‘శిఖరా’న మనమే | Sakshi
Sakshi News home page

‘శిఖరా’న మనమే

Published Thu, Nov 28 2013 12:21 AM

‘శిఖరా’న మనమే

ఇటీవల కాలంలో ఎంత పెద్ద లక్ష్యాన్నైనా ఊదిపారేస్తున్న భారత జట్టు వెస్టిండీస్‌తో ఆఖరి వన్డేలోనూ అదే జోరు కొనసాగించింది. వైజాగ్ వన్డేలో కాస్త తడబడ్డ బ్యాట్స్‌మెన్ ఈసారి కుదురుకున్నారు. ఈసారి శిఖర్ ధావన్ వెస్టిండీస్ బౌలర్ల భరతం పట్టాడు. మెరుపు సెంచరీతో భారత్‌కు సిరీస్ విజయాన్ని అందించాడు. యువరాజ్ సింగ్ కూడా అర్ధసెంచరీతో ఫామ్‌లోకి రావడం ధోనిసేనకు పెద్ద సానుకూలాంశం.
 
 కాన్పూర్: వెస్టిండీస్‌తో జరిగిన రెండు టెస్టులతో పాటు తొలి రెండు వన్డేల్లో ఓపెనర్ శిఖర్ ధావన్ ఒక్క అర్ధసెంచరీ కూడా చేయలేదు. టాపార్డర్‌లో రోహిత్, కోహ్లి పోటాపోటీగా పరుగులు చేస్తుండటంతో తానొక్కడే కాస్త విఫలమైనట్లు కనిపించాడు. కానీ వెస్టిండీస్‌తో ఆఖరి వన్డేలో ఆ కొరత పూర్తిగా తీర్చేసుకున్నాడు. తనశైలిలో సంచలనాత్మక హిట్టింగ్‌తో ఈ ఏడాది వన్డేల్లో ఐదో సెంచరీ సాధించాడు. దీంతో గ్రీన్‌పార్క్‌లో బుధవారం భారత్-వెస్టిండీస్‌ల మ్యాచ్ ఏకపక్షంగా మారింది.
 
 
 శిఖర్ ధావన్ (95 బంతుల్లో 119; 20 ఫోర్లు)కు తోడు యువరాజ్ సింగ్ (74 బంతుల్లో 55; 7 ఫోర్లు) కూడా అర్ధసెంచరీతో ఫామ్‌లోకి రావడంతో... ఆఖరి వన్డేలో భారత్ 5 వికెట్ల తేడాతో గెలిచి మూడు వన్డేల సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది. టాస్ గెలిచిన భారత బౌలింగ్ ఎంచుకోగా... వెస్టిండీస్ 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 263 పరుగులు చేసింది.
 
 పావెల్ (81 బంతుల్లో 70; 9 ఫోర్లు), శామ్యూల్స్ (93 బంతుల్లో 71; 7 ఫోర్లు; 1 సిక్స్) డారెన్ బ్రేవో (53 బంతుల్లో 51 నాటౌట్; 4 ఫోర్లు; 2 సిక్స్), స్యామీ (29 బంతుల్లో 37 నాటౌట్; 1 ఫోర్; 2 సిక్స్) మెరుగ్గా ఆడారు. అశ్విన్‌కు రెండు, భువనేశ్వర్, షమీ, జడేజాలకు తలో వికెట్ దక్కింది. భారత జట్టు 46.1 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 266 పరుగులు చేసి గెలిచింది. రైనా (43 బంతుల్లో 34; 3 ఫోర్లు), ధోని (23 బంతుల్లో 23 నాటౌట్; 3 ఫోర్లు) రాణించారు. రాంపాల్, డ్వేన్ బ్రేవో రెండేసి వికెట్లు తీశారు. ధావన్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, కోహ్లికి మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు లభించాయి.
 
 ప్రారంభం అదిరినా..
 టాస్ గెలవగానే ఫీల్డింగ్ ఎంచుకున్న ధోనికి అనుకున్న ఫలితం దక్కలేదు. ఐదో ఓవర్‌లో ఓపెనర్ చార్లెస్ (11)ను చక్కటి ఇన్‌స్వింగర్‌తో భువనేశ్వర్ పెవిలియన్‌కు పంపి ఆనందం నింపినా... పావెల్, శామ్యూల్స్ జోడి అంత సులువుగా లొంగలేదు. జాగ్రత్తగా ఆడి 66 బంతుల్లో పావెల్, 73 బంతుల్లో శామ్యూల్స్ అర్ధ సెంచరీలు సాధించారు. ఈ ఇద్దరూ రెండో వికెట్‌కు 117 పరుగులు జోడించాక... అశ్విన్ బౌలింగ్‌లో పావెల్ అవుటయ్యాడు.  60 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద శామ్యూల్స్ ఇచ్చిన సులువైన క్యాచ్‌ను కోహ్లి స్లిప్‌లో వదిలేసినా... కొద్దిసేపటికే అశ్విన్ బౌలింగ్‌లో శామ్యూల్స్ బౌల్డయ్యాడు. అటు డారెన్ బ్రేవో వేగంగా ఆడుతూ 53 బంతుల్లోనే అర్ధ సెంచరీ చేశాడు. డ్వేన్ బ్రేవో (4) మరోసారి విఫలం కాగా చివర్లో స్యామీతో కలిసి డారెన్ ఆరో వికెట్‌కు అజేయంగా 49 బంతుల్లోనే 69 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. దీంతో విండీస్ గౌరవప్రదమైన స్కోరు సాధించింది.
 
 ధావన్ దూకుడు
 ఇన్నింగ్స్ రెండో ఓవర్ నుంచే ధావన్ దూకుడు ప్రారంభమైంది. ఆ ఓవర్లో మూడు ఫోర్లు బాది తన ఉద్దేశాన్ని చాటాడు. అయితే ఫామ్‌లో ఉన్న రోహిత్ (4) రాంపాల్ బౌలింగ్‌లో కవర్ వైపు బంతిని పుష్ చేయబోయి స్లిప్‌లో దొరికిపోయాడు. కోహ్లి (18 బంతుల్లో 19; 3 ఫోర్లు)ని కూడా రాంపాల్ అవుట్ చేశాడు. దీంతో 61 పరుగులకే భారత్ రెండు కీలక వికెట్లు కోల్పోయింది. ఈ దశలో ధావన్‌కు యువరాజ్ జత కలిశాడు. చక్కటి కవర్‌డ్రైవ్స్, పుల్ షాట్స్‌తో ఆకట్టుకున్న ధావన్ 97 పరుగుల దగ్గర బౌండరీతో శతకాన్ని చేరుకున్నాడు. కేవలం 73 బంతుల్లోనే ఈ ఫీట్‌ను సాధించడం విశేషం.
 
 ఆ తర్వాతి ఓవర్‌లోనే యువీ 68 బంతుల్లో అర్ధ సెంచరీ చేశాడు. అయితే కొద్దిసేపటికే నరైన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 38వ ఓవర్‌లో ధావన్.. డ్వేన్ బ్రేవోకు రిటర్న్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత రైనాతో కలిసి ధోని జట్టును విజయం వైపు తీసుకెళ్లాడు. 43వ ఓవర్‌లో రైనా వికెట్ కీపర్‌కు దొరికిపోగా... జడేజా (2 నాటౌట్)తో కలిసి కెప్టెన్ మిగిలిన లాంఛనాన్ని పూర్తి చేశాడు.
 
 స్కోరు వివరాలు: వెస్టిండీస్ ఇన్నింగ్స్: చార్లెస్ (బి) భువనేశ్వర్ 11; పావెల్ (సి) ధావన్ (బి) అశ్విన్ 70; శామ్యూల్స్ (బి) అశ్విన్ 71; డారెన్ బ్రేవో నాటౌట్ 51; సిమన్స్ (సి) ధోని (బి) జడేజా 13; డ్వేన్ బ్రేవో (సి) అశ్విన్ (బి) షమీ 4; స్యామీ నాటౌట్ 37; ఎక్స్‌ట్రాలు (లెగ్ బైస్ 2, వైడ్లు 3, నోబ్ 1) 6; మొత్తం (50 ఓవర్లలో 5 వికెట్లకు) 263.
 
 వికెట్ల పతనం: 1-20; 2-137; 3-168; 4-187; 5-196.
 
 బౌలింగ్: భువనేశ్వర్ 8-0-42-1; మోహిత్ 7-0-47-0; షమీ 10-1-49-1; అశ్విన్ 10-0-45-2; రైనా 5-0-29-0; జడేజా 10-0-49-1.
 
 భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (సి) డ్వేన్ బ్రేవో (బి) రాంపాల్ 4; ధావన్ (సి అండ్ బి) డ్వేన్ బ్రేవో 119; కోహ్లి (సి) చార్లెస్ (బి) రాంపాల్ 19; యువరాజ్ (సి) డ్వేన్ బ్రేవో (బి) నరైన్ 55; రైనా (సి) చార్లెస్ (బి) డ్వేన్ బ్రేవో 34; ధోని నాటౌట్ 23; జడేజా నాటౌట్ 2; ఎక్స్‌ట్రాలు (లెగ్ బైస్ 5, వైడ్లు 4, నోబ్ 1) 10; మొత్తం (46.1 ఓవర్లలో ఐదు వికెట్లకు) 266.
 
 వికెట్ల పతనం: 1-29; 2-61; 3-190; 4-218; 5-255.
 బౌలింగ్: రాంపాల్ 10-1-55-2; హోల్డర్ 6-0-47-0; డ్వేన్ బ్రేవో 10-0-57-2; నరైన్ 10-1-32-1; స్యామీ 3-0-22-0; సిమన్స్ 3-0-17-0; పెరుమాల్ 4.1-0-31-0.
 
 5 ఈ ఏడాది ధావన్  సెంచరీలు. తక్కువ ఇన్నింగ్స్ (23)లో ఐదు సెంచరీల తరంగ రికార్డు సమం.
 
 6 ఈ ఏడాది భారత్ వరుసగా ఆరు వన్డే సిరీస్/టోర్నీలను గెలుచుకుంది.
 
 1 ఈ వన్డే ద్వారా గ్రీన్‌పార్క్ మైదానంలో భారత్ అత్యధిక పరుగుల (264) లక్ష్యాన్ని ఛేదించింది    
 
 మా ప్రదర్శన బాగుంది
 ‘ఈ సిరీస్‌లో మా ప్రదర్శన బాగుంది. ముఖ్యంగా చివరి ఓవర్లలో బౌలింగ్ మెరుగుపడింది. ఆసీస్‌తో సిరీస్‌తో పోలిస్తే ఇది సానుకూలాంశం. మా టాప్ ఆర్డర్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉంది. గతంతో పోలిస్తే కాన్పూర్ వికెట్ బాగా మెరుగైంది. ఇప్పుడు బ్యాటింగ్ చేయడం సులభంగా ఉంది.’     
 - ధోని
 

Advertisement
Advertisement