సచిన్‌నే తికమక పెట్టిన ఘటన! | Sakshi
Sakshi News home page

ఔటా?నాటౌటా?.. అభిమానులకు సచిన్‌ ప్రశ్న

Published Wed, Jul 24 2019 4:01 PM

Sachin Tendulkar Asked Puzzling Question To Fans - Sakshi

ముంబై : క్రికెట్‌ దిగ్గజం, టీమిండియా మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ అభిమానులకు ఓ క్లిష్ట  ప్రశ్నను సంధించాడు. బుధవారం ట్విటర్‌ వేదికగా ఓ వీడియోను షేర్‌ చేసిన మాస్టర్‌.. అందులో బ్యాట్స్‌మన్‌ ఔటా ? నాటౌటా? మీరు అంపైర్‌ అయితే ఏం చేసేవారని అడిగాడు. సంక్లిష్టమైన పరిస్థితిని కలిగి ఉన్న ఈ వీడియోను ఓ స్నేహితుడు పంపిచాడని సచిన్‌ పేర్కొన్నాడు. అయితే ఈ వీడియోలో బౌలర్‌ వేసిన బంతి నేరుగా వికెట్‌ బెయిల్స్‌ను తాకినప్పటికి.. అవి కిందపడలేదు. పైగా ఒక బెయిల్‌ పక్కకు జరిగింది. అయితే దీన్ని అంపైర్‌ నాటౌట్‌ ఇచ్చినట్లు తెలుస్తున్నప్పటికి వీడియోలో మాత్రం స్పష్టత లేదు. ఈ సందర్భంలో మీరు అంపైర్‌గా ఉంటే ఏం చేసేవారని అభిమానులను సచిన్‌ ప్రశ్నించాడు.

చాలా మంది నాటౌట్‌ ఇచ్చేవాళ్లమని కామెంట్‌ చేయగా కొంతమంది మాత్రం ఔట్‌ అని అభిప్రాయపడ్డాడు. ‘వాస్తవానికి ఔటే కానీ.. రూల్స్‌ రూల్సే కదా.. మొన్న ఇంగ్లండ్‌ గెలిచినట్టు’ అని ఓ యూజర్‌ సెటైరిక్‌గా కామెంట్‌ చేశాడు. నిబంధనల ప్రకారం బంతి బెయిల్స్‌కు తగిలినా కిందపడితేనే ఔట్‌ ఇస్తారన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది.

ఆస్ట్రేలియాలో జరిగిన ఓ క్లబ్‌ మ్యాచ్‌లో ఇలాంటి వింత ఘటననే చోటు చేసుకుంది. బౌల‌ర్ విసిరిన బంతికి మిడిల్ స్టంప్ ఎగిరి ప‌డింది. కానీ దానిపై ఉన్న బెయిల్స్ మాత్రం క‌ద‌ల్లేదు.. కింద ప‌డ‌లేదు. దీంతో అంపైర్‌కు ఏం చేయాలో తోచ‌లేదు. చాలాసేప‌టి వ‌ర‌కు నిర్ణయానికి ప్రకటించకుండా.. లెగ్ అంపైర్‌, థ‌ర్డ్ అంపైర్ల‌తో చ‌ర్చించి చివరకు ఔటిచ్చాడు. మెల్‌బోర్న్‌లో మూనీ వాలీ సీసీ, స్ట్రాట్‌మోర్ హైట్స్ సీసీ టీమ్స్ మ‌ధ్య జ‌రిగిన క్ల‌బ్ క్రికెట్ మ్యాచ్‌లో ఈ వింత జ‌రిగింది. క్రికెట్ చ‌రిత్ర‌లో ఇంత‌కుముందు ఎప్పుడూ ఇలాంటి ఘ‌ట‌న జ‌ర‌గ‌క‌పోవ‌డంతో అంపైర్లు కూడా ఔటివ్వాలా వ‌ద్దా అన్న విష‌యంపై అయోమయానికి గురయ్యారు. అప్ప‌టిక‌ప్పుడు క్రికెట్ రూల్ బుక్ చూసి నిర్ణయాన్ని ప్రకటించారు.

Advertisement
Advertisement