'చైనాకు మనకు తేడా అదే'

31 Oct, 2016 11:34 IST|Sakshi
'చైనాకు మనకు తేడా అదే'

బెంగళూరు:భారత దేశంలో తగినన్ని బ్యాడ్మింటన్ అకాడమీలు లేకపోవడం పట్ల స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ విచారం వ్యక్తం చేసింది. మన దేశంలో ఎక్కువ శాతంలో బ్యాడ్మింటన్ అకాడమీలు లేకపోవడం ఒకటైతే.. సాధ్యమైనంత మంది కోచ్లు కూడా లేకపోవడం పట్ల సైనా ఆవేదన వ్యక్తం చేసింది.  మౌలిక వసతుల పరంగా ఇక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకపోయినా, చైనా తరహాలో కోచ్లు, అకాడమీలు లేకపోవడం వల్లే ఈ ఆటలో వెనకబడిపోయామని పేర్కొంది.

'చైనాను చూడండి. ముప్ఫై వేల నుంచి నలభై వేల వరకూ బ్యాడ్మింటన్ ప్లేయర్స్ ఉంటారు. అక్కడ ఒక్క ఈవెంట్ జరుగుతున్నప్పుడు నలుగురు, ఐదుగురు కోచ్లు ఉంటారు. ఇదే వారిని చాంపియన్లుగా నిలుపుతుంది. ఆ పరంగా మనదేశంలోని ప్రధాన నగరాల్లో 20 నుంచి 30 మంది కోచ్లు ఉండాలి. కేవలం ఇద్దరు లేదా ముగ్గురు మాత్రమే ఇక్కడ నగరాల్లో ఉన్నారు. ఇది చాలా దురదృష్టకరం'అని సైనా తెలిపింది. రియో ఒలింపిక్స్ తరువాత మోకాలికి చికిత్స చేయించుకున్న సైనా కోలుకుంటుంది.


ప్రస్తుతం బ్యాడ్మింటన్లో ఆశించిన ఫలితాలు సాధించలేకపోతున్న చైనాను తక్కువ అంచనా వేయడం తగదని సూచించింది. అధిక సంఖ్యలో కోచ్ లు, అకాడమీలు ఉన్న చైనాకు చాంపియన్లు తయారు చేయడం ఏ మాత్రం కష్టంకాదనే అభిప్రాయం వ్యక్తం చేసింది. వారి నుంచి ఏక్షణానైనా చాంపియన్లు తయారవుతారని పేర్కొంది.

>
మరిన్ని వార్తలు