మరో టైటిల్ పోరుకు సానియా జంట

30 Sep, 2016 23:27 IST|Sakshi
మరో టైటిల్ పోరుకు సానియా జంట

న్యూఢిల్లీ: ఈ ఏడాది తొమ్మిదో డబుల్స్ టైటిల్ సాధించేందుకు భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా మరో విజయం దూరంలో నిలిచింది. చైనాలో జరుగుతున్న వుహాన్ ఓపెన్‌లో సానియా మీర్జా తన చెక్ రిపబ్లిక్ భాగస్వామి బార్బరా స్ట్రికోవాతో కలిసి టైటిల్ పోరుకు అర్హత సాధించింది.
 
 శుక్రవారం జరిగిన మహిళల డబుల్స్ సెమీఫైనల్లో మూడో సీడ్ సానియా-స్ట్రికోవా ద్వయం 6-4, 3-6, 10-7తో ‘సూపర్ టైబ్రేక్’లో రెండో సీడ్ హావో చింగ్ చాన్-యుంగ్ జాన్ చాన్ (చైనీస్ తైపీ)పై గెలిచింది. గంటా 24 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సానియా జంట తొలి సెట్‌ను నెగ్గినా రెండో సెట్‌లో తడబడింది. నిర్ణాయక సూపర్ టైబ్రేక్‌లో తమ ఆధిపత్యాన్ని చాటుకొని విజయాన్ని ఖాయం చేసుకంది.
 
  అంతకుముందు జరిగిన క్వార్టర్ ఫైనల్లో సానియా-స్ట్రికోవా 6-3, 7-6 (7/5)తో తిమియా బాబోస్ (హంగేరి)-యారోస్లావా ష్వెదోవా (కజకిస్తాన్)లపై విజయం సాధించారు. ఫైనల్లో బెథానీ మాటెక్ సాండ్‌‌స (అమెరికా)-లూసీ సఫరోవా (చెక్ రిపబ్లిక్)లతో సానియా-స్ట్రికోవా తలపడతారు.  
 

మరిన్ని వార్తలు