బాల్య మిత్రుడికి సచిన్ స్పెషల్‌ విషెస్

18 Jan, 2018 19:43 IST|Sakshi

సాక్షి, ముంబయి : చిన్ననాటి స్నేహితుడు, భారత మాజీ క్రికెటర్ వినోద్‌ కాంబ్లీ పుట్టినరోజు నేడు(జనవరి 18). 46వ వసంతంలోకి అడుగుపెడుతున్న కాంబ్లికి క్రికెట్, సినీ, రాజకీయ వర్గాల ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని, కాంబ్లికి ఈ ఏడాది అంతా మంచే జరగాలని ఆకాంక్షించారు. అయితే ఈ మాజీ క్రికెటర్‌కు అంత్యంత సంతోషకరమైన విషెస్ మాత్రం తన బాల్య స్నేహితుడు సచిన్ నుంచి కావడం గమనార్హం. ‘నువ్వు మరో వెయ్యేళ్లు హాయిగా బతకాలి. పుట్టినరోజు శుభాకాంక్షలు కాంబ్లి’అంటూ సచిన్ ట్వీట్ చేయడం కాంబ్లి బాధల్ని దూరం చేసి ఉంటుంది. సచిన్‌తో పాటు బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి, ఏఐసీసీ జనరల్ సెక్రటరీ డాక్టర్ సీపీ జోషీలు కాంబ్లికి శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్‌ చేశారు.

దాదాపు తొమ్మిదేళ్ల కిందట స్నేహితుడు సచిన్ పై కాంబ్లి తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. తన కెరీర్ పతనం అవుతున్నప్పుడు ప్రొఫెషన్ పరంగా గానీ, వ్యక్తిగతంగా కానీ సచిన్ తనకు అండగా ఉండలేదని.. ఎలాంటి మద్ధతు తెలపలేదని ఓ టీవీ షోలో తన అవేదన వ్యక్తం చేస్తూ కాంబ్లి కన్నీటి పర్యంతమవడాన్ని ఏ క్రికెట్ ప్రేమికుడు అంత సులువుగా మరిచిపోలేడు. మరోవైపు కాంబ్లి వ్యాఖ్యలపై సచిన్ స్పందించకుండా ఉన్న మాట వాస్తవమే. స్నేహితుడు కాంబ్లి అనారోగ్యంతో ఆస్పత్రిలో ఉన్న సందర్భంలోనూ సచిన్ వెళ్లి కలవలేదు. ఆపై తన ఆటో బయోగ్రఫీ విడుదలకు గానీ, సచిన్ వీడ్కోలు కార్యక్రమానికి సైతం కాంబ్లికి ఆహ్వానం అందలేదు. దీంతో వీరిద్దరి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయని అందరూ భావించారు. గతేడాది అక్టోబర్‌లో రాజ్ దీప్ సర్దేశాయ్ రాసిన పుస్తకం ఆవిష్కరణలో పాల్గొన్న బాల్య మిత్రులు సచిన్, కాంబ్లిలు తొలిసారి సెల్ఫీ దిగి సందడి చేశారు.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు