ఏ'బీ'భత్సం | Sakshi
Sakshi News home page

ఏ'బీ'భత్సం

Published Sun, Apr 22 2018 1:06 AM

Royal Challengers Bangalore won by 6 wickets - Sakshi

బెంగళూరు: చిన్న చేపను పెద్ద చేప... చిన్న మాయను పెను మాయ మింగేసినట్లు కుర్రాళ్ల వీరవిహారం వెటరన్‌ స్టార్‌ సుడిగాలి ఇన్నింగ్స్‌లో కొట్టుకుపోయాయి. ఏబీ డివిలియర్స్‌ (39 బంతుల్లో 90 నాటౌట్‌; 10 ఫోర్లు, 5 సిక్స్‌లు) విలయతాండవం ముందు శ్రేయస్, రిషభ్‌ల మెరుపులు వెలవెలబోయాయి. శనివారం జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు 6 వికెట్ల తేడాతో ఢిల్లీని ఓడించి ఐపీఎల్‌లో రెండో విజయాన్ని అందుకుంది. మొదట ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. రిషభ్‌ పంత్‌ (48 బంతుల్లో 85; 6 ఫోర్లు, 7 సిక్స్‌లు), శ్రేయస్‌ అయ్యర్‌ (31 బంతుల్లో 52; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగారు. చహల్‌ 2 వికెట్లు తీశాడు. తర్వాత బెంగళూరు 18 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసి గెలిచింది. ఏబీతో పాటు కోహ్లి (26 బంతుల్లో 30; 2 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించగా, ఢిల్లీ బౌలర్లు బౌల్ట్, మ్యాక్స్‌వెల్, హర్షల్‌ తలా ఒక వికెట్‌ పడగొట్టారు. డివిలియర్స్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు దక్కింది. 

ఆదుకున్న శ్రేయస్, పంత్‌... 
టాస్‌ గెలిచిన బెంగళూరు ఫీల్డింగ్‌ ఎంచుకోగా... మొదట బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ ఓపెనర్ల వైఫల్యంతో కష్టాల్లో పడింది.  గంభీర్‌ (3), జాసన్‌ రాయ్‌ (5) స్పిన్నర్ల ఉచ్చులో పడ్డారు. 23 పరుగులకే కీలక వికెట్లను కోల్పోయిన ఢిల్లీని శ్రేయస్, రిషభ్‌ పంత్‌ ఆదుకున్నారు. 34 బంతుల్లో అర్ధసెంచరీ (4 ఫోర్లు, 3 సిక్స్‌లు) పూర్తిచేసుకున్న రిషభ్‌... చహల్, సిరాజ్‌ బౌలింగ్‌లో చెరో 2 సిక్సర్లు బాదేశాడు. దీంతో 15 ఓవర్లకు 103/3గా ఉన్న స్కోరు కాస్త... 20 ఓవర్లలో 174/5కు చేరింది. చివరి ఓవర్లో పంత్‌ నిష్క్రమించినప్పటికీ ప్రత్యర్థి ముందు భారీ స్కోరును ఉంచడంలో కీలక పాత్ర పోషించాడు.  

ధనాధన్‌... 
ఢిల్లీలాగే బెంగళూరు ఇన్నింగ్స్‌ కూడా ఓపెనర్లు మనన్‌ వోహ్రా (2), డికాక్‌ (18; ఫోర్, సిక్స్‌) వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. కోహ్లి, డివిలియర్స్‌లిద్దరూ స్కోరు బోర్డును పరిగెత్తిస్తూ చేయాల్సిన రన్‌రేట్‌ పెరగకుండా జాగ్రత్త పడ్డారు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 63 పరుగులు జోడించారు. డివిలియర్స్‌ ఇన్నింగ్స్‌ ఆద్యంతం మెరుపులతోనే సాగింది. జట్టు స్కోరు వందకు చేరుతున్న దశలో కోహ్లి కొట్టిన భారీ షాట్‌ను బౌల్ట్‌ బౌండరీ లైన్‌ వద్ద అద్భుత క్యాచ్‌గా అందుకున్నాడు. దీంతో 92 పరుగుల వద్ద మూడో వికెట్‌ను కోల్పోయింది. ఆ తర్వాత కొరే అండర్సన్‌ క్రీజ్‌లోకి రాగా... డివిలియర్స్‌ మరింత రెచ్చిపోయాడు. ప్రత్యర్థి బౌలర్లలో ఎవర్నీ విడిచిపెట్టలేదు. 24 బంతుల్లో (7 ఫోర్లు, 2 సిక్స్‌లు) మెరుపు వేగంతో అర్ధసెంచరీని అధిగమించిన డివిలియర్స్‌ ధనాధన్‌ సిక్సర్లతో బెంగళూరు ప్రేక్షకుల్ని అలరించాడు. అండర్సన్‌ (15) నిష్క్రమణతో వచ్చిన మన్‌దీప్‌ సింగ్‌ (17 నాటౌట్‌; 1 ఫోర్, 1 సిక్స్‌) కూడా వేగంగానే పరుగులు జత చేయడంతో రాయల్‌ చాలెంజర్స్‌ 2 ఓవర్లు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించింది. 

Advertisement
Advertisement