రవిశాస్త్రికి జై | Sakshi
Sakshi News home page

రవిశాస్త్రికి జై

Published Wed, Jul 12 2017 12:32 AM

రవిశాస్త్రికి జై

భారత క్రికెట్‌ జట్టు హెడ్‌ కోచ్‌గా నియామకం
2019 ప్రపంచకప్‌ వరకు పదవిలో
బౌలింగ్‌ కోచ్‌గా జహీర్‌ ఖాన్‌
విదేశీ పర్యటనల్లో బ్యాటింగ్‌ కన్సల్టెంట్‌గా ద్రవిడ్‌
బీసీసీఐ అధికారిక ప్రకటన  


సస్పెన్స్, సుదీర్ఘ డ్రామాకు తెర పడింది. ఎంపిక పరీక్షలో ఊహించిన ఫలితమే వచ్చింది. పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌లు, భవిష్యత్తు ప్రణాళికలు ఎవరు ఎలా రూపొందించినా చివరకు కెప్టెన్‌ కోహ్లి మాటే నెగ్గింది. ఆటగాడిగా, వ్యాఖ్యాతగా అపార అనుభవంతో పాటు కెప్టెన్‌తో ఉన్న సాన్నిహిత్యం అదనపు అర్హతగా మారి రవిశాస్త్రిని అందరికంటే ముందు నిలబెట్టాయి. మంగళవారం సాయంత్రమే ఆయన కోచ్‌గా ఎంపికైనట్లు వార్తలు, ఆ తర్వాత కొద్ది సేపటికి బోర్డు ఖండన, మరికొన్ని గంటల తర్వాత అదే తమ నిర్ణయమంటూ ప్రకటన... కోచ్‌ ప్రకటన వ్యవహారం మలుపులు తిరిగి చివరకు శాస్త్రి ఎంపికతో ఆగింది. మేనేజర్‌గా, టీమ్‌ డైరెక్టర్‌ హోదాలో గతంలో పని చేసిన ఈ ‘ముంబైకర్‌’ ఇంగ్లండ్‌లో జరిగే 2019 ప్రపంచ కప్‌ వరకు భారత క్రికెట్‌కు దిశానిర్దేశం చేయడంలో కీలక పాత్ర పోషించనున్నారు. ‘రోగి కోరిందే వైద్యుడు ఇచ్చాడనేది’ శాస్త్రి తన వ్యాఖ్యానంలో తరచుగా వాడే మాట. అందరూ ముందే రవిశాస్త్రిని కోచ్‌గా కోరుకొని దాని ప్రకారమే దరఖాస్తులు, ఇంటర్వ్యూల ప్రక్రియ ప్రహసనాన్ని నడిపించారనేది మాత్రం స్పష్టం.  

ముంబై: భారత క్రికెట్‌ జట్టు హెడ్‌ కోచ్‌గా 55 ఏళ్ల రవిశంకర్‌ జయధ్రిత శాస్త్రిని నియమిస్తున్నట్లు బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. వచ్చే రెండేళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. మంగళవారం రాత్రి బోర్డు తాత్కాలిక అధ్యక్షుడు సీకే ఖన్నా ఈ విషయాన్ని ధ్రువీకరించారు. శాస్త్రికి అండగా నిలిచేందుకు బోర్డు మరో ఇద్దరు మాజీ ఆటగాళ్లను కూడా శిక్షణా బృందంలోకి తీసుకుంది. మాజీ పేసర్‌ జహీర్‌ ఖాన్‌ బౌలింగ్‌ కోచ్‌గా వ్యవహరిస్తారు. గతంలో ఏ జట్టుకూ లేని విధంగా ఈ సారి కొత్తగా ‘విదేశీ పర్యటనల్లో బ్యాటింగ్‌ కన్సల్టెంట్‌’ అనే పదవిని బోర్డు సృష్టించింది. మాజీ కెప్టెన్, దిగ్గజ బ్యాట్స్‌మన్‌ రాహుల్‌ ద్రవిడ్‌ టెస్టు ఫార్మాట్‌లో ఈ బాధ్యతలు నిర్వర్తిస్తారు.

ఇప్పటికే భారత ‘ఎ’, అండర్‌–19 జట్లకు కోచ్‌గా ఉన్న ద్రవిడ్‌కు ఇది అదనపు బాధ్యత. ఈ నెల 26 నుంచి శ్రీలంకతో జరిగే సిరీస్‌ నుంచి రవిశాస్త్రి పదవీకాలం ప్రారంభమవుతుంది. అమెరికాలో ఉన్న కోహ్లితో కోచ్‌ అంశాన్ని చర్చించిన తర్వాతే అతని పేరు ప్రకటిస్తామని సలహా కమిటీ సభ్యుడు సౌరవ్‌ గంగూలీ మంగళవారం సాయంత్రం వరకు కూడా చెబుతూ వచ్చారు. చివరకు రాత్రి ఆలస్యంగా శాస్త్రి పేరును వెల్లడించారు. హెడ్‌ కోచ్‌ పేరును మరికొన్ని రోజుల్లో ప్రకటిస్తామని సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో గంగూలీ తెలిపారు. అయితే మంగళవారమే కోచ్‌ పేరును ప్రకటించాలని సీఓఏ చీఫ్‌ వినోద్‌ రాయ్‌ ఒత్తిడి చేయడంతో బీసీసీఐ ఆలస్యం చేయలేదు. నిజానికి కోచ్‌ పదవి కోసం ముందుగా రవిశాస్త్రి దరఖాస్తు చేసుకోలేదు. అయితే గడువు పొడిగించిన తర్వాత సచిన్‌ టెండూల్కర్‌ సూచనతో ఆయన కూడా రేసులోకి వచ్చారు. కోహ్లి కూడా శాస్త్రి వైపు మొగ్గు చూపుతుండటంతో అవకాశాలు మెరుగయ్యాయి. సోమవారం ఇంటర్వ్యూ తర్వాత కాస్త సందేహాలు రేకెత్తినా... చివరకు భారత మాజీ ఆల్‌రౌండర్‌దే పైచేయి అయింది.  

వ్యాఖ్యానం నుంచి శిక్షణ వైపు
రిటైర్మెంట్‌ తర్వాత రవిశాస్త్రి అత్యంత విజయవంతమైన కామెంటేటర్‌గా నిలిచారు. సూటిగా, స్పష్టంగా, ప్రవాహంలా సాగే ఆయన వ్యాఖ్యానం క్రికెట్‌ అభిమానులను అమితంగా ఆకట్టుకుంది. కామెంటేటర్‌గా బిజీగా ఉన్న సమయంలో బోర్డు విజ్ఞప్తి మేరకు తొలిసారి 2007లో మేనేజర్‌ హోదాలో రవిశాస్త్రి భారత జట్టుతో కలిసి బంగ్లాదేశ్‌ సిరీస్‌కు పని చేశారు. ఆ తర్వాత 2014 ఆగస్టు నుంచి జూన్‌ 2016 వరకు శాస్త్రి టీమ్‌ డైరెక్టర్‌గా వ్యవహరించారు. ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో ఘోర పరాజయం తర్వాత వన్డే సిరీస్‌ నుంచి ఆయన జట్టుతో కలిశారు. భారత్‌ ఈ సిరీస్‌ గెలిచింది.

2015 వన్డే వరల్డ్‌ కప్‌ వరకు కూడా నాటి కోచ్‌ డంకన్‌ ఫ్లెచర్‌తో కలిసి పని చేశారు. ఆస్ట్రేలియాతో టెస్టు, వన్డే సిరీస్‌లు ఓడినా... వరల్డ్‌ కప్‌లో జట్టు సెమీస్‌ చేరింది. ఫ్లెచర్‌ తప్పుకున్న తర్వాత స్వతంత్ర డైరెక్టర్‌గా పని చేశారు. ఆ సమయంలో భారత్‌ శ్రీలంక, దక్షిణాఫ్రికాలపై టెస్టు సిరీస్‌లతో పాటు ఆసియా కప్‌ గెలిచింది. అయితే గత ఏడాది ఆయన తన పదవిని కుంబ్లేకు కోల్పోయారు. ఇప్పుడు మళ్లీ కోచ్‌ హోదాలోకి వచ్చారు. కుంబ్లేతో పోలిస్తే కఠినంగా ఉండరని, తమకు మంచి స్వేచ్ఛనిస్తారని ఆటగాళ్లు బలంగా నమ్మారు. రాబోయే రెండేళ్లు ఆయన కోచ్‌గా ఎలా పని చేయబోతున్నారన్నది ఆసక్తికరం.  

‘చాంపియన్‌’ ఆటగాడు
వరల్డ్‌ కప్‌ విజేతగా నిలిచిన జట్టులో సభ్యుడు... బ్యాటింగ్‌ ఆర్డర్‌లో 1 నుంచి 10వ స్థానం వరకు కూడా బరిలోకి దిగి రాణించిన ఆటగాడు... ఆల్‌రౌండర్‌గా తనదైన ముద్ర... నెమ్మదైన బ్యాటింగ్‌ శైలి, సునీల్‌ గావస్కర్‌ అండతోనే కొనసాగాడనే విమర్శ... ఆటగాడిగా రవిశాస్త్రి బయోడేటాలో ముఖ్యాంశాలు ఇవి. ఆయన గురించి వేర్వేరు సమయాల్లో ఎన్ని ప్రతికూల మాటలు వినిపించినా దశాబ్ద కాలానికి పైగా భారత క్రికెట్‌లో శాస్త్రి శకం కొనసాగింది. స్లో లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌గా జట్టులోకి వచ్చి ఆ తర్వాత ప్రధాన బ్యాట్స్‌మన్‌గా ఎదగడం, ఎన్నో చిరస్మరణీయ విజయాల్లో భాగం కావడం కేవలం ఆయన పట్టుదల, కఠిన సాధన వల్లే సాధ్యమైంది. తనలో సహజ ప్రతిభ లేదని చాలా సార్లు స్వయంగా చెప్పుకున్న రవిశాస్త్రి... వంద శాతంకంటే ఎక్కువగా మైదానంలో శ్రమించేవారని ఆయన సహచరులు చెప్పే మాట.

1985లో ఆస్ట్రేలియాలో జరిగిన వన్డే వరల్డ్‌ చాంపియన్‌షిప్‌లో భారత జట్టు విజయంలో కీలక పాత్ర పోషించి ‘చాంపియన్‌ ఆఫ్‌ చాంపియన్స్‌’ అవార్డు అందుకోవడం శాస్త్రి కెరీర్‌లో అత్యుత్తమ ఘట్టం. అది ఆయనను ఒక్కసారిగా గ్లామర్‌ బాయ్‌ ఇమేజ్‌ను కూడా తీసుకొచ్చింది. భారత్‌కు ఒకే ఒక టెస్టులో కెప్టెన్‌గా వ్యవహరించిన రవిశాస్త్రి... వరుస వైఫల్యాల తర్వాత 30 ఏళ్లకే క్రికెట్‌కు ఆటకు గుడ్‌బై చెప్పారు. ఒకప్పుడు జిడ్డు బ్యాటింగ్‌కు పర్యాయపదంగా నిలిచిన ఆయన రంజీ ట్రోఫీలో ఒకే ఓవర్లో ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టిన అరుదైన ఘనతను కూడా తన ఖాతాలో వేసుకున్నారు!

80 టెస్టుల్లో 3,830 పరుగులు చేసి 151 వికెట్లు తీసిన రవిశాస్త్రి...
150 వన్డేల్లో 3,108 పరుగులు చేసి 129 వికెట్లుపడగొట్టారు.

తన బాధ్యతల నుంచి ఆయన ఎప్పుడూ తప్పించుకునే ప్రయత్నం చేయరు. దేనికైనా ఎదురొడ్డి నిలిచే తత్వం. చురుకుదనానికి చిరునామాలా ఉంటారు. ఆయన మాతో కలిసి పని చేయాలని ఎప్పుడూ కోరుకుంటాం. ఆయన జట్టుతో ఉంటే చాలు అదే మాకు ఎనలేని ఉత్సాహాన్ని ఇస్తుంది.
– రవిశాస్త్రి గురించి విరాట్‌ కోహ్లి అభిప్రాయం

Advertisement

తప్పక చదవండి

Advertisement