మరో హ్యాట్రిక్ హీరో.. | Sakshi
Sakshi News home page

మరో హ్యాట్రిక్ హీరో..

Published Fri, Apr 14 2017 9:49 PM

మరో హ్యాట్రిక్ హీరో.. - Sakshi

రాజ్కోట్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10లో భాగంగా గుజరాత్ లయన్స్-పుణె సూపర్ జెయింట్ ల మధ్య జరుగుతున్న మ్యాచ్ లో మరో హ్యాట్రిక్ నమోదైంది. అంతకుముందు ముంబై ఇండియన్స్ తో మ్యాచ్ లో ఆర్సీబీ బౌలర్ శామ్యూల్ బద్రీ హ్యాట్రిక్ సాధించిన కొద్ది వ్యవధిలోనే, లయన్స్ బౌలర్ ఆండ్రూ టై హ్యాట్రిక్ వికెట్ల ఘనత నమోదు చేశాడు. పుణె ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్ లో టై వరుస వికెట్లను సాధించి శభాష్ అనిపించాడు. 20 ఓవర్ తొలి బంతికి అంకిత్ శర్మ(25)ను అవుట్ చేసిన టై, ఆ తరువాత బంతికి మనోజ్ తివారి(31)ని పెవిలియన్ కు పంపాడు. ఆ మరసటి బంతికి శార్దూల్ ఠాకూర్(0) ను అవుట్ చేసి హ్యాట్రిక్ సాధించాడు.

ఇదిలా ఉంచితే, ఇక్కడ రైజింగ్ పుణె 172 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ కు దిగిన పుణె ఆదిలోనే ఓపెనర్ అజింక్యా రహానే వికెట్ ను కోల్పోయింది. తొలి ఓవర్ లోనే రహానే డకౌట్ గా పెవిలియన్ చేరి నిరాశపరిచాడు. అనంతరం రాహుల్ త్రిపాఠి-స్టీవ్ స్మిత్ ల జోడి ఇన్నింగ్స్ ను చక్కదిద్దింది.ఈ జోడి 64 పరుగులు జోడించిన తరువాత రాహుల్ త్రిపాఠి(33)రెండో వికెట్ గా అవుటయ్యాడు. ఆపై స్వల్ప వ్యవధిలో స్టీవ్ స్మిత్(43) పెవిలియన్ చేరాడు. దాంతో పుణె స్కోరు బోర్డులో వేగం తగ్గింది. పుణె మిగతా ఆటగాళ్లలో బెన్ స్టోక్స్(25), మహేంద్ర సింగ్ ధోని(5)లు కూడా రాణించలేదు.

ఆ తరుణంలో అంకిత్ శర్మ-మనోజ్ తివారీ జోడి ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకెళ్లింది. ఈ జోడి 47 పరుగులు జోడించడంతో పుణె గాడిలో పడింది. అయితే చివరి ఓవర్ లో వరుసగా మూడు వికెట్లను పుణె కోల్పోవడంతో ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ లో ఆండ్రూ టై ఐదు వికెట్లు సాధించగా,  రవీంద్ర జడేజా, ప్రవీణ్ కుమార్, డ్వేన్ స్మిత్ లు తలో వికెట్ తీశారు.

Advertisement
Advertisement