శ్రీశాంత్‌ బ్యాన్‌.. బీసీసీఐకు ‘సుప్రీం’ నోటీసులు | Sakshi
Sakshi News home page

Published Mon, Feb 5 2018 1:05 PM

SC Notices to BCCI over Sreesanth Ban - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు(బీసీసీఐ)కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. తనపై విధించిన జీవిత కాల నిషేధాన్ని సవాల్‌ చేస్తూ క్రికెటర్‌ శ్రీశాంత్‌ సుప్రీం కోర్టును ఆశ్రయించాడు. సోమవారం అతని అభ్యర్థన పిటిషన్‌పై విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం ఈ మేరకు నోటీసులు పంపింది. 

ఈ సందర్భంగా శ్రీశాంత్‌ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘నేను ఎలాంటి తప్పు చేయలేదు. నాపై జీవిత కాల నిషేధం సరికాదు. మళ్లీ క్రికెట్‌ ఆడాలన్నది నా కల. ఖచ్ఛితంగా నాకు న్యాయ జరుగుతుంది’’ అని పేర్కొన్నాడు. కాగా, శ్రీశాంత్‌ నిషేధ అంశం పై వివరణ కోసం బీసీసీఐకు నాలుగు వారాల గడువు విధించినట్లు తెలుస్తోంది. 

2013 ఐపీఎల్‌ సీజన్‌లో శ్రీశాంత్‌తోపాటు ఇద్ద‌రు రాజ‌స్థాన్ రాయ‌ల్స్ ఆట‌గాళ్లు అజిత్ చండీలా, అంకిత్ చ‌వాన్‌ల‌ను స్పాట్‌ఫిక్సింగ్ కేసులో ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ త‌ర్వాత బోర్డు శ్రీశాంత్‌పై నిషేధం విధించింది. అయితే 2015 జూలైలో అతడిపై ఉన్న అభియోగాలను కొట్టివేస్తూ పటియాలా హౌస్‌ కోర్టు నిర్దోషిగా విడుదల చేసింది. ఆ తర్వాత స్థానిక టోర్నీల్లో ఆడేందుకు శ్రీశాంత్‌ ప్రయత్నించినా బీసీసీఐ మాత్రం తాము విధించిన నిషేధాన్ని కొనసాగిస్తూ వస్తోంది. దీంతో అతను కేరళ హైకోర్టును శ్రీశాంత్ ఆశ్రయించాగా.. అతనికి ఊరట లభించింది. 

అయితే, కేరళ హైకోర్టు సింగిల్‌ బెంచ్‌ తీర్పును సవాల్‌ చేస్తూ బీసీసీఐ.. హైకోర్టు ఉన్నత ధర్మాసనాన్ని ఆశ్రయించింది. అతడికి వ్యతిరేకంగా సాక్ష్యాలు బలంగా ఉండటంతోనే తాము నిషేధం విధించామని పేర్కొంటూ.. పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై తాజాగా విచారణ జరిపిన ఉన్నత ధర్మాసనం.. బీసీసీఐ వాదనను సమర్థిస్తూ.. అతడిపై కేరళ హైకోర్టు నిషేధాన్ని పునరుద్ధరించింది. ఈ నేపథ్యంలోనే అతను సుప్రీంకోర్టును ఆశ్రయించాడు.

Advertisement
Advertisement