ఉతప్ప ఉతికేశాడు

27 Apr, 2017 07:43 IST|Sakshi
ఉతప్ప ఉతికేశాడు

47 బంతుల్లో 7 ఫోర్లు 6 సిక్సర్లతో 87
పుణేపై కోల్‌కతా ఘనవిజయం
గంభీర్‌ అర్ధసెంచరీ


పుణే: రాబిన్‌ ఉతప్ప (47 బంతుల్లో 87; 7 ఫోర్లు, 6 సిక్సర్లు) వీరబాదుడుకు కెప్టెన్‌ గౌతమ్‌ గంభీర్‌ (46 బంతుల్లో 62; 6 ఫోర్లు, 1 సిక్స్‌) సొగసైన ఇన్నింగ్స్‌ తోడవడంతో... బుధవారం రైజింగ్‌ పుణే సూపర్‌జెయింట్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్టు ఏడు వికెట్ల తేడాతో నెగ్గింది. ఈ విజయంతో కోల్‌కతా 12 పాయింట్లతో అగ్ర స్థానానికి చేరుకుంది. గౌతీ, ఉతప్పల జోరుకు రెండో వికెట్‌కు 158 పరుగుల భారీ భాగస్వామ్యం సమకూరింది.

మరోవైపు ఇక్కడ ఆడిన ఆరు మ్యాచ్‌ల్లోనూ కోల్‌కతా నెగ్గడం విశేషం. అంతకుముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పుణే 20 ఓవర్లలో 5 వికెట్లకు 182 పరుగులు చేసింది. కెప్టెన్‌ స్మిత్‌ (37 బంతుల్లో 51 నాటౌట్‌; 4 ఫోర్లు, 1 సిక్స్‌), రహానే (41 బంతుల్లో 46; 4 ఫోర్లు, 1 సిక్స్‌), రాహుల్‌ త్రిపాఠి (23 బంతుల్లో 38; 7 ఫోర్లు) రాణించారు. కుల్దీప్‌యాదవ్‌కు రెండు వికెట్లు దక్కాయి. అనంతరం బరిలోకి దిగిన కోల్‌కతా 18.1 ఓవర్లలో మూడు వికెట్లకు 184 పరుగులు చేసి నెగ్గింది. ఉతప్పకు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు దక్కింది. ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల దాడిలో మరణించిన సీఆర్‌పీఎఫ్‌ జవానులకు సంతాప సూచకంగా ఈ మ్యాచ్‌లో కోల్‌కతా ఆటగాళ్లు భుజాలకు నల్ల బ్యాండ్‌లు ధరించి బరిలోకి దిగారు. గురువారం జరిగే మ్యాచ్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుతో గుజరాత్‌ లయన్స్‌ తలపడుతుంది.

స్మిత్‌ జోరు...
మొదట బ్యాటింగ్‌కు దిగిన పుణేకు ఓపెనర్లు రహానే, త్రిపాఠి మరోసారి శుభారంభాన్ని అందించారు. మూడో ఓవర్‌లో రెండు ఫోర్లు కొట్టిన త్రిపాఠి.. ఆరో ఓవర్‌లో మూడు ఫోర్లతో జోరును కనబరిచాడు. దీంతో జట్టు పవర్‌ ప్లేలో 57 పరుగులు సాధించింది. అంతకుముందు ఓవర్‌లో రహానే భారీ సిక్సర్‌ బాదాడు. ఏడో ఓవర్‌లో త్రిపాఠి ఇచ్చిన క్యాచ్‌ను యూసుఫ్‌ వదిలేసినా మరుసటి ఓవర్‌లోనే తనను పీయూశ్‌ చావ్లా బౌల్డ్‌ చేశాడు. దీంతో తొలి వికెట్‌కు 65 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఆ తర్వాత రహానేతో కలిసి కెప్టెన్‌ స్మిత్‌ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపాడు. అయితే అర్ధ సెంచరీ వైపు సాగుతున్న రహానే... నరైన్‌ బౌలింగ్‌లో స్టంప్‌ అవుటయ్యాడు. ఆ తర్వాత క్రీజులో ఉన్నంతసేపు ధోని (11 బంతుల్లో 23; 1 ఫోర్, 2 సిక్సర్లు) బ్యాట్‌ను ఝుళిపించాడు. 15వ ఓవర్‌లో వరుసగా 4,6 బాదిన తను మరుసటి ఓవర్‌లో మరో భారీ సిక్స్‌తో చెలరేగాడు. అయితే కుల్దీప్‌ యాదవ్‌ బౌలింగ్‌లో స్టంప్‌ అవుట్‌గా వెనుదిరిగాడు. అదే ఓవర్‌లో మనోజ్‌ తివారి (1) కూడా అదే రీతిన అవుట్‌ అయినా... క్రిస్టియాన్‌ (6 బంతుల్లో 16; 2 సిక్సర్లు), స్మిత్‌ చివరి రెండు ఓవర్లలో 30 పరుగులు రాబట్టారు.

ఉతప్ప, గంభీర్‌ నిలకడ...
లక్ష్యం కోసం బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా ఇన్నింగ్స్‌లో దాదాపు మ్యాచ్‌ అంతా ఉతప్ప, గంభీర్‌ జోరే కనిపించింది. నరైన్‌ (11 బంతుల్లో 16; 3 ఫోర్లు) మూడో ఓవర్‌లోనే రనౌట్‌ అయినా ఉన్నంత సేపు వేగంగా ఆడాడు. ఆ తర్వాత గంభీర్, ఉతప్ప కలిసి పుణే బౌలర్లపై ఆధిపత్యం ప్రదర్శించారు. వీరి జోరుకు పుణే ఫీల్డింగ్‌లోపం కూడా జత కలిసింది. ఏడో ఓవర్‌లో ఉతప్ప ఇచ్చిన క్యాచ్‌ను ఉనాద్కట్‌ వదిలేయడంతో జట్టు తగిన మూల్యం చెల్లించుకుంది. ఆ తర్వాతి ఓవర్‌లో తను 4,6,6తో చెలరేగాడు. ఇదే జోరుతో 26 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 11వ ఓవర్‌లో గంభీర్‌ క్యాచ్‌ను వాషింగ్టన్‌ సుందర్‌ వదిలేయగా 35 బంతుల్లో తను కూడా హాఫ్‌ సెంచరీ సాధించాడు. 16వ ఓవర్‌లో ఉతప్ప రెండు భారీ సిక్సర్లు సంధించడంతో లక్ష్యం మరింత తగ్గింది. అయితే వరుస ఓవర్లలో గంభీర్, ఉతప్ప అవుటైనా అప్పటికే కోల్‌కతా విజయం ఖాయమైంది. ఐపీఎల్‌లో గంభీర్‌కు కెప్టెన్‌గా ఇది 100వ మ్యాచ్‌ కావడం విశేషం. 

మరిన్ని వార్తలు