ఆ అభిలాష ఎవరికీ లేదు: చేతన్ శర్మ | Sakshi
Sakshi News home page

ఆ అభిలాష ఎవరికీ లేదు: చేతన్ శర్మ

Published Thu, Oct 29 2015 4:07 PM

ఆ అభిలాష ఎవరికీ లేదు: చేతన్ శర్మ

పనాజి:  నేటి తరం తల్లిదండ్రులు తమ పిల్లలలో ఒక సచిన్ టెండూల్కర్ ను  , ఒక రవిచంద్రన్ అశ్విన్ ను మాత్రమే చూడాలనుకుంటున్నారని..  మాజీ ఆల్ రౌండర్ కపిల్ దేవ్ తరహాలో చక్కటి ఆటగాడ్ని తయారు చేద్దామని  ఏ ఒక్కరూ కోరుకోవడం లేదని మాజీ క్రికెటర్ చేతన్ శర్మ పేర్కొన్నాడు. క్రికెట్ లీగ్ ఈవెంట్ లో భాగంగా బుధవారం ఇక్కడకు విచ్చేసిన చేతన్ శర్మ..తల్లి దండ్రులు, వారి పిల్లలతో ఇష్టాగోష్టి కార్యక్రమంలో పాల్గొన్నాడు. 

 

ఈ సందర్భంగా  వారితో చేతన్ మాట్లాడుతూ..  భారత్ కు 1983 వరల్డ్ కప్ అందించిన కపిల్ దేవ్ లాంటి ఆల్ రౌండర్ తరహా ఆటగాడిని తయారు చేద్దామని తల్లి దండ్రులు కోరుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ఆ కారణం వల్లే మనకు ఆల్ రౌండర్ల కొరతో పాటు, ఫాస్ట్ బౌలర్లు కూడా అంతంత మాత్రంగానే ఉన్నారని శర్మ పేర్కొన్నాడు.  'తల్లిదండ్రులను ఎప్పుడు అడిగినా సచిన్, అశ్విన్ లు పేర్లు మాత్రమే చెబుతారు. ఏ ఒక్కరూ కపిల్ దేవ్ మాదిరి మా కుమారున్ని తయారు చేద్దామని చెప్పరు.  పిల్లలను ఫాస్ట్ బౌలర్ గా చేయడం అనేది తల్లి దండ్రులకు ఇబ్బందిగా మారడం కూడా ఒక కారణం కావొచ్చు' అని  చేతన్ శర్మ తెలిపాడు.

 

దాదాపు 50 మంది తల్లి దండ్రులు మా అబ్బాయి దేశం తరపున ఎప్పుడు క్రికెట్ ఆడతారని తనను అడిగినట్లు చేతన్ తెలిపాడు. ఈ సందర్భంగా పిల్లల పట్ల తల్లిదండ్రుల పాత్రను అభినందించిన చేతన్.. జాతీయ స్థాయిలో రాణించాలంటే స్కూల్ క్రికెట్ అనేది చాలా ముఖ్యమన్నాడు. తనతో పాటు, వీవీఎస్ లక్ష్మణ్, శివ రామకృష్ణన్, మహేంద్ర సింగ్ ధోని, సాబా కరీంలు స్కూల్ క్రికెట్ నుంచి జాతీయ స్థాయికి ఎదిగిన సంగతిని చేతన్ గుర్తు చేశాడు.

Advertisement

తప్పక చదవండి

Advertisement