సచిన్ ఆఖరి టెస్టు వేదిక ముంబై | Sakshi
Sakshi News home page

సచిన్ ఆఖరి టెస్టు వేదిక ముంబై

Published Wed, Oct 16 2013 12:38 AM

సచిన్ ఆఖరి టెస్టు వేదిక ముంబై

 ముంబైలో ‘మాస్టర్’
 సచిన్ టెండూల్కర్ తన సుదీర్ఘ కెరీర్‌లో మొత్తం 11 టెస్టు మ్యాచ్‌లు ముంబైలో ఆడాడు. ఇందులో ఒక టెస్టుకు బ్రబోర్న్ స్టేడియం వేదికగా నిలవగా, మరో పది టెస్టులు వాంఖెడేలో జరిగాయి.
 
 బ్రబోర్న్ జ్ఞాపకం: డిసెంబర్ 2-6, 2009లో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్, శ్రీలంకను ఇన్నింగ్స్ 24 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించింది. సచిన్ తొలి ఇన్నింగ్స్‌లో 53 పరుగులు చేశాడు. ఈ విజయంతోనే భారత జట్టు తొలిసారి ఐసీసీ ర్యాంకింగ్స్‌లో వరల్డ్ నంబర్‌వన్ స్థానానికి చేరుకోవడం విశేషం.
 
 వాంఖెడేలో రికార్డు: ఈ మైదానంలో మొత్తం 18 ఇన్నింగ్స్‌లలో సచిన్ 47.05 సగటుతో 847 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, 7 అర్ధ సెంచరీలు ఉన్నాయి. 1997లో శ్రీలంకపై చేసిన 148 పరుగులే సొంత మైదానంలో సచిన్ ఏకైక సెంచరీ. ఈ 10 మ్యాచుల్లో భారత్ 4 గెలిచి, 3 ఓడింది. మరో మూడు ‘డ్రా’గా ముగిశాయి.
 
 ముంబై: కోట్లాది మంది భారత అభిమానుల ఆరాధ్య దైవం సచిన్ టెండూల్కర్ ‘ముంబైకర్’ గానే తన కెరీర్‌ను ముగించాలని నిర్ణయించుకున్నాడు. కెరీర్‌లో తొలి ఫస్ట్‌క్లాస్ మ్యాచ్ ఆడి పరుగుల ప్రవాహాన్ని ప్రారంభించిన చోటే పరుగు ఆపాలని కోరుకున్నాడు. తన 200వ టెస్టు మ్యాచ్ వేదికగా అతను సొంత నగరాన్నే ఎంచుకున్నాడు. కుటుంబ సభ్యులు, స్నేహితులు, గురువులు, సన్నిహితులు, సహచరుల సమక్షంలోనే తన ఆఖరి మ్యాచ్ ఆడాలన్న మాస్టర్ విజ్ఞప్తిని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) మన్నించింది.
 
  వచ్చే నెల 14 నుంచి 18 వరకు వెస్టిండీస్‌తో జరిగే రెండో టెస్టు కోసం ముంబైలోని వాంఖెడే మైదానాన్ని వేదికగా ఎంపిక చేసినట్లు బోర్డు అధికారికంగా ప్రకటించింది. ఈ టెస్టు మ్యాచ్‌తోనే అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ కానున్నట్లు సచిన్ ఇటీవలే ప్రకటించాడు. భారత్-వెస్టిండీస్ సిరీస్ షెడ్యూల్‌ను బీసీసీఐ ఫిక్చర్స్ కమిటీ చైర్మన్ రాజీవ్ శుక్లా మంగళవారం విడుదల చేశారు. ‘చివరి మ్యాచ్‌ను తన తల్లి చూడాలనే కోరికతో ముంబైలో ఏర్పాటు చేయమని సచిన్ కోరాడు.

బీసీసీఐ దీనిపై చర్చించి సచిన్ విజ్ఞప్తిని అంగీకరించింది. అతని సెంటిమెంట్‌ను దృష్టిలో పెట్టుకొని 200వ టెస్టును ముంబైకి కేటాయించాం’ అని రాజీవ్ శుక్లా చెప్పారు.  సిరీస్‌లో భాగంగా నవంబర్ 6 నుంచి 10 వరకు జరిగే తొలి టెస్టును కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్‌కు కేటాయించారు. రొటేషన్ పాలసీని పక్కన పెట్టి బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. ‘ఈ రెండు టెస్టులకు ఉన్న ప్రాధాన్యత కారణంగా ఎక్కువ సంఖ్యలో ప్రేక్షకులు చూసే అవకాశం ఉన్న పెద్ద వేదికలను ఎంపిక చేయాలని భావించాం. అందుకే ఈడెన్‌ను ఎంచుకున్నాం’ అని శుక్లా స్పష్టం చేశారు. సచిన్‌కు భారీ ఎత్తున వీడ్కోలు ఇచ్చే విషయంపై నిర్ణయం తీసుకునేందుకు ఇంకా చాలా సమయముందని ఆయన అన్నారు.
 
 చిరస్మరణీయం చేస్తాం: దాల్మియా
 సచిన్ 199వ టెస్టు వేదికగా కోల్‌కతాను ఎంపిక చేయడం పట్ల బెంగాల్ క్రికెట్ సంఘం (క్యాబ్) అధ్యక్షుడు జగ్మోహన్ దాల్మియా ఆనందం వ్యక్తం చేశారు. నిర్వహణ పరంగా ఈ మ్యాచ్‌ను చిరస్మరణీయంగా మారుస్తామని ఆయన అన్నారు. ‘భారత స్టార్ క్రికెటర్ ఎప్పటికీ ఈడెన్ టెస్టును గుర్తుంచుకునే విధంగా ఏర్పాట్లు చేస్తాం. మరో రెండు రోజుల్లో దీనిపై స్పష్టత వస్తుంది. ముంబైకి చివరి టెస్టు ఇవ్వాలన్న బోర్డు నిర్ణయాన్ని అభినందిస్తున్నాను. అదే విధంగా ఈ మ్యాచ్ అవకాశం రావడం గొప్ప విషయం’ అని దాల్మియా అన్నారు.
 
 ఎలా స్పందిస్తానో తెలీదు: కోహ్లి
 సచిన్ ఆఖరిసారి క్రీజ్‌లోకి వెళ్లే సమయంలో తన స్పందన ఎలా ఉండబోతోందో చెప్పలేనని భారత బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లి చెప్పాడు. ‘ సచిన్ ఆట చూస్తూ పెరిగా. అతనిలాగే ఆడాలనుకున్నా. అతను రిటైరయ్యే సమయం నాకు కఠినమైంది. 24 ఏళ్లలో సచిన్ లేకుండా భారత జట్టు ఉండగలదని మేం ఎప్పుడూ ఊహించలేదు. అతను చివరిసారి మైదానంలో వెళ్లే సమయంతో నాతో పాటు జట్టు సభ్యుల స్పందన ఎలా ఉండనుందో ఊహించలేను’ అని కోహ్లి ఉద్వేగంగా అన్నాడు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement