Sakshi News home page

రాయల్స్ దెబ్బ

Published Fri, Apr 17 2015 12:55 AM

రాయల్స్ దెబ్బ

రాజస్తాన్ ఖాతాలో నాలుగో విజయం

సమష్టిగా రాణించిన బౌలర్లు
రహానే అర్ధసెంచరీ ళీ పోరాడి ఓడిన సన్‌రైజర్స్

అద్భుతాలను ఆశించడంలేదు... అదృష్టాన్నీ నమ్ముకోవడం లేదు... సంచలనాల జోలికి అసలే పోవడం లేదు.... కేవలం తమ సత్తాను మాత్రమే నమ్ముకున్న రాజస్తాన్ రాయల్స్.. ఐపీఎల్‌లో దుమ్మురేపుతోంది. ఒకరు కాకపోతే ఇంకొకరు అనే రీతిలో సమష్టి తత్వాన్ని తమ విజయతంత్రంగా మార్చుకుని జైత్రయాత్ర కొనసాగిస్తోంది. జట్టులో అందరూ కుర్రాళ్లే.. కానీ ఆటలో మాత్రం వయసుకు మించిన అనుభవాన్ని చూపెడుతూ మేటి జట్లకు సైతం షాకిస్తున్నారు. ధావల్ కులకర్ణి, ప్రవీణ్ తాంబేల నాణ్యమైన బౌలింగ్‌కు తోడు... రహానే బ్యాటింగ్‌లో మెరవడంతో స్వల్ప లక్ష్యాన్ని అలవోకగా ఛేదించిన రాయల్స్,.. సన్‌రైజర్స్‌కు షాకిచ్చింది.
 
సాక్షి, విశాఖపట్నం : ఆసీస్ కెప్టెన్‌గా ఇంతవరకు పరాజయం ఎరుగని స్టీవెన్ స్మిత్.. ఐపీఎల్‌లోనూ దాన్ని కొనసాగిస్తున్నాడు. సమయోచిత నిర్ణయాలతో పాటు సమయానుకూలంగా వ్యూహాలను అమలు చేస్తూ రాజస్తాన్ జట్టుకు వరుస విజయాలు అందిస్తున్నాడు. బౌలర్లను మార్చడం.. ఫీల్డర్ల మోహరింపులో తన ప్రత్యేకతను చాటుకుంటూ ప్రత్యర్థి జట్లను తక్కువ స్కోరుకే కట్టడి చేస్తున్నాడు. ఫలితంగా గురువారం సన్‌రైజర్స్‌తో జరిగిన ఓ లో స్కోరింగ్ మ్యాచ్‌లో 128 పరుగుల లక్ష్యాన్ని రాజస్తాన్ 6 వికెట్ల తేడాతో  ఛేదించింది.

డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో... టాస్ గెలిచి రాజస్తాన్ ఫీల్డింగ్ ఎంచుకోగా, బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 127 పరుగులు చేసింది. మోర్గాన్ (30 బంతుల్లో 27; 2 ఫోర్లు, 1 సిక్స్), నమన్ ఓజా (32 బంతుల్లో 25; 3 ఫోర్లు), రవి బొపారా (19 బంతుల్లో 23 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్) వార్నర్ (14 బంతుల్లో 21; 3 ఫోర్లు, 1 సిక్స్) తలా కొన్ని పరుగులు జత చేశారు. తర్వాత రాజస్తాన్ సరిగ్గా 20 ఓవర్లలో 4 వికెట్లకు 131 పరుగులు చేసి ఆఖరి బంతికి నెగ్గింది. రహానే (56 బంతుల్లో 62; 9 ఫోర్లు) టాప్ స్కోరర్. శామ్సన్ (30 బంతుల్లో 26; 2 ఫోర్లు) రాణించాడు. రహానేకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.

ధావల్ విజృంభణ
మోరిస్ వేసిన ఇన్నింగ్స్ రెండో ఓవర్‌లోనే వార్నర్ మూడు ఫోర్లు బాది ఊపు తెచ్చినా... రాజస్తాన్ పేసర్ ధావల్ కులకర్ణి బంతితో ఆకట్టుకున్నాడు. తన వరుస రెండు (4, 6) ఓవర్లలో ధావన్ (12 బంతుల్లో 10; 2 ఫోర్లు)తో పాటు లోకేశ్ రాహుల్ (2)ను అవుట్ చేశాడు. మధ్యలో వార్నర్ అనూహ్యంగా రనౌటయ్యాడు. దీంతో రైజర్స్ 35 పరుగులకే మూడు కీలక వికెట్లు చేజార్చుకుంది. ఈ దశలో మోర్గాన్, నమన్ ఓజాలు ఆచితూచి ఆడటంతో రన్‌రేట్ మందగించింది. ఫలితంగా తొలి 10 ఓవర్లలో హైదరాబాద్ 55 పరుగులు మాత్రమే చేసింది.

ఫాల్క్‌నర్ వేసిన 11వ ఓవర్‌లో మోర్గాన్ సిక్స్ బాది కాస్త జోరు పెంచే ప్రయత్నం చేసినా.. రెండో ఎండ్‌లో ఓజా ఎక్కువగా సింగిల్స్‌కే పరిమితమయ్యాడు. అప్పటి వరకు పేసర్లతో బౌలింగ్ చేయించిన స్మిత్ 13వ ఓవర్‌లో స్పిన్నర్ తాంబేకు బంతి ఇచ్చాడు. చాలా పొదుపుగా బౌలింగ్ చేసిన ఈ లెగ్ స్పిన్నర్ తన తొలి మూడు ఓవర్లలో ఓజా, మోర్గాన్‌లను అవుట్ చేసి రైజర్స్ దెబ్బతీశాడు. ఈ ఇద్దరు నాలుగో వికెట్‌కు 52 పరుగులు జోడించారు. చివర్లో బొపారా, ఆశిష్ రెడ్డి (9 బంతుల్లో 13 నాటౌట్; 1 సిక్స్) వేగంగా ఆడి ఆరో వికెట్‌కు 21 బంతుల్లో అజేయంగా 31 పరుగులు జోడించడంతో హైదరాబాద్‌కు ఆ మాత్రం స్కోరైనా దక్కింది.

ఓపెనర్ల శుభారంభం
లక్ష్యం చిన్నది కావడంతో రాజస్తాన్ ఓపెనర్లు రహానే, శామ్సన్ ఎలాంటి ఒత్తిడి లేకుండా ఆడారు. సింగిల్స్, డబుల్స్ తీస్తూ వీలైనప్పుడల్లా బౌండరీలతో రన్‌రేట్ తగ్గకుండా చూశారు. ఆరుకుపైగా రన్‌రేట్ సాధించిన ఈ ఇద్దరు తొలి వికెట్‌కు 64 పరుగులు జోడించి శుభారంభాన్నిచ్చారు. అయితే 11వ ఓవర్‌లో శామ్సన్ అవుటైన తర్వాత వచ్చిన కెప్టెన్ స్మిత్ (10 బంతుల్లో 13; 2 ఫోర్లు)తో పాటు కరణ్ నాయర్ (1) స్వల్ప వ్యవధిలో అవుటైనా.. రెండో ఎండ్‌లో రహానే 46 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేశాడు. బిన్నీ (14 బంతుల్లో 16 నాటౌట్; 1 ఫోర్)తో కలిసి నిలకడగా ఇన్నింగ్స్ ముందుకు తీసుకెళ్లారు.

ఈ ఇద్దరు నాలుగో వికెట్‌కు 27 పరుగులు సమకూర్చారు. అయితే 12 బంతుల్లో 12 పరుగులు చేయాల్సిన దశలో రహానే క్లీన్ బోల్డ్ కావడంతో మ్యాచ్ ఉత్కంఠకు తెరతీసింది. తర్వాత బిన్నీ ఫోర్ కొట్టడంతో రాజస్తాన్ విజయ సమీకరణం 6 బంతుల్లో 5 పరుగులుగా మారింది. అయితే ప్రవీణ్ మెరుగ్గా బంతులు వేయడంతో ఫాల్క్‌నర్ (6 నాటౌట్), బిన్నీ సింగిల్స్‌కు పరిమితమయ్యారు. ఇక  చివరి బంతికి ఒక పరుగు చేయాల్సిన దశలో ఫాల్క్‌నర్ ఫోర్ కొట్టి రాజస్తాన్‌ను గెలిపించాడు.  

స్కోరు వివరాలు
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్ : వార్నర్ రనౌట్ 21; ధావన్ (సి) శామ్సన్ (బి) ధావల్ 10; లోకేశ్ రాహుల్ ఎల్బీడబ్ల్యు (బి) ధావల్ 2; నమన్ ఓజా (బి) తాంబే 25; మోర్గాన్ ఎల్బీడబ్ల్యు (బి) తాంబే 27; బొపారా నాటౌట్ 23; ఆశిష్ రెడ్డి నాటౌట్ 13; ఎక్స్‌ట్రాలు: 6; మొత్తం: (20 ఓవర్లలో 5 వికెట్లకు) 127.
వికెట్ల పతనం : 1-25; 2-35; 3-35; 4-87; 5-96.
బౌలింగ్: సౌతీ 4-0-30-0; మోరిస్ 3-0-23-0; హూడా 2-0-11-0; ధావల్ 3-1-9-2; ఫాల్క్‌నర్ 2-0-20-0; బిన్నీ 2-0-12-0; తాంబే 4-0-21-2.

రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్ : రహానే (బి) బౌల్ట్ 62;  శామ్సన్ (సి) నమన్ (బి) బొపారా 26; స్మిత్ (సి) వార్నర్ (బి) కరణ్ 13; కరణ్ నాయర్ (సి అండ్ బి) బొపారా 1; బిన్నీ నాటౌట్ 16; ఫాల్క్‌నర్ నాటౌట్ 6; ఎక్స్‌ట్రాలు: 7; మొత్తం: (20 ఓవర్లలో 4 వికెట్లకు) 131.
వికెట్ల పతనం : 1-64; 2-84; 3-91; 4-118.
బౌలింగ్ : భువనేశ్వర్ 4-0-25-0; బౌల్ట్ 4-0-31-1; ప్రవీణ్ 4-0-30-0; కరణ్ శర్మ 3-0-19-1; బొపారా 4-0-18-2; ఆశిష్ రెడ్డి 1-0-5-0.
 
ఆదరణ అంతంత మాత్రం
గతంలో ఐపీఎల్ మ్యాచ్‌లు ఎప్పుడు జరిగినా విశాఖపట్నంలో అభిమానులు భారీగా వచ్చేవారు. కానీ ఈసారి మాత్రం ఆశించిన స్థాయిలో ప్రేక్షకులు రాక స్టాండ్స్ వెలవెలబోయాయి. సన్‌రైజర్స్ తమ ఏడు హోమ్ మ్యాచ్‌లలో మూడు వైజాగ్‌లో నిర్వహిస్తోంది. ఇక్కడ తర్వాతి మ్యాచ్ శనివారం జరుగుతుంది.

Advertisement

What’s your opinion

Advertisement