సైనా... ‘సూపర్ 7’ | Sakshi
Sakshi News home page

సైనా... ‘సూపర్ 7’

Published Mon, Jun 30 2014 1:00 AM

సైనా... ‘సూపర్ 7’

ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ సొంతం
 ఫైనల్లో కరోలినాపై గెలుపు  
 ఖాతాలో రూ. 34 లక్షల ప్రైజ్‌మనీ
 కెరీర్‌లో ఏడో సూపర్ సిరీస్ టైటిల్  
 ఈ ఏడాది రెండో విజయం
 
 సిడ్నీ: భారత స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ చాన్నాళ్ల తర్వాత తన స్థాయికి తగ్గ ఆటతీరు కనబర్చింది. ఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నీలో విజేతగా నిలిచింది. ఆదివారం ఇక్కడ జరిగిన ఫైనల్లో ప్రపంచ 8వ ర్యాంకర్, ఆరో సీడ్ సైనా 21-18, 21-11 తేడాతో కరోలినా మారిన్ (స్పెయిన్)పై ఘన విజయం సాధించింది. ఆద్యంతం ఆధిక్యం కనబర్చిన సైనా 43 నిమిషాల్లోనే ప్రత్యర్థిని చిత్తు చేసింది.
 
  కెరీర్‌లో తొలి సూపర్ సిరీస్ ఫైనల్ ఆడుతున్న 21 ఏళ్ల మారిన్... ప్రత్యర్థి వేగం, దూకుడు ముందు నిలువలేకపోయింది. తొలి గేమ్‌లో ప్రపంచ 11వ ర్యాంకర్, ప్రస్తుత యూరోపియన్ చాంపియన్ అయిన మారిన్ నుంచి కొంత ప్రతిఘటన ఎదుర్కొన్న సైనా, రెండో గేమ్‌లో ఎలాంటి అవకాశం కూడా ఇవ్వలేదు. విజేతగా నిలిచిన సైనాకు 56,250 డాలర్లు (దాదాపు రూ. 34 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి.  
 
 ఆది నుంచే జోరు...
 గతంలో కరోలినాతో తలపడిన ఏకైక మ్యాచ్‌లో గెలిచిన సైనా, ఈసారి కూడా తన జోరు కొనసాగించింది. తొలి గేమ్‌లో చక్కటి వాలీలతో 5-2తో ముందంజ వేసింది. ఆ తర్వాత నెట్ వద్ద సైనా చక్కటి ఆటతీరు కనబర్చగా, మారిన్ చేసిన పొరపాట్లతో స్కోరు 11-7కు చేరింది. విరామం తర్వాత కరోలినా మెరుగైన ఆటతీరు కనబర్చి స్కోరు సమం చేసినా... ఆ తర్వాత నిలకడ ప్రదర్శించలేకపోయింది. ఫలితంగా సైనా వరుస పాయింట్లుతో దూసుకెళ్లి 23 నిమిషాల్లో గేమ్‌ను ముగించింది.
 
 ఏకపక్షం...
 ఆరంభంలో ఉత్సాహంగా ఆడిన మారిన్ 3-1తో ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే ఈ దశలో తిరుగులేని స్మాష్‌లతో చెలరేగిన సైనా, వరుసగా ఎనిమిది పాయింట్లు సాధించి విరామ సమయానికి స్కోరును 11-4 వరకు తీసుకెళ్లింది. ఆ తర్వాత కూడా భారత షట్లర్ తగ్గలేదు. ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచి 19-9 వరకు దూసుకుపోయింది. ఈ దశలో సైనా తప్పిదాలతో స్పెయిన్ ప్లేయర్‌కు రెండు పాయింట్లు లభించాయి. చివరకు మారిన్ కొట్టిన స్మాష్.. కోర్టు బయట పడటంతో టైటిల్ సైనా నెహ్వాల్ సొంతమైంది.
 
 కమాన్...
 రెండో గేమ్‌లో ఒక దశలో తనను తాను ఉత్సాహపరచుకునే ప్రయత్నంలో సైనా పదే పదే ‘కమాన్ సైనా’ అంటూ అరుస్తూ వచ్చింది. అయితే ర్యాలీల సమయంలో అది ఇబ్బందికరంగా మారడంతో చైర్ అంపైర్‌కు ప్రత్యర్థి ఫిర్యాదు చేసింది. ఈ దశలో వీరిద్దరి మధ్య కొంత వాగ్వాదం కూడా జరిగింది. అయితే అంపైర్ దానిని పెద్దగా పట్టించుకోకుండా ఆట కొనసాగించమని కరోలినాకు సూచించారు.
 
 విశేషాలు...
 ఈ ఏడాది ఇండియా ఓపెన్ గ్రాండ్ ప్రి గోల్డ్ (లక్నోలో) టోర్నీ సాధించిన సైనాకు ఇది రెండో విజయం.
 
 సైనా కెరీర్‌లో ఇది ఏడో సూపర్ సిరీస్ టైటిల్. ఇండోనేసియా సూపర్ సిరీస్‌ను 3 సార్లు (2009, 2010, 2012) గెలిచిన సైనా... సింగపూర్ (2010), డెన్మార్క్ (2012), హాంకాంగ్ (2010), ఆస్ట్రేలియన్ సూపర్ సిరీస్‌లలో ఒక్కోసారి విజేతగా నిలిచింది.
 
 2012 అక్టోబరులో డెన్మార్క్ ఓపెన్ నెగ్గాక దాదాపు 20 నెలల తర్వాత ఇప్పుడు మరో సూపర్ సిరీస్‌ను సైనా గెలుచుకుంది.
 
 2014లో ఆస్ట్రేలియన్ ఓపెన్‌తో కలిపి మొత్తం ఎనిమిది సూపర్ సిరీస్ టోర్నీలు జరిగాయి. ఇందులో ఏడు టైటిల్స్ చైనా క్రీడాకారిణులే నెగ్గగా... ఈ సారి సైనా గెలవడం విశేషం.
 
 సరైన సమయంలో...
 సూపర్ సిరీస్ విజయంతో చాలా సంతోషంగా ఉన్నాను. నా కఠిన శ్రమకు తగిన ఫలితం లభించింది. నేను గాయం బారిన పడకుండా నా కోచ్‌లు ఎంతో శ్రద్ధ తీసుకున్నారు. కీలకమైన సమయంలో ఈ విజయం నాకు దక్కింది. కెరీర్‌లో ఇది మరో కీలక సంవత్సరం కానుంది. కామన్వెల్త్ క్రీడల్లో డిఫెండింగ్ చాంపియన్‌గా నేను బరిలోకి దిగుతున్నాను. ఆసియా క్రీడల్లో కూడా రాణించాల్సి ఉంది. కాబట్టి ఆస్ట్రేలియన్ ఓపెన్ విజయం నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది.    
 - సైనా నెహ్వాల్
 

Advertisement

తప్పక చదవండి

Advertisement