సెమీఫైనల్లో సైనా | Sakshi
Sakshi News home page

సెమీఫైనల్లో సైనా

Published Sat, Jan 26 2019 1:13 AM

Saina Nehwal enters women's singles semifinal of Indonesia Masters - Sakshi

జకార్తా: ఈ సీజన్‌లో వరుసగా రెండో అంతర్జాతీయ టోర్నమెంట్‌లో భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌ సైనా నెహ్వాల్‌ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. ఇండోనేసియా మాస్టర్స్‌ వరల్డ్‌ సూపర్‌–500 టోర్నమెంట్‌లో వరుసగా మూడో విజయంతో సైనా తన జోరు కొనసాగించింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో ఎనిమిదో సీడ్‌ సైనా 21–7, 21–18తో పోర్న్‌పవీ చోచువోంగ్‌ (థాయ్‌లాండ్‌)పై గెలిచింది. నేడు జరిగే సెమీఫైనల్లో ప్రపంచ ఏడో ర్యాంకర్‌ హి బింగ్‌జియావో (చైనా)తో సైనా తలపడుతుంది. పోర్న్‌పవీతో జరిగిన మ్యాచ్‌లో సైనా తొలి గేమ్‌లో ఆరంభం నుంచి పూర్తి ఆధిపత్యం చలాయించింది. తొలుత 3–0తో ముందంజ వేసిన ఆమె అదే జోరు కొనసాగిస్తూ ఆధిక్యాన్ని 8–2కి పెంచుకుంది. పోర్న్‌పవీ తేరుకునేలోపే సైనా ఖాతాలో తొలి గేమ్‌ చేరిపోయింది. రెండో గేమ్‌లోనూ తొలుత 3–0 ఆధిక్యాన్ని సంపాదించిన సైనా ఆ తర్వాత వరుసగా నాలుగు పాయింట్లు కోల్పోయింది. ఆధిక్యం దోబూచులాడినా... కీలకదశలో సైనా పైచేయి సాధించి రెండో గేమ్‌తో సహా మ్యాచ్‌ను కైవసం చేసుకుంది.

మరో క్వార్టర్‌ ఫైనల్లో ప్రపంచ మూడో ర్యాంకర్‌ పీవీ సింధు (భారత్‌) 11–21, 12–21తో ప్రస్తుత ప్రపంచ, ఒలింపిక్‌ చాంపియన్‌ కరోలినా మారిన్‌ (స్పెయిన్‌) చేతిలో ఓడింది. 37 నిమిషాల పాటు జరిగిన ఈ పోరులో సింధు ఏ దశలోనూ మారిన్‌కు పోటీనివ్వలేకపోయింది. రెండు గేముల్లోనూ ఒక్కసారి కూడా స్కోరు సమం కాకపోవడం గమనార్హం. పురుషుల సింగిల్స్‌ విభాగంలో కిడాంబి శ్రీకాంత్‌ పోరాటం కూడా క్వార్టర్‌ ఫైనల్లోనే ముగిసింది. జొనాథన్‌ క్రిస్టీ (ఇండోనేసియా)తో జరిగిన క్వార్టర్‌ ఫైనల్లో శ్రీకాంత్‌ 18–21, 19–21తో ఓటమి చవిచూశాడు. 48 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో శ్రీకాంత్‌ కీలక సమయాల్లో  అనవసర తప్పిదాలు చేయడమే కాకుండా నెట్‌ గేమ్‌లోనూ తడబడి మూల్యం చెల్లించుకున్నాడు.
నేటి సెమీఫైనల్స్‌

►ఉదయం గం.10.30 నుంచి   స్టార్‌ స్పోర్ట్స్‌ సెలెక్ట్‌–1లో ప్రత్యక్ష ప్రసారం  

Advertisement
Advertisement