Sakshi News home page

సానియా సువర్ణధ్యాయం

Published Mon, Oct 27 2014 1:01 AM

సానియా సువర్ణధ్యాయం

 భారత టెన్నిస్ చరిత్రలో సానియా మీర్జా కొత్త అధ్యాయాన్ని లిఖించింది. లియాండర్ పేస్, మహేశ్ భూపతిలాంటి దిగ్గజాలతో సాధ్యంకాని ఘనతను ఈ హైదరాబాద్ అమ్మాయి సాధించింది. మహిళల టెన్నిస్ సీజన్ ముగింపు టోర్నీ డబ్ల్యూటీఏ ఫైనల్స్‌లో ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన సానియా మీర్జా తన భాగస్వామి కారా బ్లాక్‌తో కలిసి చాంపియన్‌గా అవతరించి పెను సంచలనం సృష్టించింది. సెమీఫైనల్లో మూడు మ్యాచ్ పాయింట్లను కాపాడుకొని గట్టెక్కిన సానియా-కారా బ్లాక్ ద్వయం ఫైనల్లో మాత్రం దుమ్మురేపింది. డిఫెండింగ్ చాంపియన్స్ సు వీ సెయి-షుయె పెంగ్ జంటకు ఒకే ఒక్క గేమ్ కోల్పోయి సానియా-కారా బ్లాక్ జోడీ చిరస్మరణీయ విజయాన్ని సొంతం చేసుకుంది.
 
 సింగపూర్: తన డబుల్స్ భాగస్వామి కారా బ్లాక్‌కు సానియా మీర్జా చిరస్మరణీయ కానుక ఇచ్చింది. కారా బ్లాక్‌తో కలిసి చివరి టోర్నీ ఆడిన సానియా ఆమెకు టైటిల్‌తో వీడ్కోలు చెప్పింది. మహిళల టెన్నిస్ సీజన్ ముగింపు టోర్నమెంట్ డబ్ల్యూటీఏ ఫైనల్స్‌లో సానియా మీర్జా (భారత్)-కారా బ్లాక్ (జింబాబ్వే) ద్వయం విజయఢంకా మోగించింది. ఆదివారం ఏకపక్షంగా జరిగిన ఫైనల్లో సానియా-కారా బ్లాక్ 6-1, 6-0తో డిఫెండింగ్ చాంపియన్స్ సు వీ సెయి (చైనీస్ తైపీ)-షుయె పెంగ్ (చైనా) జోడీని చిత్తు చేసింది. ఫైనల్లో ఓడిన సు వీ సెయి వచ్చే సీజన్‌లో సానియా కొత్త భాగస్వామిగా ఉండబోతుంది.

విజేతగా నిలిచిన సానియా జంటకు 5 లక్షల డాలర్ల (రూ. 3 కోట్లు) ప్రైజ్‌మనీతోపాటు 1500 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. రన్నరప్ సు వీ సెయి-షుయె పెంగ్‌లకు 2 లక్షల 50 వేల డాలర్లు (రూ. కోటీ 52 లక్షలు) దక్కాయి. టెన్నిస్ దిగ్గజం మార్టినా నవ్రతిలోవా చేతుల మీదుగా సానియా జంట ట్రోఫీని అందుకుంది.

     కేవలం 59 నిమిషాల్లో ముగిసిన ఈ పోరులో భారత్-జింబాబ్వే జంటకు ఏ దశలోనూ పోటీ ఎదురుకాలేదు. మ్యాచ్ మొత్తంలో సానియా జోడీ ఆరు బ్రేక్ పాయింట్లు సాధించడం విశేషం. రెండు సెట్‌లలో మూడేసి బ్రేక్ పాయింట్లు దక్కాయి. మరోవైపు తమ ప్రత్యర్థికి ఈ ద్వయం ఒక్కసారి కూడా బ్రేక్ పాయింట్ అవకాశం ఇవ్వకపోవడం గమనార్హం. ఓవరాల్‌గా సానియా జంట మ్యాచ్‌లో వరుసగా 12 గేమ్‌లు గెలిచింది.

     క్వార్టర్ ఫైనల్లో ఒక మ్యాచ్ పాయింట్‌ను, సెమీఫైనల్లో మూడు మ్యాచ్ పాయింట్లను కాపాడుకొని ఫైనల్‌కు చేరిన సానియా జంట ఫైనల్లో మాత్రం ఊహకందని ఆటతీరును కనబరిచింది. షుయె పెంగ్ తొలి సర్వీస్‌ను నిలబెట్టుకోవడంతో ఈ జోడీ 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే సానియా-కారా బ్లాక్ చెలరేగడంతో షుయె పెంగ్-సు వీ సెయి జంటకు తాము సాధించిన తొలి గేమే మొదటిది, చివరిది అయ్యింది. నెట్ వద్ద అప్రమత్తంగా వ్యవహరించడంతోపాటు కచ్చితమైన సర్వీస్, వ్యాలీలతో సానియా జంట పరిపూర్ణ ఆటతీరుతో విజేతగా నిలిచింది.

     సానియాకిది తొలి డబ్ల్యూటీఏ ఫైనల్స్ టైటిల్‌కాగా... కారా బ్లాక్‌కు మూడోది. 2007, 2008లలో లీజెల్ హుబెర్ (అమెరికా)తో కలిసి కారా బ్లాక్ టైటిల్స్ గెలిచింది. మరో ఆరుసార్లు ఈ జింబాబ్వే క్రీడాకారిణి ఆరుసార్లు రన్నరప్‌గా నిలిచింది.

     ఈ విజయంతో సానియా భారత టెన్నిస్ చరిత్రలో అరుదైన గౌరవాన్ని సాధించింది. సీజన్ ముగింపు టోర్నీలో విజేతగా నిలిచిన తొలి భారతీయ ప్లేయర్‌గా ఆమె నిలిచింది. పురుషుల టెన్నిస్‌లో సీజన్ ముగింపు టోర్నీ అయిన ఏటీపీ వరల్డ్ టూర్ ఫైనల్స్‌లో మహేశ్ భూపతి-రోహన్ బోపన్న (2012); మహేశ్ భూపతి-మాక్స్ మిర్నీ (బెలారస్-2010) ఫైనల్‌కు చేరినా రన్నరప్‌గా నిలిచారు. అంతకుముందు టెన్నిస్ మాస్టర్స్ కప్‌గా పేరున్న ఈ టోర్నీలో లియాండర్ పేస్ (భారత్)-నెనాద్ జిమోనిచ్ (సెర్బియా) జంట 2005లో రన్నరప్‌గా నిలిచింది. ఈ టోర్నీ కంటే ముందు ఏటీపీ టూర్ వరల్డ్ చాంపియన్‌షిప్‌లో మూడుసార్లు (2000, 1999, 1997) లియాండర్ పేస్-మహేశ్ భూపతి జంట రన్నరప్‌గా నిలిచింది.
 
 గత రెండు మ్యాచ్‌ల్లో ఓటమి అంచుల్లో నుంచి గట్టెక్కాం. టెన్నిస్ అంటే అదేమరి. ఈ ఆట ఎల్లప్పుడూ మరో అవకాశం ఇస్తుంది. పోరాడితే తప్పకుండా ఫలితం వస్తుంది. ఈ టోర్నీలో ఈ విషయం రుజువైంది. మా ఇద్దరి ప్రయాణం అద్భుతంగా సాగింది. మా ఇద్దరికీ ఇదే అత్యుత్తమ మ్యాచ్. నా భాగస్వామి కారా బ్లాక్ నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. ఆమె ఓ గొప్ప చాంపియన్. కారా రూపంలో నాకు గొప్ప స్నేహితురాలు లభించింది. ఆమె నాకు సోదరిలాంటిది. మేమిద్దరం మళ్లీ కలసి ఆడతామో లేదోగానీ మా స్నేహం మాత్రం కలకాలం ఉంటుంది.    - సానియా మీర్జా
 
 మా భాగస్వామ్యంలో ఆరంభం, ముగింపు అదిరాయి. మూడు పదుల వయసు దాటడంతో ఈ ఆటకు అవసరమైనంతమేర చురుకుగా కదల్లేకపోతున్నాను. సానియా తన కెరీర్‌లోనే గొప్ప ఫామ్‌లో ఉంది. వచ్చే ఏడాది నేను ఆడతానో లేదో అని యూఎస్ ఓపెన్ సందర్భంగా సానియాకు తెలిపాను. టోర్నీల సమయంలో పాపతో కలిసి ప్రయాణం చేయడం కూడా సులువేం కాదు. కొత్త భాగస్వామిని ఎంచుకొని సానియా నా నిర్ణయాన్ని గౌరవించింది.    - కారా బ్లాక్

Advertisement

తప్పక చదవండి

Advertisement