సాత్విక్‌–చిరాగ్‌ జంట చిరస్మరణీయ విజయం

5 Aug, 2019 05:28 IST|Sakshi

థాయ్‌లాండ్‌ ఓపెన్‌ టోర్నీలో భారత జోడీకి పురుషుల డబుల్స్‌ టైటిల్‌

ఫైనల్లో ప్రపంచ చాంపియన్‌ ద్వయంపై సంచలన విజయం

సూపర్‌–500 స్థాయి టోర్నీ నెగ్గిన తొలి భారత జంటగా రికార్డు

నిరీక్షణ ముగిసింది. లోటు తీరింది. ఆందోళనకు తెర పడింది. అంతర్జాతీయస్థాయి డబుల్స్‌ విభాగంలో మనకు అత్యున్నత విజయాలు లభించట్లేదని విమర్శిస్తున్న వారందరికీ భారత యువతారలు రంకిరెడ్డి సాత్విక్‌ సాయిరాజ్, చిరాగ్‌ శెట్టి తమ అద్వితీయ ఆటతో సమాధానం ఇచ్చారు. ఎవరూ ఊహించని విధంగా థాయ్‌లాండ్‌ ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–500 టోర్నమెంట్‌లో పురుషుల డబుల్స్‌ టైటిల్‌ను సాధించి ఔరా అనిపించారు. అన్‌సీడెడ్‌గా బరిలోకి దిగి ఒక్కో అడ్డంకిని అధిగమిస్తూ టైటిల్‌ పోరుకు చేరిన సాత్విక్‌–చిరాగ్‌ అంతిమ సమరంలో ప్రస్తుత ప్రపంచ చాంపియన్, ప్రపంచ ర్యాంకింగ్స్‌లో రెండో స్థానంలో ఉన్న లి జున్‌ హుయ్‌–లియు యు చెన్‌ (చైనా) జోడీని బోల్తా కొట్టించి అద్భుతమే చేశారు.   

బ్యాంకాక్‌: ఈ ఏడాది సింగిల్స్‌ విభాగంలో భారత అగ్రశ్రేణి క్రీడాకారుల వైఫల్యం కొనసాగుతున్న దశలో... ఎవరూ ఊహించని విధంగా డబుల్స్‌ విభాగంలో భారత్‌కు గొప్ప టైటిల్‌ లభించింది. ఆంధ్రప్రదేశ్‌ ప్లేయర్‌ రంకిరెడ్డి సాత్విక్‌ సాయిరాజ్, ముంబై ఆటగాడు చిరాగ్‌ శెట్టి థాయ్‌లాండ్‌ ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–500 టోర్నమెంట్‌లో చిరస్మరణీయ విజయం సాధించారు. ఆదివారం జరిగిన పురుషుల డబుల్స్‌ ఫైనల్లో అన్‌సీడెడ్‌ సాత్విక్‌ సాయిరాజ్‌–చిరాగ్‌ శెట్టి (భారత్‌) జంట 21–19, 18–21, 21–18తో ప్రస్తుత ప్రపంచ చాంపియన్, ప్రపంచ ర్యాంకింగ్స్‌లో రెండో స్థానంలో ఉన్న లి జున్‌ హుయ్‌–లియు యు చెన్‌ (చైనా) జోడీపై గెలిచి చాంపియన్‌గా అవతరించింది.

ఈ గెలుపుతో సాత్విక్‌–చిరాగ్‌ ద్వయం రికార్డు పుస్తకాల్లోకి ఎక్కింది. సూపర్‌–500 స్థాయి టోర్నీలో డబుల్స్‌ టైటిల్‌ గెలిచిన తొలి భారతీయ జోడీగా గుర్తింపు పొందింది. విజేతగా నిలిచిన సాత్విక్‌–చిరాగ్‌ జోడీకి 27,650 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 19 లక్షల 27 వేలు)తోపాటు 9,200 ర్యాంకింగ్‌ పాయింట్లు లభించాయి. ఈ ఏడాది సాత్విక్‌–చిరాగ్‌ జంటకు ఇది రెండో అంతర్జాతీయ టైటిల్‌. గత మేలో ఈ జోడీ బ్రెజిల్‌ ఇంటర్నేషనల్‌ చాలెంజ్‌ టోర్నీలో విజేతగా నిలిచింది. తూర్పు గోదావరి జిల్లా అమలాపురానికి చెందిన 18 ఏళ్ల సాత్విక్‌ 2012  నుంచి హైదరాబాద్‌లోని పుల్లెల గోపీచంద్‌ అకాడమీలో శిక్షణ తీసుకుంటున్నాడు. ముంబైకి చెందిన 22 ఏళ్ల చిరాగ్‌ శెట్టి మూడేళ్లుగా సాత్విక్‌తో కలిసి డబుల్స్‌లో ఆడుతున్నాడు. ఓవరాల్‌గా ఈ జోడీ ఇప్పటివరకు మొత్తం ఎనిమిది టైటిల్స్‌ సొంతం చేసుకుంది. గతేడాది కామన్వెల్త్‌ గేమ్స్‌లో రజత పతకం దక్కించుకుంది.  

హోరాహోరీ...
ఈ ఏడాది ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో లి జున్‌ హుయ్‌– లియు యు చెన్‌ చేతిలో వరుస గేముల్లో ఓడిపోయిన సాత్విక్‌–చిరాగ్‌ జంట ఈసారి మాత్రం ప్రత్యర్థికి ముచ్చెమటలు పట్టించింది. 62 నిమిషాలపాటు సాగిన పోరులో ప్రతి పాయింట్‌ కోసం రెండు జోడీలు తీవ్రంగా పోరాడాయి. మూడు గేముల్లోనూ అంతరం మూడు పాయింట్లలోపే ఉండటం మ్యాచ్‌ తీవ్రతను చాటి చెబుతోంది. గతంలో కీలకదశలో తడబాటుకు లోనై పాయింట్లు కోల్పోయి గొప్ప విజయాలు చేజార్చుకున్న సాత్విక్‌–చిరాగ్‌ ద్వయం ఈసారి సంయమనంతో ఆడి పైచేయి సాధించింది. సుదీర్ఘ ర్యాలీలకు అవకాశం ఇవ్వకుండా తక్కువ షాట్‌లలోనే పాయింట్లను ముగించిన సాత్విక్‌–చిరాగ్‌ జోడీ నిర్ణాయక మూడో గేమ్‌లో ఒకదశలో 1–4తో, 3–6తో వెనుకబడింది. కానీ వెంటనే తేరుకొని వరుసగా ఐదు పాయింట్లు సాధించి 8–6తో ఆధిక్యంలోకి వచ్చింది. ఆ తర్వాత ఈ ఆధిక్యాన్ని కాపాడుకొని విజయాన్ని చేజిక్కించుకుంది.

నాకు భుజం నొప్పిగా ఉండటంతో ఫైనల్లో నేను ముందుండి ఆడాలని, చిరాగ్‌ వెనుకుండి ఆడాలని నిర్ణయించాం. నేను ఎక్కువగా సర్వీస్, నెట్‌ వద్ద దృష్టి పెట్టాను. షటిల్‌ను తక్కువ ఎత్తులో ఉంచాలని, పాయింట్లను ముగించేందుకు తొందరపడకూడదనే వ్యూహంతో బరిలోకి దిగాం. మా వ్యూహం ఫలించింది. టోర్నీ మొత్తం ప్రతి మ్యాచ్‌లోనూ మేము ఆశావహ దృక్పథంతో ఆడాం. వెనుకబడిన దశల్లోనూ నిగ్రహం కోల్పోకుండా సంయమనం ప్రదర్శించాం. మా జీవితంలోనే ఇది అతి పెద్ద విజయం.    
–సాత్విక్‌ సాయిరాజ్‌

ఈ విజయం సాత్విక్‌–చిరాగ్‌ కెరీర్‌లో ఎంతో గొప్పది. థాయ్‌లాండ్‌ ఓపెన్‌లో మేటి జోడీలు బరిలోకి దిగాయి. ఈ గెలుపు భవిష్యత్‌లో వారికి మరింత ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుందనడంలో సందేహం లేదు. ఇక నుంచి డబుల్స్‌లో అత్యుత్తమ జోడీలకు సాత్విక్‌–చిరాగ్‌ జంట నుంచి మరిన్ని సవాళ్లు ఎదురవుతాయి.    
–పుల్లెల గోపీచంద్, చీఫ్‌ కోచ్‌

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు