ఫెడరర్ శుభారంభం | Sakshi
Sakshi News home page

ఫెడరర్ శుభారంభం

Published Wed, Jun 25 2014 1:15 AM

ఫెడరర్ శుభారంభం

నాదల్, వావింకా, సోంగా కూడా...
 షరపోవా, రద్వాన్‌స్కా ముందంజ
 వింబుల్డన్ టెన్నిస్
 
 లండన్: ఎనిమిదోసారి వింబుల్డన్ టైటిల్‌పై గురిపెట్టిన ప్రపంచ మాజీ నంబర్‌వన్ రోజర్ ఫెడరర్... తొలి రౌండ్‌లో సునాయాస విజయాన్ని నమోదు చేశాడు. మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్‌లో నాలుగోసీడ్ ఫెడరర్ (స్విట్జర్లాండ్) 6-1, 6-1, 6-3తో ప్రపంచ 83వ ర్యాంకర్, అన్‌సీడెడ్ పావోలో లోరెంజీ (ఇటలీ)పై నెగ్గి రెండో రౌండ్‌లోకి ప్రవేశించాడు. గత 11 ఏళ్లలో తొలి రౌండ్ మ్యాచ్‌ను వరుస సెట్లలో గెలవడం ఫెడరర్‌కు ఇది పదోసారి. 93 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ఫెడరర్ పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించాడు. తొమ్మిది ఏస్‌లు సంధించడంతోపాటు ఐదు బ్రేక్ పాయింట్లను కాపాడుకున్న ఈ స్విస్ ప్లేయర్ లోరెంజీ సర్వీస్‌ను ఆరుసార్లు బ్రేక్ చేశాడు.
 
 ఇతర తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో రెండోసీడ్ నాదల్ (స్పెయిన్) 4-6, 6-3, 6-3, 6-3తో మార్టిన్ క్లిజాన్ (స్లొవేకియా)పై; 5వ సీడ్ వావింకా (స్విట్జర్లాండ్) 6-3, 6-4, 6-3తో జో సోసా (పోర్చుగల్)పై; 8వ సీడ్ రావోనిక్ (కెనడా) 6-2, 6-4, 6-4తో ఎబ్డెన్ (ఆస్ట్రేలియా)పై; 10వ సీడ్ నిషికోరి (జపాన్) 6-4, 7-6 (5), 7-5తో డి షీపర్ (ఫ్రాన్స్)పై; 13వ సీడ్ గాస్కెట్ (ఫ్రాన్స్) 6-7 (3), 6-3, 3-6, 6-0, 6-1తో జేమ్స్ డక్‌వర్త్ (ఆస్ట్రేలియా)పై; 14వ సీడ్ సోంగా (ఫ్రాన్స్) 6-1, 3-6, 3-6, 6-2, 6-4తో జుర్గెన్ మెల్జర్ (ఆస్ట్రియా)పై; 19వ సీడ్ లోపెజ్ (స్పెయిన్) 7-6 (6), 7-6 (6), 7-6 (6)తో యుచి సుగిటా (జపాన్)పై నెగ్గి తదుపరి రౌండ్‌లోకి ప్రవేశించారు.
 
 మహిళల సింగిల్స్ తొలిరౌండ్‌లో టాప్‌సీడ్ సెరెనా విలియమ్స్ (అమెరికా) 6-1, 6-2తో తతిషవిల్లీ(అమెరికా)పై; 5వ సీడ్ మరియా షరపోవా (రష్యా) 6-1, 6-0తో సమంతా ముర్రే (బ్రిటన్)పై; 14వ సీడ్ రద్వాన్‌స్కా (పోలెండ్) 6-2, 6-2తో ఆండ్రియా మిటూ (రొమేరియా)పై; 9వ సీడ్ కెర్బర్ (జర్మనీ) 6-2, 6-4తో ఉసుజులా రద్వాన్‌స్కా (పోలెండ్)పై; 16వ సీడ్ వోజ్నియాకి (డెన్మార్క్) 6-3, 6-0తో షాహర్ పీర్ (ఇజ్రాయిల్)పై; 20వ సీడ్ పెట్కోవిచ్ (జర్మనీ) 6-1, 6-4తో కట్‌జైనా పీటర్ (పోలెండ్)పై గెలిచి రెండోరౌండ్‌లోకి అడుగుపెట్టారు.
 
 మళ్లీ తొలి రౌండ్‌లోనే...
 ఎంత పోరాడినా భారత స్టార్ ఆటగాడు సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్ తొలి రౌండ్ అడ్డంకిని అధిగమించలేకపోతున్నాడు. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో అతను 6-4, 3-6, 3-6, 6-3, 3-6తో 15వ సీడ్ జెర్జీ జానోవిచ్ (పోలెండ్) చేతిలో ఓటమిపాలయ్యాడు. చివరి 13 టోర్నీల్లో సోమ్‌దేవ్ తొలి రౌండ్‌లోనే ఓడటం ఇది 10వసారి. దాదాపు మూడు గంటలకుపైగా సాగిన ఈ మ్యాచ్‌లో సర్వీస్‌లో విఫలమైన సోమ్‌దేవ్ 19 డబుల్ ఫాల్ట్‌లతో మూల్యం చెల్లించుకున్నాడు. జానోవిచ్ బలమైన ఫోర్‌హ్యాండ్ షాట్లకు, బైస్‌లైన్ ఆటకు భారత కుర్రాడి వద్ద సమాధానం లేకపోయింది. కీలకమైన ఐదోసెట్‌లో నాలుగు బ్రేక్ పాయింట్లను కాపాడుకుని, నాలుగో గేమ్‌లో ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్ చేసి 3-1 ఆధిక్యంలో నిలిచాడు. కానీ ఈ దశలో పుంజుకున్న జానోవిచ్ వరుస పాయింట్లతో సోమ్‌దేవ్‌కు నిరాశ మిగిల్చాడు.
 

Advertisement
Advertisement