కల చెదిరింది... | Sakshi
Sakshi News home page

కల చెదిరింది...

Published Mon, Mar 9 2015 1:15 AM

కల చెదిరింది...

‘ఆల్ ఇంగ్లండ్’ ఫైనల్లో ఓడిన సైనా
 రన్నరప్‌తో సరి
  ప్రపంచ చాంప్ మారిన్‌కు టైటిల్

 
 బర్మింగ్‌హమ్: తన కెరీర్‌లో మరో ‘తొలి’ ఘనతను సాధించాలని ఆశించిన భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్‌కు నిరాశ ఎదురైంది. ప్రతిష్టాత్మక ‘ఆల్ ఇంగ్లండ్’ ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ టోర్నమెంట్‌లో ఈ హైదరాబాద్ అమ్మాయి తుది మెట్టుపై తడబడింది. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ మూడో ర్యాంకర్ సైనా నెహ్వాల్ 21-16, 14-21, 7-21 స్కోరుతో ప్రస్తుత ప్రపంచ, యూరో చాంపియన్ కరోలినా మారిన్ (స్పెయిన్) చేతిలో ఓడిపోయింది. వరుసగా తొమ్మిదోసారి ఈ మెగా టోర్నీలో బరిలోకి దిగిన సైనా తొలిసారి ఫైనల్‌కు చేరుకొని ఈ ఘనత సాధించిన తొలి భారతీయ క్రీడాకారిణిగా గుర్తింపు పొందింది. అయితే విజేతగా నిలిచి ప్రకాశ్ పదుకొనే, పుల్లెల గోపీచంద్ సరసన నిలవాలని ఆశించిన సైనాకు ప్రత్యర్థి మారిన్ నిరాశను మిగిల్చింది. గతేడాది ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన మారిన్ ఈ విజయంతో తన కెరీర్‌లో తొలి సూపర్ సిరీస్ టైటిల్‌ను సాధించింది.
 
 క్వార్టర్స్‌లో, సెమీస్‌లో పటిష్టమైన చైనా క్రీడాకారిణులను ఓడించిన సైనా అదే జోరును ఫైనల్లోనూ కనబరిచింది. తొలి గేమ్‌లో పూర్తి విశ్వాసంతో ఆడిన ఈ హైదరాబాద్ అమ్మాయి   ఆరంభంలో 4-2తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత పదునైన స్మాష్‌లు, కోర్టులో చురుకైన కదలికలతో మారిన్‌పై ఆధిపత్యాన్ని చలాయించిన సైనా అదే జోరులో తొలి గేమ్‌ను దక్కించుకుంది.
  రెండో గేమ్‌లోనూ దూకుడుగా ఆడిన సైనా 6-1తో ఆధిక్యంలోకి వెళ్లి విజయంవైపు సాగుతున్నట్లు అనిపించింది. అయితే అప్పటిదాకా సైనా ఆటతీరును బేరీజు వేసుకున్న మారిన్ నెమ్మదిగా పుంజుకోవడం ప్రారంభించింది. సుదీర్ఘ ర్యాలీలు ఆడుతూ... సైనాను కోర్టుకిరువైపులా ఆడిస్తూ... అవకాశం దొరికినప్పుడల్లా కళ్లు చెదిరే స్మాష్‌లు సంధిస్తూ... ఈ స్పెయిన్ అమ్మాయి జోరు పెంచింది. 12-13తో వెనుకబడిన దశ నుంచి తేరుకొని వరుసగా ఐదు పాయింట్లు నెగ్గి 17-13తో ఆధిక్యంలోకి వెళ్లింది.
 
 అదే ఊపులో మారిన్ రెండో గేమ్‌ను నెగ్గి మ్యాచ్‌లో నిలిచింది.
 ళీ నిర్ణాయక మూడో గేమ్‌లో మారిన్ చెలరేగిపోగా... సైనా డీలా పడింది. అనవసర తప్పిదాలకు తోడు షటిల్స్ గమనాన్ని సరిగ్గా అంచనా వేయడంలో విఫలమై  వరుసగా పాయింట్లు కోల్పోయింది. అసలేం జరుగుతుందో సైనా తెలుసుకునేలోగా మారిన్ వరుసగా 8 పాయింట్లు గెలిచి 16-4తో తిరుగులేని ఆధిక్యాన్ని సంపాదించింది. చివరకు స్మాష్ షా ట్‌తో విజయాన్ని ఖాయం చేసుకొని ఆల్ ఇంగ్లండ్ చాంపియన్‌గా అవతరించింది.
 
 రన్నరప్‌గా నిలిచిన సైనా నెహ్వాల్‌కు 19 వేల డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 11 లక్షల 92 వేలు)తోపాటు 9,350 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. విజేత కరోలినా మారిన్‌కు 37,500 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 23 లక్షల 54 వేలు)తోపాటు 11 వేల ర్యాంకింగ్ పాయింట్లు దక్కాయి.
  సూపర్ సిరీస్ స్థాయి టోర్నమెంట్‌లలో ఫైనల్‌కు చేరుకొని ఓడిపోవడం సైనాకిది మూడోసారి. గతంలో సైనా 2011 ఇండోనేసియా ఓపెన్ ఫైనల్లో యిహాన్ వాంగ్ (చైనా) చేతిలో; 2012 ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో మినత్సు మితాని (జపాన్) చేతిలో ఓటమి పాలైంది.
 
 రెండో గేమ్ నుంచి ఏకాగ్రత కోల్పోయాను. త్వరగా పాయింట్లు నెగ్గి మ్యాచ్‌ను తొందరగా ముగించాలని చూశాను. అనవసర పొరపాట్లు చేసి ఒత్తిడికి లోనయ్యాను. అగ్రశ్రేణి క్రీడాకారిణులతో ఆడుతున్నపుడు ఏ దశలోనైనా ఏమైనా జరగొచ్చు. ఎవరైనా ఏదో ఒకదశలో ఒత్తిడికి లోనవ్వచ్చు. ఫైనల్లో నా విషయంలో అదే జరిగింది.        
 -సైనా నెహ్వాల్
 
 మోదీ, కేసీఆర్ అభినందన
 ఆల్ ఇంగ్లండ్ టోర్నీలో రన్నరప్‌గా నిలిచినా... సైనాను చూసి గర్విస్తున్నానని ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. ఫైనల్‌కు చేరి చరిత్ర సృష్టించిందని, చక్కని ఆటతీరు కనబరిచిందని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు అభినందించారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement