Sakshi News home page

సచిన్‌తో పోలిక మొదలు

Published Fri, May 4 2018 5:37 AM

Prithvi Shaw Reminds Mark Waugh Of Sachin Tendulkar - Sakshi

న్యూఢిల్లీ: యువ సంచలనం పృథ్వీ షా సత్తా గురించి రెండేళ్లుగా అనేక వ్యాఖ్యానాలు! అతడు భారత జట్టుకు ఆడటం ఖాయమంటూ విశ్లేషణలు! దేశవాళీల్లోనూ అదరగొట్టడంతో తనపై మరిన్ని అంచనాలు! ఈ ఏడాది అండర్‌–19 ప్రపంచ కప్‌ గెలిచిన జట్టు సారథిగా ఎన్నో ఆశలు! వీటన్నిటికి తోడుగా సీనియర్‌ స్థాయిలో పృథ్వీ ఎలా రాణిస్తాడో అనే అనుమానాలు! ఇన్ని లెక్కల మధ్య, అంతర్జాతీయ స్థాయి ఆటగాళ్లుండే ఐపీఎల్‌లో అడుగు పెట్టిన షా... అద్భుత షాట్లతో ఆకట్టుకుంటున్నాడు. దీంతో అతడి ఆటతీరును దిగ్గజ క్రికెటర్‌ సచిన్‌ టెండూల్కర్‌తో పోల్చడం మొదలైంది.  

అచ్చం అతడిలాగే...
సచిన్‌లానే 14 ఏళ్ల వయసులో స్కూల్‌ క్రికెట్‌లో అదరగొట్టిన పృథ్వీ, ఆ దిగ్గజ క్రికెటర్‌ తరహాలోనే అరంగేట్ర రంజీ, దులీప్‌ ట్రోఫీ మ్యాచ్‌ల్లోనూ శతకాల మోత మోగించాడు. ఇప్పుడిక ఈ ఐపీఎల్‌లో మూడు మ్యాచ్‌లాడిన అతడు 166.67 స్ట్రైక్‌ రేట్‌తో 140 పరుగులు చేశాడు. మొత్తం ఎదుర్కొన్న 84 బం తుల్లో ఐదింటిని మాత్రమే అడ్డదిడ్డంగా ఆడాడు. కవర్‌ డ్రైవ్‌ల తో 23 పరుగులు, ఆఫ్‌డ్రైవ్‌లతో 27 పరుగులు చేశాడు. 13 కట్‌ షాట్లు, 9 పుల్‌ షాట్లు సైతం కొట్టాడు. మేటి బ్యాట్స్‌మన్‌ తరహాలో పుల్‌ సహా అన్ని రకాల షాట్లు ఆడుతున్నాడు.

దీంతో పృథ్వీ సాంకేతికత, స్టాన్స్, షాట్లు కొట్టే విధం అచ్చం సచిన్‌ను తలపిస్తోందని ఆసీస్‌ మేటి క్రికెటర్‌ మార్క్‌ వా అంటున్నాడు. ‘షా బ్యాట్‌ పట్టుకునే విధానం, క్రీజులో కదిలే తీరు, వికెట్‌కు ఇరువైపులా షాట్లు కొట్టే సామర్థ్యం గమనించండి. అతడు బంతిని కొంత ఆలస్యంగా ఆడతాడు. కానీ ఆ స్ట్రోక్‌ ప్లే అద్భుతం. సచిన్‌లానే ఎలాంటి బౌలర్‌నైనా ఎదుర్కోగల సత్తా తనకుంది’ అంటూ మార్క్‌ కొనియాడాడు. మరికొందరు బ్యాక్‌ లిఫ్ట్‌ ఆడటంలో బ్రయాన్‌ లారాను, కవర్‌ డ్రైవ్‌లో విరాట్‌ కోహ్లిని మరిపిస్తున్నాడని పేర్కొంటున్నారు. యార్కర్‌ బంతులకు నిలిచి, డెత్‌ ఓవర్లలోనూ పరుగులు సాధించడం వంటి సవాళ్లను ఎదుర్కొంటే తిరుగుండదని చెబుతున్నారు.

Advertisement
Advertisement