ఐపీఎల్‌కు ఇది సరైన సమయం కాదు: రజనీకాంత్‌ | Sakshi
Sakshi News home page

Published Sun, Apr 8 2018 3:47 PM

Rajinikanth Says Time Not Right For IPL In Chennai - Sakshi

చెన్నై : కావేరీ జలమండలి ఏర్పాటు చేసేవరకు చెన్నైలో ఐపీఎల్‌ మ్యాచ్‌లు నిర్వహించవద్దని ఆ రాష్ట్ర అధికార, విపక్షాలతో పాటు పలు ప్రజా సంఘాలు రోడ్డెక్కిన విషయం తెలిసిందే. అయితే ఈ డిమాండ్‌కు తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ సైతం మద్దతు తెలిపారు. ప్రజల ఇబ్బందులను, మనోభావాలను, బాధలను అర్థం చేసుకోవాలని కోరారు. 

కావేరి జలమండి ఏర్పాటు చేయాలని తమిళ సినీ ప్రదర్శన చేపట్టిన నిరసన కార్యక్రమంలో రజనీకాంత్‌, కమలహాసన్‌లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రజనీకాంత్‌ మాట్లాడుతూ.. ‘చెన్నైలో ఐపీఎల్‌ మ్యాచ్‌లు నిర్వహించడానికి ఇది సరైన సమయం కాదు. ఓ వైపు రైతులు నీటి కష్టాలతో అల్లాడిపోతున్నారు. వారి బాధను అర్థం చేసుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. ఒకవేళ మ్యాచ్‌లను రద్దుచేయడం సాధ్యం కాకపోతే చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) జట్టు సభ్యులు కనీసం నల్ల బ్యాడ్జీలు ధరించైనా రైతుల నిరసనకు మద్దతు తెలపాలి’ అని రజనీకాంత్‌ సూచించారు. 

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలని రజనీకాంత్ ఈ సందర్భంగా కోరారు. కావేరీ వాటర్ మేనేజ్‌మెంట్ బోర్డును ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించిందని, తక్షణమే బోర్డును ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. మరో తమిళ నటుడు కమలహాసన్‌ సైతం ఐపీఎల్‌ మ్యాచ్‌ల నిర్వహణను వ్యతిరేకించారు. ఈ నిరసన కార్యక్రమానికి తమిళ నటులు విశాల్‌, విజయ్‌, ధనుష్‌, కాంగ్రెస్‌ నేత కుష్బూ, సంగీత దర్శకుడు ఇళయరాజాలు హాజరయ్యారు.

Advertisement
Advertisement