Sakshi News home page

మరిన్ని టెస్టులు నిర్వహించాలి

Published Sun, Mar 16 2014 1:00 AM

మరిన్ని టెస్టులు నిర్వహించాలి

ఐసీసీకి సచిన్ సూచన
 ముంబై: టెస్టు క్రికెట్ మనుగడ సాగించాలంటే సాధ్యమైనన్ని ఎక్కువ మ్యాచ్‌లు నిర్వహించడమే మార్గమని మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ అభిప్రాయపడ్డాడు. టి20 జోరుతో టెస్టుల్లో కూడా ఫలితాలు వస్తున్నందున మ్యాచ్‌ల సంఖ్య పెంచాలని అతను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)కి సూచించాడు.
 
 ‘టెస్టు క్రికెట్ బతకాలంటే ఎక్కువ టెస్టులు నిర్వహించడమే మార్గం. ఇప్పుడు టెస్టుల్లో కూడా కుర్రాళ్లు మంచి ప్రదర్శన కనబరుస్తున్నారు. టి20 మ్యాచ్‌లు తెచ్చిన వేగంతో ‘డ్రా’ల సంఖ్య తగ్గింది’ అని సచిన్ వ్యాఖ్యానించాడు. అయితే టెస్టులు ఆడాలని యువ క్రికెటర్లను బలవంత పెట్టవద్దని కూడా అతను అన్నాడు. ‘కొత్తవారిని క్రికెట్ వైపు ఆకర్షించాలంటే టి20లు ఉత్తమ మార్గం. ఆ తర్వాత నెమ్మదిగా వన్డేలు, టెస్టులపై పట్టు సాధించవచ్చు. ఎవరికైనా అనాసక్తి ఉంటే వారిపై టెస్టులను బలవంతంగా రుద్దవద్దు. టెస్టులు ఇష్టపడే వారినే ప్రోత్సహించండి’ అని మాస్టర్ అభిప్రాయం వ్యక్తం చేశాడు. క్రిక్‌ఇన్ఫో ఈతరం క్రికెటర్ అవార్డు రేసులో తనతో పోటీ పడిన కలిస్, వార్న్‌లతో తన అనుబంధాన్ని సచిన్ వెల్లడించాడు.
 
 ‘తొలిసారి కలిస్‌ను చూసినప్పుడు సాధారణ ఆల్‌రౌండర్ కావచ్చనుకున్నా. కానీ అతను అద్భుతమైన బ్యాట్స్‌మన్‌గా, ప్రత్యేకమైన బౌలర్‌గా ఎదిగాడు. ఆరంభంలో వార్న్‌తో పెద్దగా మాట్లాడకపోయినా ఆ తర్వాత మంచి స్నేహితులుగా మారాము. అలాంటి గొప్ప బౌలర్‌ను ఎదుర్కోవడం ఎప్పుడూ సవాల్‌గానే కనిపించేది’ అని సచిన్ గుర్తు చేసుకున్నాడు. పెర్త్‌లో ఆస్ట్రేలియాపై 114 పరుగులు చేసిన తర్వాతే తాను అంతర్జాతీయ క్రికెట్‌లో రాణించగలననే విశ్వాసం పెరిగిందని ఈ మాజీ ఆటగాడు అన్నాడు.
 
 ద్రవిడ్, మార్టిన్ క్రో ప్రశంసలు
 సచిన్‌కంటే మిన్నగా ఏ భారతీయ బ్యాట్స్‌మన్ ఫాస్ట్ బౌలింగ్‌పై ఆధిపత్యం ప్రదర్శించలేదని రాహుల్ ద్రవిడ్ వ్యాఖ్యానించాడు. ‘కాస్త రక్షణాత్మక ధోరణితో ఫాస్ట్‌బౌలింగ్‌ను ఎదుర్కొనే గవాస్కర్‌తో పోలిస్తే సచిన్ భిన్నం. అతను వారిపై పూర్తి ఆధిపత్యం చలాయించాడు. తర్వాతి తరం ఆ తరహా ఆటను సచిన్‌నుంచే నేర్చుకుంది’ అని ద్రవిడ్ అభిప్రాయ పడ్డాడు. వెస్టిండీస్ దిగ్గజం వివియన్ రిచర్డ్స్‌కంటే సచిన్ గొప్ప బ్యాట్స్‌మన్ అని కివీస్ మాజీ కెప్టెన్ మార్టిన్ క్రో అభిప్రాయం వ్యక్తం చేశాడు. అద్భుతమైన ఫుట్‌వర్క్ అతని సొంతమని ఆయన ప్రశంసలు కురిపించారు.
 

Advertisement
Advertisement