సర్లు), అహ్మద్ షెహజాద్ (39 బంతుల్లో 55; 6 ఫోర్లు; 1 సిక్స్) తొలి వికెట్‌కు 142 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే వరుస విరామాల్లో నాలుగు వికెట్లు కోల్పోయిన పాక్ ఒత్తిడిలో పడింది. ఆఖరి ఓవర్‌లో ఆఫ్రిది (4 నాటౌట్) విన్నింగ్ షాట్‌తో మ్యాచ్‌ను ముగించాడు. క్రెమెర్‌కు రెండు వికెట్లు దక్కాయి.

Advertisement

తప్పక చదవండి

Advertisement