‘అదే నా చివరి 50 ఓవర్ల ఈవెంట్‌’ | Sakshi
Sakshi News home page

‘అదే నా చివరి 50 ఓవర్ల ఈవెంట్‌’

Published Tue, Jun 26 2018 1:35 PM

Shoaib Malik to Retire From ODIs After 2019 World Cup - Sakshi

ఇస్లామాబాద్‌: వచ‍్చే ఏడాది జరిగే ఐసీసీ వన్డే ప్రపంచకప్ తర్వాత అంతర్జాతీయ వన్డే ఫార్మాట్‌కు గుడ్‌బై చెబుతున్నట్లు పాకిస్తాన్‌ వెటరన్‌ క్రికెటర్‌ షోయబ్‌ మాలిక్‌ వెల్లడించాడు. పాకిస్తాన్‌ జట్టు తరఫున షోయబ్ తన తొలి మ్యాచ్ 1998లో ఆడాడు. వెస్టిండీస్‌తో షార్జా వేదికగా జరిగిన మ్యాచ్‌తో అతను అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. 2007లో పాకిస్తాన్ జట్టుకి కెప్టెన్‌గా వ్యవహరించిన మాలిక్ తన కెరీర్‌లో ఆడిన 261 వన్డేల్లో 35.22 యావరేజ్‌తో 6975 పరుగులు చేశాడు. ఇందులో 9 సెంచరీలు, 41 అర్ధ శతకాలు చేశాడు. అంతేకాక.. బౌలింగ్‌లో 154 వికెట్లు తీశాడు.

తన రిటైర్మెంట్‌ గురించి మాలిక్ మాట్లాడుతూ.. ‘2019 వరల్డ్ కప్ నా చివరి 50 ఓవర్ల ఈవెంట్. ఆ తర్వాత నేను ఫిట్‌గా ఉంటే.. టీ-20 క్రికెట్ ఆడేందుకు ప్రయత్నిస్తా. మీకు లక్ష్యాలు ఉంటే అందుకోసం పరిగెత్తండి. నా క్రికెట్‌ కెరీర్‌లో రెండు పెద్ద టోర్నమెంట్‌లు గెలిచిన దాంట్లో సభ్యుడిని . ఒకటి 2009 టీ-20 వరల్డ్ కప్, 2017 చాంపియన్స్ ట్రోఫీ. ఇక నా కెరీర్‌లో మిగిలి ఉంది 50 ఓవర్ వరల్డ్ కప్ మాత్రమే. దాని కోసమే నేను కృషి చేస్తున్నాను. నాకు మా జట్టుపై నమ్మకం ఉంది. ఆ టోర్నమెంట్‌లో అత్యుత్తమ ప్రదర్శన చేస్తాం’ అని  పేర్కొన్నాడు. 2015లో టెస్టులకు షోయబ్‌ గుడ్‌ బై చెప్పిన సంగతి తెలిసిందే. టెస్టుల్లో అతని అత్యధిక వ్యక్తిగత స్కోరు 245.

Advertisement
Advertisement