భారత్ ‘హ్యాట్రిక్’ | Sakshi
Sakshi News home page

భారత్ ‘హ్యాట్రిక్’

Published Wed, May 21 2014 12:58 AM

భారత్ ‘హ్యాట్రిక్’

చివరి మ్యాచ్‌లో 3-2తో థాయ్‌లాండ్‌పై గెలుపు
 గ్రూప్ ‘వై’లో అగ్రస్థానం
 ప్రపంచ చాంపియన్‌పై నెగ్గిన సైనా   
  సింధు, జ్వాల-అశ్విని జోడి విజయం
 
 న్యూఢిల్లీ: సొంతగడ్డపై జోరు కొనసాగిస్తూ భారత మహిళల బ్యాడ్మింటన్ జట్టు వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసుకుంది. ఉబెర్ కప్ ప్రపంచ టీమ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో గ్రూప్ ‘వై’లో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. మంగళవారం జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో టీమిండియా 3-2తో థాయ్‌లాండ్‌ను ఓడించింది. గ్రూప్ ‘వై’లో టాప్‌గా నిలిచిన భారత్‌కు క్వార్టర్ ఫైనల్లో గ్రూప్ ‘డబ్ల్యూ’లో రెండో స్థానంలో నిలిచే అవకాశమున్న ఇంగ్లండ్ లేదా చైనీస్ తైపీ ఎదురవుతుంది.
 
 తొలి సింగిల్స్‌లో ప్రపంచ 8వ ర్యాంకర్ సైనా నెహ్వాల్ 22-20, 21-14తో ప్రస్తుత ప్రపంచ చాంపియన్, నాలుగో ర్యాంకర్ ఇంతనోన్ రత్చనోక్‌పై సంచలన విజయం సాధించింది.
 
 భారత్‌కు పి.వి.సింధు మరో విజయం అందించింది. ప్రపంచ 11వ ర్యాంకర్ సింధు 21-19, 21-14తో  9వ ర్యాంకర్ పోర్న్‌టిప్‌పై నెగ్గింది.  
 
 ఆ తర్వాత డబుల్స్ మ్యాచ్‌లో గుత్తా జ్వాల-అశ్విని పొనప్ప ద్వయం 21-16, 21-13తో అరూన్‌కెసర్న్-సావిత్రి అమిత్రపాయ్ జోడిపై నెగ్గి భారత్‌కు 3-0తో స్పష్టమైన ఆధిక్యాన్ని అందించడంతోపాటు విజయాన్ని ఖాయం చేసింది.
 
 నాలుగో మ్యాచ్‌లో పి.సి.తులసీ 15-21, 10-21తో ప్రపంచ 17వ ర్యాంకర్ బుసానన్ ఒంగ్‌బుమ్‌రుంగ్‌పాన్ చేతిలో ఓడిపోయింది. ఐదో మ్యాచ్‌గా జరిగిన డబుల్స్‌లో  సైనా-సింధు జోడి 12-21, 21-18, 15-21తో కున్‌చాలా-సప్‌సిరీ జంట చేతిలో ఓటమి పాలైంది.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement