ఆ జ్ఞాపకాలు పదిలం | Sakshi
Sakshi News home page

ఆ జ్ఞాపకాలు పదిలం

Published Sun, Sep 27 2015 1:52 AM

ఆ జ్ఞాపకాలు పదిలం

భారత్-దక్షిణాఫ్రికా... రెండు సమాన స్థాయి ఉన్న జట్లు. అందుకే ఈ రెండు జట్ల మధ్య సిరీస్ అంటే అందరిలోనూ ఆసక్తి. అలాంటి సిరీస్‌లో ఓ అద్భుతమైన ప్రదర్శన చేస్తే... చరిత్రలో కలకాలం నిలబడిపోతారు. అందుకే ప్రతి ఆటగాడూ ఈ పర్యటనలో మరింత కష్టపడతాడు. గతంలో దక్షిణాఫ్రికా జట్టు భారత్‌లో పర్యటించిన అనేక సందర్భాల్లో కొంతమంది క్రికెటర్లు చేసిన ప్రదర్శన ఎప్పటికీ మరచిపోలేని జ్ఞాపకం. అలాంటి వాటిలో కొన్ని...
 
సచిన్ ‘డబుల్’...
2010లో భారత పర్యటనకు వచ్చిన దక్షిణాఫ్రికా జట్టుపై మాస్టర్ బ్యాట్స్‌మన్ సచిన్ ఓ అరుదైన ఫీట్ సాధించి క్రికెట్ చరిత్రను మలుపు తిప్పాడు. అదే వన్డేల్లో ‘డబుల్ సెంచరీ’. ఊహించడానికే కష్టంగా అనిపించే ఈ ఘనతను ఫిబ్రవరి 24న గ్వాలియర్‌లో జరిగిన రెండో వన్డేలో సచిన్ సుసాధ్యం చేశాడు. బలమైన సఫారీ బౌలర్లను తన ట్రేడ్ మార్క్ షాట్లతో దీటుగా ఎదుర్కొని అతను ఇన్నింగ్స్‌కు ప్రాణం పోసిన తీరు ఇప్పటికీ అభిమానులకు చిర పరిచితం. 90 బంతుల్లో మొదటి 100 పరుగులు చేసిన మాస్టర్ మిగతా 100 కోసం కేవలం 57 బంతులే తీసుకున్నాడు. 150 పరుగుల తర్వాత కండరాలు పట్టేసినా రన్నర్‌ను కూడా తీసుకోకుండానే ఓ సంచలన ఇన్నింగ్స్‌కు తెరలేపాడు. 46వ ఓవర్‌లో వన్డేల్లో అత్యధిక పరుగుల (194) రికార్డును అధిగమించినా.. ఏమాత్రం భావోద్వేగాలు, సెలబ్రేషన్ లేకుండా తన లక్ష్యంవైపు సాగిపోయాడు. లాంగ్‌వెల్ట్ వేసిన చివరి ఓవర్‌లో బంతిని బ్యాక్‌వర్డ్ పాయింట్‌లోకి నెట్టి ఎవరికి సాధ్యంకాని మ్యాజిక్ ఫిగర్ (200) అందుకోవడంతో ఒక్కసారిగా రూప్‌సింగ్ స్టేడియం హోరెత్తిపోయింది.  
 
క్లూసెనర్ కేక
1996లో తొలిసారి భారత పర్యటనకు వచ్చిన ఆల్‌రౌండర్ లాన్స్ క్లూసెనర్‌కు రెండో టెస్టు మధురానుభూతిని మిగిల్చింది. తొలి టెస్టులో ఓడి కాస్త నిరాశతో ఉన్న సఫారీ జట్టు కోల్‌కతాలో జరిగిన రెండో మ్యాచ్‌లో క్లూసెనర్‌కు అరంగేట్రం చేసే అవకాశం ఇచ్చింది. దీంతో మెక్‌మిలన్ వారసుడిగా జట్టులోకి వచ్చిన లాన్స్... రెండో ఇన్నింగ్స్‌లో బంతి తో నిప్పులు చెరిగాడు. 467 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన టీమిండియాను క్లూసెనర్ గంటల వ్యవధిలో కూల్చేశాడు.  అద్భుతమైన యార్కర్లతో హడలెత్తించాడు. 8 వికెట్లు తీసి ప్రొటీస్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. ఈ మ్యాచ్‌లో సహచరులందరూ వెనుదిరిగినా అజహరుద్దీన్ సెంచరీతో ఆకట్టుకున్నాడు.
 
వీరూ ‘ట్రిపుల్’

టెస్టుల్లో స్థానం కోల్పోయి ఏడాది తర్వాత మళ్లీ జట్టులోకి వచ్చిన సెహ్వాగ్... 2008లో చెన్నైలో దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో విశ్వరూపం చూపెట్టాడు. టి20, వన్డే తరహాలో బ్యాటింగ్ చేస్తూ పరుగుల వరద పారించాడు. దాదాపు 9 గంటల పాటు బ్యాటింగ్ చేసి అసాధారణ రీతిలో ‘ట్రిపుల్ సెంచరీ’ మోత మోగించాడు. తేమ వల్ల డీహైడ్రేషన్ సమస్య ఎదురైనా జట్టులో చోటు సుస్థిరం చేసుకోవాలనే ఏకైక లక్ష్యంతో అతను బ్యాటింగ్ చేసిన తీరుకు సఫారీ బౌలర్లు చేష్టలుడిగిపోయారు. కేవలం 278 బంతుల్లో తన రెండో ట్రిపుల్ సెంచరీ చేసి తనపై వచ్చిన విమర్శలకు చక్కటి సమాధానం చెప్పాడు. ఓవరాల్‌గా సెహ్వాగ్ వీరోచిత బ్యాటింగ్‌తో ప్రకంపనాలు సృష్టించినా.. ప్రొటీస్ కూడా దీటుగా స్పందించడంతో ఈ మ్యాచ్ ‘డ్రా’ అయ్యింది.
 
స్టెయిన్ ‘గన్’
2008చెన్నై టెస్టులో సెహ్వా గ్ జోరు చూపెడితే... అహ్మదాబాద్‌లో జరిగిన రెండో టెస్టులో దక్షిణాఫ్రికా పేసర్ స్టెయిన్ బంతితో హడలె త్తించాడు. స్వింగ్‌తో పాటు ‘ఎక్స్‌ట్రా బౌన్స్’ అనే ఆయుధంతో టీమిండియాను బొక్కబోర్లా పడగొట్టాడు. ఎన్తిని, మోర్కెల్ సహకారంతో భారత్‌కు పట్టపగలే చుక్కలు చూపెట్టాడు. కనీసం బంతిని ముట్టుకోవడానికి కూడా భయపడిన భార త బ్యాట్స్‌మన్ తొలి ఇన్నింగ్స్‌లో 76 పరుగులకే ఆలౌటయ్యారు. రెండో ఇన్నింగ్స్‌లో నూ స్టెయిన్ నిప్పులు కురిపించాడు. 3వికెట్లు తీసి ఒకే ఒక్క సెషన్‌లో మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. మూడు రోజుల్లోనే సఫారీ జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు.

Advertisement
Advertisement