'పాకిస్థానీలపై మాజీ క్రికెటర్ సర్జికల్ దాడి' | Sakshi
Sakshi News home page

'పాకిస్థానీలపై మాజీ క్రికెటర్ సర్జికల్ దాడి'

Published Tue, Oct 25 2016 5:38 PM

'పాకిస్థానీలపై మాజీ క్రికెటర్ సర్జికల్ దాడి' - Sakshi

‘పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ ఇంగ్లీష్ మాట్లాడే స్వదేశీయులపై సర్జికల్ దాడి చేశాడు. కాగా ఇప్పటి వరకూ ఎవరూ గాయపడినట్టు సమాచారం లేదు’.. ట్విట్టర్లో అక్తర్ ఫాలోవర్ చేసిన ట్వీట్ ఇది. అంతేకాదు ట్విట్టర్ వేదికగా అతనిపై జోకులు పేలాయి. తన ఫాస్ట్ బౌలింగ్తో ప్రపంచ మేటి బ్యాట్స్మెన్కు చుక్కలు చూపించిన రావల్పిండి ఎక్స్ప్రెస్ర్.. ట్వీట్ల దాడిలో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఇంతకీ విషయం ఏంటంటే..

ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తొలి పాకిస్థానీ మహిళ సమీనా.. అక్తర్ను కలిసింది. సమీనాతో దిగిన ఫొటోను పోస్ట్ చేసి, ఆమెను ప్రశంసిస్తూ అక్తర్ ఇంగ్లీష్‌లో ట్వీట్ చేశాడు. పాపం పాక్ మాజీ పేసర్కు ఇంగ్లీష్ సరిగా రాకపోవడంతో తప్పులో కాలేశాడు. అతను చేసిన ట్వీట్ అ‍ర్థమే మారిపోయింది. ఎవరెస్ట్ను అధిరోహించిన తొలి పాకిస్థానీ మహిళ అని ట్వీట్ చేసే బదులుగా పాకిస్థాన్ ప్రథమ మహిళ అనే అర్థం వచ్చేలా ట్వీట్ చేశాడు. సాధారణంగా పాకిస్థాన్ అధ్యక్షుడి భార్యను ప్రథమ మహిళ అంటారు. ఈ విషయాన్ని గ్రహించిన అభిమానులు అక్తర్ దృష్టికి తీసుకెళ్లి, తప్పును సరిదిద్దాలని ట్విట్టర్లో ప్రయత్నించారు. అయితే అతను వారికి అందుబాటులోకి రాలేదు. ఇంకేముంది అక్తర్ ఇంగ్లీష్ పరిజ్ఞానాన్ని తెలుసుకున్న నెటిజన్లు అతనిపై జోకులు పేల్చారు. అక్తర్ ఇంగ్లీష్‌ను నాశనం చేశాడని, ఇంగ్లీష్ మాట్లాడే పాకిస్థానీలపై సర్జికల్ దాడి చేశాడంటూ జోకులు పేలాయి. ఇలా ట్వీట్ల దాడిలో అక్తర్ బాధితుడిగా మారాడు. చివరకు తప్పు తెలుసుకున్న అక్తర్ మొదట చేసిన ట్వీట్ను తొలగించి సరైన అర్థం వచ్చేలా మళ్లీ ట్వీట్ చేశాడు.
 

Advertisement
Advertisement