Sakshi News home page

తొలి రోజు ‘గురి’ తప్పింది

Published Sun, Aug 7 2016 2:07 AM

తొలి రోజు ‘గురి’ తప్పింది

రియో డి జనీరో : భారత్‌కు పతకాలు కచ్చితంగా వస్తాయని భావించిన షూటింగ్‌లో తొలి రోజు మనోళ్ల గురి తప్పింది. పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్‌లో జీతూరాయ్, మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్‌లో అపూర్వ చండీలా, అయోనికా పాల్ నిరాశపరిచారు.

 పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో ఫైనల్‌కు చేరి పతకంపై ఆశలు రేకెత్తించిన భారత షూటర్ జీతూ రాయ్ నాకౌట్ రౌండ్‌లో నిరాశపరిచాడు. ఎనిమిది మంది షూటర్లు పాల్గొన్న ఫైనల్లో నిర్ణీత ఎనిమిది రౌండ్‌ల తర్వాత జీతూ 78.7 పాయింట్లు స్కోరు చేసి చివరి స్థానంలో నిలిచాడు. దాంతో అతను ఫైనల్ నుంచి నిష్ర్కమించిన తొలి షూటర్‌గా నిలిచాడు. అంతకుముందు క్వాలిఫయింగ్‌లో జీతూ రాయ్ 580 పాయింట్లు స్కోరు చేసి ఆరో స్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత పొందాడు. నిబంధనల ప్రకారం క్వాలిఫయింగ్‌లో సాధించిన స్కోరును ఫైనల్లో పరిగణనలోకి తీసుకోరు. హోంగ్ జువాన్ విన్ (వియత్నాం-202.5 పాయింట్లు) స్వర్ణం, ఫెలిపె అల్మీదా వూ (బ్రెజిల్-202.1 పాయింట్లు) రజతం, పాంగ్ వీ (చైనా-180.4 పాయింట్లు) కాంస్యం సాధించారు.

 మహిళల రైఫిల్ తుస్
10 మీటర్ల మహిళల ఎయిర్ రైఫిల్ విభాగంలో భారత్ కథ ముగిసింది. భారత షూటర్లు అపూర్వీ చండీలా, అయోనికా పాల్ క్వాలిఫైయింగ్ రౌండ్లోనే ఇంటిబాటపట్టారు. 51 మంది పోటీదారుల్లో చండీలా 411.6 పాయింట్లు సాధించి 34వ స్థానంలో నిలవగా.. పాల్ 403 పాయింట్లతో 47వ స్థానంతో సరిపెట్టుకున్నారు. గ్లాస్గోవ్‌లో జరిగిన 2014 కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణం గెలిచిన ఈ భారత జోడీపై భారీగా అంచనాలు పెరిగాయి. కానీ ఈసారి అర్హత పోటీల్లోనే వీరిద్దరూ చేతులెత్తేశారు.

భళా భోకనాల్
తొలి ఒలింపిక్స్‌లో పాల్గొన్న భారత రోయర్ దత్తు భోకనాల్ అద్భుతమైన ప్రతిభతో ఆకట్టుకున్నాడు. శనివారం జరిగిన పురుషుల సింగిల్ స్కల్స్ రోయింగ్ హీట్స్‌లో మూడో స్థానంలో నిలిచి క్వార్టర్‌ఫైనల్‌కు (మంగళవారం జరిగే) అర్హత సాధించాడు. మహారాష్ట్రకు చెందిన 25 ఏళ్ళ భోకనాల్ 2వేల మీటర్ల రేసును 7.21.67 నిమిషాల్లో లక్ష్యాన్ని చేరుకున్నాడు. తొలి 500 మీటర్ల వరకు రెండో స్థానంలో ఉన్న దత్తు.. ఆ తర్వాత కాస్తంత వెనకబడ్డాడు. కాగా, క్యూబా రోయర్ రోడ్రిగ్వెజ్ 7.06.89 టైమింగ్‌తో మొదటి స్థానంలో నిలిచాడు.

  కలిసొచ్చిన ‘పెనాల్టీ’
ఒలింపిక్స్ ఆరంభ వేడుకలకు దూరంగా ఉన్న భారత హాకీ జట్టు.. ఐర్లాండ్‌తో జరిగిన గ్రూప్-బీ మ్యాచ్‌లో 3-2తో విజయం సాధించింది. 15వ నిమిషంలో పెనాల్టీని రఘునాథ్ గోల్‌గా మార్చాడు. తొలి అర్ధభాగం ముగుస్తుందనగా.. రూపీందర్‌పాల్ సింగ్ పెనా ల్టీ కార్నర్ గోల్‌తో భారత్ ఆధిక్యాన్ని 2-0కు పెంచాడు. అయితే బ్రేక్ తర్వాత ఐర్లాండ్ ఓ గోల్ చేసి దూకుడు మీద కనిపించినా.. రూపీందర్ మరో పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలిచి భారత్‌కు స్పష్టమైన లీడింగ్ ఇచ్చాడు. చివర్లో ఐర్లాండ్ ఓ గోల్ సాధించినా.. భారత్ 3-2తో విజయం సాధించింది.

టీటీ: తొలి రౌండ్లోనే అవుట్
మహిళల టేబుల్ టెన్నిస్ సింగిల్స్‌లో ఇద్దరు ప్లేయర్లూ తొలి రౌండ్లోనే నిష్ర్కమించారు. మౌమా దాస్ 0-4 (2-11, 7-11, 7-11, 3-11) తేడాతో రొమేనియా క్రీడాకారిణి డేనియేలా చేతిలో ఓడిపోగా.. మానికా బాత్రా 2-4 (12-10, 6-11, 12-14, 11-8, 4-11, 12-14) తేడాతో పోలాండ్ ప్లేయర్ కతర్జినా ముందు చేతులెత్తేసింది.

షూటింగ్:మహిళల 10మీటర్ల ఎయిర్ పిస్టల్ (క్వాలిఫయింగ్) హీనా సిద్దు
సాయంత్రం 5.30గం.కు పురుషుల ట్రాప్ (క్వాలిఫికేషన్)

కైనాన్ చెనై, మానవ్‌జీత్ సింగ్ సంధు సాయంత్రం 6 గంటలకు

మహిళల ఆర్చరీ (భారత్ ్ఠ కొలంబియా)
ఆదివారం సాయంత్రం జరిగే మహిళల ఆర్చరీ ఎలిమినేషన్ రౌండ్స్‌లో కొలంబియాతో భారత్ తలపడనుంది.

(లక్ష్మీరాణి, బాంబేలా దేవి, దీపికా కుమారి) సాయంత్రం 6.45 నుంచి

మహిళల హాకీ (భారత్ ్ఠ జపాన్) రాత్రి 7.30 గంటలకు

 మహిళ జిమ్నాస్టిక్స్ (క్వాలిఫయింగ్) దీపా కర్మాకర్ రాత్రి 11 నుంచి

Advertisement
Advertisement