ప్రిక్వార్టర్స్‌లో ఇటలీ | Sakshi
Sakshi News home page

ప్రిక్వార్టర్స్‌లో ఇటలీ

Published Sat, Jun 18 2016 12:08 AM

ప్రిక్వార్టర్స్‌లో ఇటలీ

1-0తో స్వీడన్‌పై గెలుపు యూరో కప్
 
టౌలస్ (ఫ్రాన్స్): తొలి మ్యాచ్‌లో సంచలన ప్రదర్శనతో బెల్జియంను బోల్తా కొట్టించిన ఇటలీ జట్టు... రెండో మ్యాచ్‌లోనూ ఆకట్టుకుంది. ప్రత్యర్థులు అంచనాలకు మించి రాణించినా.. ఆఖరి నిమిషాల్లో అద్భుతం చేసింది. ఫలితంగా యూరో కప్‌లో భాగంగా శుక్రవారం జరిగిన గ్రూప్-ఇ లీగ్ మ్యాచ్‌లో ఇటలీ 1-0తో స్వీడన్‌పై గెలిచింది. దీంతో ఆరు పాయింట్లతో ప్రిక్వార్టర్స్ బెర్త్‌ను ఖాయం చేసుకుంది. స్టార్ స్ట్రయికర్ ఎడెర్ (88వ ని.) ఇటలీ తరఫున ఏకైక గోల్ సాధించాడు. సమఉజ్జీల సమరంగా సాగిన ఈ మ్యాచ్‌లో ఇరుజట్లు పరస్పరం దాడులు చేసుకున్నా తొలి అర్ధభాగంలో గోల్స్ నమోదు కాలేదు. అయితే రెండో అర్ధభాగంలో ఇటలీ త్రీ మెన్ డిఫెన్స్‌తో వ్యూహాత్మకంగా ఆడింది. స్వీడన్ కీలక ఆటగాడు ఇబ్రమోవిచ్‌ను అడుగడుగునా నిలువరిస్తూ మ్యాచ్‌లో ఉత్కంఠను పెంచింది. అయితే ఆట మరో రెండు నిమిషాల్లో ముగుస్తుందనగా ఇటలీ తరఫున ఎడెర్ గోల్ చేసి జట్టును ప్రిక్వార్టర్స్‌కు చేర్చాడు.


 జర్మనీని నిలువరించిన పోలెండ్
పారిస్: ఆద్యంతం హోరాహోరీగా సాగిన జర్మనీ, పోలెండ్ గ్రూప్-సి మ్యాచ్ 0-0తో డ్రా అయ్యింది. ఈ టోర్నీలో గోల్స్ లేకుండా డ్రా అయిన తొలి మ్యాచ్ ఇదే. మ్యాచ్ మొత్తం అత్యం త పటిష్టమైన జర్మనీ అటాకింగ్‌కు పోలండ్ వ్యూహాత్మకంగా చెక్ పెట్టింది.

 క్రొయేషియా చేజేతులా...
 సెయింట్ ఎటెన్నా: గ్రూప్ ‘డి’లో భాగంగా చెక్ రిపబ్లిక్‌తో గెలవాల్సిన మ్యాచ్‌ను క్రొయేషియా జట్టు ‘డ్రా’తో ముగించింది. చివరి నిమిషాల్లో చెక్ రిపబ్లిక్ చెలరేగి స్కోరును సమం చేసింది. పెరిసిక్ (37వ ని.), రాకిటిక్ (59వ ని.) క్రొయేషియాకు గోల్స్ అందించారు. చెక్ తరఫున స్కోడా (76వ ని.), నిసిడ్ (90+4) గోల్స్ చేశారు. 86వ నిమిషంలో మైదానంలో కాస్త అలజడి చోటు చేసుకోవడంతో కొద్దిసేపు ఆటకు అంతరాయం ఏర్పడింది. ఇంజ్యూరీ టైమ్‌లో లభించిన పెనాల్టీని నిసిడ్ (చెక్) గోల్‌గా మలిచి మ్యాచ్‌ను ‘డ్రా’గా ముగించాడు.

Advertisement
Advertisement