నాదల్‌ సునాయాసంగా... | Sakshi
Sakshi News home page

నాదల్‌ సునాయాసంగా...

Published Thu, Jun 1 2017 12:02 AM

నాదల్‌ సునాయాసంగా...

మూడో రౌండ్‌లోకి ప్రవేశం  
పారిస్‌: రికార్డుస్థాయిలో పదో ఫ్రెంచ్‌ ఓపెన్‌ టైటిల్‌పై గురి పెట్టిన స్పెయిన్‌ స్టార్‌ రాఫెల్‌ నాదల్‌ రెండో రౌండ్‌ను కూడా సాఫీగా దాటాడు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ రెండో రౌండ్‌లో నాలుగో సీడ్‌ నాదల్‌ 6–1, 6–4, 6–3తో రాబిన్‌ హాస్‌ (నెదర్లాండ్స్‌)ను ఓడించాడు. గంటా 49 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో నాదల్‌ నాలుగు ఏస్‌లు సంధించాడు. ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్‌ చేయడంతోపాటు 33 విన్నర్స్‌ కొట్టాడు. మరోవైపు డిఫెండింగ్‌ చాంపియన్, రెండో సీడ్‌ నొవాక్‌ జొకోవిచ్‌ (సెర్బియా) 6–1, 6–4, 6–3తో సుసా (పోర్చుగల్‌)పై గెలిచి మూడో రౌండ్‌లోకి అడుగుపెట్టాడు.

ఇతర రెండో రౌండ్‌ మ్యాచ్‌ల్లో పదో సీడ్‌ డేవిడ్‌ గాఫిన్‌ (బెల్జియం) 6–2, 6–4, 3–6, 6–3తో స్టకోవ్‌స్కీ (ఉక్రెయిన్‌)పై, ఆరో సీడ్‌ డొమినిక్‌ థీమ్‌ (ఆస్ట్రియా) 7–5, 6–1, 6–3తో బొలెలీ (ఇటలీ)పై, 11వ సీడ్‌ దిమిత్రోవ్‌ (బల్గేరియా) 6–3, 6–4, 7–5తో రొబ్రెడో (స్పెయిన్‌)పై నెగ్గారు. అయితే 12వ సీడ్‌ జో విల్‌ఫ్రైడ్‌ సోంగా (ఫ్రాన్స్‌) 5–7, 4–6, 7–6 (8/6), 4–6తో ప్రపంచ 91వ ర్యాంకర్‌ రెంజో ఒలివో (అర్జెంటీనా) చేతిలో ఓడిపోయాడు. 2007లో ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ తర్వాత సోంగా ఓ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో తొలి రౌండ్‌లోనే ఓడిపోవడం ఇదే తొలిసారి.

శ్రమించిన ముగురుజా: మహిళల సింగిల్స్‌ విభాగంలో డిఫెండింగ్‌ చాంపియన్‌ ముగురుజా (స్పెయిన్‌) రెండో రౌండ్‌లో 6–7 (4/7), 6–4, 6–2తో కొంటావీట్‌ (ఎస్తోనియా)పై కష్టపడి గెలిచి మూడో రౌండ్‌లోకి ప్రవేశించింది. ఇతర రెండో రౌండ్‌ మ్యాచ్‌ల్లో పదో సీడ్‌ వీనస్‌ విలియమ్స్‌ (అమెరికా) 6–3, 6–1తో కురుమి నారా (జపాన్‌)పై, 11వ సీడ్‌ వొజ్నియాకి (డెన్మార్క్‌) 6–0, 6–0తో అబాండా (కెనడా)పై గెలిచారు. 15వ సీడ్‌ పెట్రా క్విటోవా (చెక్‌ రిపబ్లిక్‌) 6–7 (5/7), 6–7 (5/7)తో బెథానీ మాటెక్‌ సాండ్స్‌ (అమెరికా) చేతిలో ఓడింది. తొలి రౌండ్‌లో ప్రపంచ నంబర్‌వన్, టాప్‌ సీడ్‌ ఎంజెలిక్‌ కెర్బర్‌ (జర్మనీ)ని ఓడించిన ఎకతెరీనా మకరోవా రెండో రౌండ్‌లో 2–6, 2–6తో సురెంకో (ఉక్రెయిన్‌) చేతిలో పరాజయం పాలైంది.

Advertisement
Advertisement