యాహూ యూసుఫ్... | Sakshi
Sakshi News home page

యాహూ యూసుఫ్...

Published Mon, May 2 2016 11:47 PM

యాహూ యూసుఫ్...

కోల్‌కతాను గెలిపించిన పఠాన్
29 బంతుల్లో 60 పరుగులు
రసెల్ ఆల్‌రౌండ్ ప్రదర్శన
మళ్లీ ఓడిన బెంగళూరు

 
ఒకప్పుడు యూసుఫ్ పఠాన్ అంటే విధ్వంసానికి పక్కా చిరునామా. కానీ చాన్నాళ్లుగా అతని బ్యాట్ మూగబోయింది. అయితే ఇప్పుడు మరోసారి అతనిలోని ‘అసలు మనిషి’ బయటకు వచ్చాడు. ఐపీఎల్ సీజన్ ఆరంభం నుంచి నివురుగప్పిన నిప్పులాగే ఉండిపోయిన అతను, ఇప్పుడు ఒక్కసారిగా మండుతున్న అగ్ని కణికలా మారాడు. అసలు విజయానికి అవకాశం లేని చోట అద్భుత ప్రదర్శనతో కోల్‌కతాను విజయతీరాలకు చేర్చాడు. ఆండ్రీ రసెల్ సహకారం అతని పనిని సులువు చేసింది.

కోల్‌కతా నాలుగో వికెట్ కోల్పోయిన సమయంలో విజయ లక్ష్యం 59 బంతుల్లో 117 పరుగులు... సొంతగడ్డపై బెంగళూరు బౌలర్ల క్రమశిక్షణతో ఇది అసాధ్యంగా కనిపించింది. కానీ పఠాన్, రసెల్ దీనిని సుసాధ్యం చేశారు. వీరిద్దరు ఐదో వికెట్‌కు 44 బంతుల్లోనే 96 పరుగుల జోడించి రాయల్ చాలెంజర్స్‌ను కుమ్మేశారు. ఫలితంగా మరో ఐదు బంతులు మిగిలి ఉండగానే నైట్‌రైడర్స్‌కు విజయం దక్కింది.

బెంగళూరు:
కోల్‌కతా నైట్‌రైడర్స్ లక్ష్య ఛేదనలో మరోసారి సత్తా చాటింది. రెండు వరుస పరాజయాల తర్వాత మళ్లీ గెలుపు బాట పట్టింది. ఇక్కడి చిన్నస్వామి స్టేడియంలో సోమవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో కోల్‌కతా 5 వికెట్ల తేడాతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. విరాట్ కోహ్లి (44 బంతుల్లో 52; 4 ఫోర్లు), కేఎల్ రాహుల్ (32 బంతుల్లో 52; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించగా, చివర్లో వాట్సన్ (21 బంతుల్లో 34; 5 ఫోర్లు, 1 సిక్స్) ధాటిగా ఆడాడు.

అనంతరం యూసుఫ్ పఠాన్ (29 బంతుల్లో 60 నాటౌట్; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), ఆండ్రీ రసెల్ (24 బంతుల్లో 39; 1 ఫోర్, 4 సిక్సర్లు) భారీ భాగస్వామ్యం సహాయంతో కోల్‌కతా 19.1 ఓవర్లలో 5 వికెట్లకు 189 పరుగులు చేసింది. గౌతం గంభీర్ (29 బంతుల్లో 37; 4 ఫోర్లు, 1 సిక్స్) ఫర్వాలేదనిపించాడు. ఆల్‌రౌండ్ ప్రదర్శన చేసిన రసెల్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

 రాహుల్ దూకుడు...
 వరుస పరాజయాలతో ఇబ్బంది పడుతున్న బెంగళూరు మళ్లీ గేల్‌ను జట్టులోకి తీసుకుంది. అయితే మోర్నీ మోర్కెల్ వేసిన ఇన్నింగ్స్ రెండో ఓవర్లో భారీ సిక్సర్ కొట్టిన గేల్ (7) తర్వాతి బంతికే అవుటై నిరాశపరిచాడు. కోహ్లి, రాహుల్ నిలదొక్కుకునేందుకు సమయం తీసుకోవడంతో పవర్‌ప్లే ముగిసే సరికి జట్టు 40 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆ తర్వాత వీరిద్దరు వేగం పెంచారు. చావ్లా, నరైన్ బౌలింగ్‌లో రాహుల్ సిక్సర్లు బాది ధాటిని ప్రదర్శించగా, కోహ్లి తన సహజశైలిలో ఆడాడు. 29 బంతుల్లోనే అర్ధ సెంచరీని అందుకున్న రాహుల్, వరుసగా మూడో మ్యాచ్‌లోనూ ఈ ఘనత సాధించాడు.

అయితే ఆ వెంటనే చావ్లా బౌలింగ్‌లో వెనుదిరగడంతో 84 పరుగుల రెండో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. డివిలియర్స్ (4) కూడా విఫలం కాగా... మరోవైపు 42 బంతుల్లో కోహ్లి అర్ధ సెంచరీ పూర్తయింది. మోర్కెల్ బౌలింగ్‌లో గంభీర్ క్యాచ్ వదిలేసినా, మరుసటి బంతికే రసెల్ అందుకోవడంతో కోహ్లి ఇన్నింగ్స్ ముగిసింది.


ఆ మూడు ఓవర్లు...
17 ఓవర్లు ముగిసేసరికి బెంగళూరు స్కోరు 131/4 మాత్రమే. 160 పరుగులైనా చేయగలదా అనే సందేహం. అయితే ఆ జట్టుకు ‘ఆపద్బాంధవుడి’ రూపంలో కోల్‌కతా బౌలర్ ఉమేశ్ యాదవ్ వచ్చాడు. అతను వేసిన 18, 20 ఓవర్లలో కలిపి బెంగళూరు ఏకంగా 41 పరుగులు రాబట్టింది. 18వ ఓవర్లో సచిన్ బేబీ (8 బంతుల్లో 16) వరుసగా 2 ఫోర్లు, 1 సిక్స్ బాదగా, వాట్సన్ మరో ఫోర్ కొట్టాడు. తన వంతుగా ఉమేశ్ రెండు నోబాల్‌లు, వైడ్ కలిపి మొత్తం 23 పరుగులు సమర్పించుకున్నాడు. చివరి ఓవర్లో స్టువర్ట్ బిన్నీ (4 బంతుల్లో 16) వరుసగా 6, 4, 6 కొట్టడంతో మొత్తం 18 పరుగులు వచ్చాయి. అంతకుముందు రసెల్ వేసిన 19వ ఓవర్లో వాట్సన్ వరుసగా మూడు ఫోర్లతో చెలరేగడంతో ఆర్‌సీబీ 13 పరుగులు సాధించింది. ఈ మూడు ఓవర్లలోనే 54 పరుగులు చేసిన బెంగళూరు ఆఖరి ఐదు ఓవర్లలో ఈ సీజన్‌లో అత్యధిక (73) పరుగులు చేసిన జట్టుగా నిలిచింది. ఐపీఎల్-9లో కరణ్ శర్మ (4 ఓవర్లలో 57) తర్వాత  రెండో చెత్త ప్రదర్శన ఉమేశ్ యాదవ్ (56)దే.


మెరుపు భాగస్వామ్యం...
భారీ లక్ష్యఛేదనలో కోల్‌కతా తడబడింది. తొలి ఓవర్లోనే ఉతప్ప (1)ను బిన్నీ అవుట్ చేసి శుభారంభం అందించగా, లిన్ (15) కూడా ఎక్కువసేపు నిలవలేకపోయాడు. పవర్‌ప్లేలో జట్టు స్కోరు 37 పరుగులకే పరిమితమైంది. అనంతరం షమ్సీ వేసిన ఏడో ఓవర్లో గంభీర్ వరుసగా సిక్స్, ఫోర్ కొట్టడంతో 15 పరుగులు వచ్చాయి. అయితే మూడు పరుగుల వ్యవధిలో గంభీర్, పాండే (8) వెనుదిరగడంతో నైట్‌రైడర్స్ పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. అయితే పఠాన్, రసెల్ భాగస్వామ్యం ఆ జట్టును కోలుకునేలా చేసింది. వీరిద్దరు తమదైన శైలిలో భారీ షాట్లతో విరుచుకుపడ్డారు. అప్పటి దాకా చక్కటి బౌలింగ్ చేసిన ఆర్‌సీబీ వీరిని అడ్డుకోవడంలో మాత్రం పూర్తిగా విఫలమయ్యింది. చివర్లో రసెల్ అవుటైనా, సూర్య కుమార్ (10 నాటౌట్) అండతో పఠాన్ మ్యాచ్ ముగించాడు.


స్కోరు వివరాలు
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: లోకేశ్ రాహుల్ (సి) యూసుఫ్ పఠాన్ (బి) చావ్లా 52; గేల్ (సి) ఉతప్ప (బి) మోర్నీ మోర్కెల్ 7; కోహ్లి (సి) రసెల్ (బి) మోర్నీ మోర్కెల్ 52; డివిలియర్స్ (ఎల్బీ) (బి) చావ్లా 4; వాట్సన్ (రనౌట్) 34; సచిన్ బేబీ (సి) అండ్ (బి) రసెల్ 16; బిన్నీ (సి) పాండే (బి) ఉమేశ్ 16; ఆరోన్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 185.

వికెట్ల పతనం: 1-8; 2-92; 3-109; 4-129; 5-167; 6-184; 7-185.

బౌలింగ్: రసెల్ 4-0-24-1; మోర్నీ మోర్కెల్ 4-0-28-2; నరైన్ 4-0-45-0; ఉమేశ్ 4-0-56-1; చావ్లా 4-0-32-2.

కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్: ఉతప్ప (సి) కోహ్లి (బి) బిన్నీ 1; గంభీర్ (ఎల్బీ) (బి) అరవింద్ 37; లిన్ (బి) చహల్ 15; పాండే (సి) సచిన్ (బి) వాట్సన్ 8; యూసుఫ్ పఠాన్ (నాటౌట్) 60; రసెల్ (సి) బిన్నీ (బి) చహల్ 39; సూర్య కుమార్ (నాటౌట్) 10; ఎక్స్‌ట్రాలు 19; మొత్తం (19.1 ఓవర్లలో 5 వికెట్లకు) 189.

వికెట్ల పతనం: 1-6; 2-34; 3-66; 4-69; 5-165.
బౌలింగ్: బిన్నీ 2-0-17-1; అరవింద్ 2.1-0-16-1; వాట్సన్ 3-0-38-1; చహల్ 4-0-27-2; ఆరోన్ 4-0-34-0; షమ్సీ 4-0-51-0.
 

Advertisement
Advertisement