ప్రత్యర్థులను 'రఫా'డిస్తున్నాడు! | Sakshi
Sakshi News home page

ప్రత్యర్థులను 'రఫా'డిస్తున్నాడు!

Published Sat, Sep 3 2016 9:24 AM

ప్రత్యర్థులను 'రఫా'డిస్తున్నాడు!

యూఎస్ ఓపెన్లో స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ జోరు కొనసాగుతోంది. శుక్రవారం రాత్రి జరిగిన మూడో రౌండ్లో 3 వరుస సెట్లలో నెగ్గి మ్యాచ్ కైవసం చేసుకున్నాడు. రష్యాకు చెందిన 47వ ర్యాంకర్ ఆండ్రీ కుజ్నెత్సోవ్ పై 6-1, 6-4, 6-2 తేడాతో గెలిచి నాలుగో రౌండ్లోకి సులువుగా ప్రవేశించాడు. 2015 ఫ్రెంచ్ గ్రాండ్ స్లామ్ తర్వాత రఫా నాలుగో రౌండ్లోకి ప్రవేశించిన తొలి గ్రాండ్ స్లామ్ ఇదే. 2013 యూఎస్ ఓపెన్ నెగ్గిన తర్వాత ఈ టోర్నమెంట్లో నాదల్ మరోసారి నాలుగో రౌండ్ చేరుకున్నాడు.

ఈ ఏడాది ఆస్ట్రేలియా ఓపెన్లో తొలి రౌండ్లోనే వెనుదిరిగిన నాదల్, ఫ్రెంచ్ ఓపెన్లో మూడో రౌండ్లో గాయపడి టోర్నమెంట్ నుంచి వైదొలగిన విషయం తెలిసిందే. రియో ఒలింపిక్స్ తో పునరాగమనం చేసిన నాదల్.. పురుషుల డబుల్స్ ఫైనల్ పోరులో మార్క్ లోపెజ్ తో కలిసి 6-2, 3-6, 6-4 తేడాతో ఫ్లోరిన్ మెర్జియా-హోరియా టెకూ(రొమేనియా)పై గెలిచి స్వర్ణం గెలుచుకున్నాడు. నాదల్ మరోసారి అదే స్థాయి ఆటతీరుతో యాఎస్ ఓపెన్లో చెలరేగిపోతున్నాడు. యూఎస్ ఓపెన్ లో నాలుగో రౌండ్ చేరినా ఇప్పటి వరకూ ఒక్క సెట్ కూడా ప్రత్యర్థికి కోల్పోక పోవడం విశేషం.

Advertisement
Advertisement