ఏబీ సెంచరీ.. బెంగళూరు ఘనవిజయం | Sakshi
Sakshi News home page

ఏబీ సెంచరీ.. బెంగళూరు ఘనవిజయం

Published Sun, May 10 2015 7:35 PM

ఏబీ సెంచరీ.. బెంగళూరు ఘనవిజయం

ముంబై: ఐపీఎల్-8లో భాగంగా ఆదివారం సాయంత్రం జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ పై 39 పరుగుల తేడాతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘనవిజయం సాధించింది. బెంగళూరు నిర్దేశించిన 236 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించడానికి బ్యాటింగ్ కు దిగిన ముంబై ఇండియన్స్ నిర్ణీత ఓవర్లన్నీ ఆడి 7 వికెట్ల నష్టానికి 197 పరుగులే చేసింది. బెంగళూరు బౌలర్లలో హర్షల్ పటేల్, చాహల్ రెండేసి వికెట్లు పడగొట్టగా.. మిచెల్ స్టార్క్,  శ్రీనాథ్ అరవింద్ తలో వికెట్ తీశారు.

అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టు నిర్ణీత ఓవర్లలో వికెట్ నష్టపోయి 235 పరుగులు చేసింది. 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' ఏబీ డివిలియర్స్ (133) విధ్వంసానికి తోడు కెప్టెన్ విరాట్ కోహ్లి (82; 50 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లు) ముంబై బౌలర్లపై తమదైన శైలిలో బ్యాట్ ఝుళిపించారు.

'భూకంపం కాదు.. ఏబీ సునామీ'
క్రిస్ గేల్ను అవుట్ చేసిన ఆనందం ముంబై బౌలర్లలో ఎంతోసేపు లేదు. ఎందుకంటే 'గేల్ కంపం' తర్వాత వచ్చేది 'ఏబీ సునామీ' అని.. డివిలియర్స్ క్రీజులో కుదురుకోవడానికి కాస్త సమయం తీసుకున్నా తర్వాత తనదైన శైలిలో ముంబై బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం  59 బంతుల్లోనే 19 ఫోర్లు, 4 సిక్సర్లతో 133 (నాటౌట్) పరుగులు చేసి ఐపీఎల్ కెరీర్లో రెండో సెంచరీ నమోదు చేశాడు.

విండీస్ వీరుల పోరాటం వృథా
బెంగళూరు నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని ఛేదించటంలో ముంబై జట్టులో ఉన్న విండీస్ ఆటగాళ్లు లెండిల్ సిమ్మన్స్ (68 నాటౌట్; 53 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లు), కీరన్ పొలార్డ్ (49; 24 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లు ) భారీ షాట్లతో విరుచుకుపడినా ముంబైకి ఓటమి తప్పలేదు. వీరిద్దరి వీరంగంతో ఓ దశలో ముంబై ఇండియన్స్ గెలిచేలా కనిపించినా.. పొలార్డ్ అవుటవ్వడంతో ముంబై ఓటమి ఖరారైంది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన బ్యాట్స్ మన్ ఎవ్వరూ చెప్పుకోదగ్గ స్కోరు చేయలేదు.

పేలవంగా ఫీల్డింగ్.. బౌలింగ్..
ఆరంభం నుంచి ముంబై ఆటగాళ్లు బౌలింగ్, ఫీల్డింగ్ లో విఫలం అయ్యారు. రోహిత్ శర్మ, హర్భజన్ సింగ్ తలో క్యాచ్ వదిలేశారు.  ఆ తర్వాత బౌలింగ్లో కూడా ఎవరూ రాణించలేదు. లేకుంటే బెంగళూరు అంత భారీ స్కోరు సాధించేది కాదేమో.

Advertisement
Advertisement