‘వన్’డర్ సానియా... | Sakshi
Sakshi News home page

‘వన్’డర్ సానియా...

Published Mon, Apr 13 2015 12:58 AM

‘వన్’డర్ సానియా...

  •       డబుల్స్‌లో ప్రపంచ నంబర్‌వన్‌గా భారత స్టార్
  •      హింగిస్‌తో కలిసి ఫ్యామిలీ సర్కిల్ కప్ సొంతం
  •      ఈ సీజన్‌లో వరుసగా మూడో టైటిల్
  •      రూ. 24 లక్షల 28 వేల ప్రైజ్‌మనీ సొంతం
  •  
     చార్ల్స్‌టన్ (అమెరికా): కల నిజమైంది. భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా అద్భుతం చేసింది. ప్రపంచ మహిళల డబుల్స్ విభాగంలో నంబర్‌వన్ ర్యాంక్‌ను సొంతం చేసుకొని కొత్త చరిత్ర సృష్టించింది. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ క్రీడాకారిణిగా గుర్తింపు పొందింది. ఆదివారం ముగిసిన ఫ్యామిలీ సర్కిల్ కప్ టోర్నమెంట్‌లో స్విట్జర్లాండ్ స్టార్ మార్టినా హింగిస్‌తో కలిసి సానియా విజేతగా నిలిచింది. 58 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో టాప్ సీడ్ సానియా-హింగిస్ ద్వయం 6-0, 6-4తో కేసీ డెలాక్వా (ఆస్ట్రేలియా)-దరిజా జురాక్ (క్రొయషియా) జంటపై గెలిచింది. సానియా జంటకు 39 వేల డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 24 లక్షల 28 వేలు)తోపాటు 470 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి.
     
     ఈ టైటిల్‌తో సోమవారం విడుదల చేసే మహిళల టెన్నిస్ సంఘం (డబ్ల్యూటీఏ) డబుల్స్ ర్యాంకింగ్స్‌లో సానియా అధికారికంగా నంబర్‌వన్ ర్యాంక్‌ను హస్తగతం చేసుకుంటుంది. హింగిస్‌తో కలిసి సానియాకిది వరుసగా మూడో టైటిల్ కావడం విశేషం. ఇటీవలే ఈ ఇద్దరూ కలిసి ఇండియన్ వెల్స్ ఓపెన్, మియామి ఓపెన్‌లలో విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే.
     
    లియాండర్ పేస్, మహేశ్ భూపతి తర్వాత భారత్ తరఫున డబుల్స్‌లో నంబర్‌వన్‌గా నిలిచిన భారత ప్లేయర్‌గా సానియా నిలిచింది. అంతేకాకుండా అయ్ సుగియామ (జపాన్), షుయె పెంగ్ (చైనా), సెయి సు వీ (చైనీస్ తైపీ) తర్వాత మహిళల డబుల్స్‌లో ఆసియా నుంచి ఈ ఘనత సాధించిన నాలుగో క్రీడాకారిణిగా సానియా గుర్తింపు పొందింది.
     
     ‘‘ఏదో ఒక రోజున ప్రపంచ నంబర్‌వన్‌గా నిలవాలని ప్రతీ క్రీడాకారుడు కలలు కంటాడు. హింగిస్‌లాంటి క్రీడాకారిణితో కలిసి ఈ ఘనత సాధించినందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఈ టోర్నీలో ఆడేందుకు వచ్చిన సమయంలో మా మదిలో ఒకటే లక్ష్యం ఉంది. అదే నంబర్‌వన్ కావడం. ఈ ఏడాది మరిన్ని టోర్నీల్లో గెలుస్తామని భావిస్తున్నాను.’’
     -సానియా
     

Advertisement
Advertisement