సెహ్వాగ్‌ కాన్స్‌ట్రేషన్ సీక్రెట్ ఏమిటో తెలుసా? | Sakshi
Sakshi News home page

సెహ్వాగ్‌ కాన్స్‌ట్రేషన్ సీక్రెట్ ఏమిటో తెలుసా?

Published Wed, Mar 2 2016 11:21 AM

సెహ్వాగ్‌ కాన్స్‌ట్రేషన్ సీక్రెట్ ఏమిటో తెలుసా?

మైదానంలో బ్యాటింగ్‌ చేసేటప్పుడు ఒక్కో ఆటగాడు ఒక్కోలా ఫోకస్ చేస్తుంటాడు. బంతికి, బ్యాటుకు మధ్య లింకు తెగిపోకుండా కాన్స్‌ట్రేషన్ కొనసాగించేందుకు తమదైన టెక్నిక్స్ ను బ్యాట్స్‌మన్‌ ఉపయోగిస్తుంటారు. 'పిచ్‌' మీద ఉన్నప్పుడు రెచ్చిపోయి ఆడే ఆటగాళ్లు సైతం తమ ఏకాగ్రత దెబ్బతినకుండా ఉండేందుకు చిన్న చిన్న చిట్కాలు పాటిస్తుంటారు.

బౌలర్లను కకావికలం చేయడమే టార్గెట్‌గా క్రీజులోకి ఎంటరయ్యే భారత మాజీ డాషింగ్ బ్యాట్స్‌మన్ వీరేంద్ర సెహ్వాగ్‌ కూడా ఏకాగ్రత కోసం ఇలాంటి చిట్కానే ఒకదానిని ఉపయోగించేవాడట. ఫీల్డ్‌లోకి ఎంటరవ్వగానే బ్యాటింగ్ మీద ఫోకస్ చెదిరిపోకుండా ఉండేందుకు బాలీవుడ్ లెజండరీ గాయకుల పాటల్నిఆయన హామ్‌ చేసేవాడట. ముఖ్యంగా కిషోర్ కుమార్, మహమ్మద్ రఫీ, లతా మంగేష్కర్ పాటలను పాడుతూ బ్యాటింగ్ మీద ఫోకస్ చేసేవాడినని తాజాగా సెహ్వాగ్ తన కాన్స్‌ట్రేషన్ సీక్రెట్ వెల్లడించాడు.

'ప్రతికూల ఆలోచనలు రాకుండా ఉండేందుకు బ్యాటింగ్ చేస్తున్నప్పుడు నేను చాలా పాటలను పాడేవాణ్ని. కిషోర్‌ కుమార్, మహమ్మద్ రఫీ, లతా మంగేష్కర్ ఆ పాత మాధుర గీతాలను ఎక్కువగా పాడుతూ ఉండేవాడిని' అని 37 ఏళ్ల సెహ్వాగ్ చెప్పాడు. తన డాషింగ్‌ బ్యాటింగ్‌తో భారత్‌కు ఎన్నో విజయాలు అందించిన సెహ్వాగ్ గత ఏడాది అక్టోబర్‌లో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైరైన సంగతి తెలిసిందే.

పెద్దగా ఫుట్‌వర్క్ లేకపోయినా కంటిచూపునకు, చేతికి మధ్య గొప్ప సమన్వయంతో అద్భుతమైన షాట్లు కొట్టిన సెహ్వాగ్‌.. బ్యాటింగ్‌ చేస్తున్నప్పుడు మాత్రం తన ఏకాగ్రత కాపాడుకునేందుకు పాటలు ఎక్కువగా పాడేవాడినని, అయితే వికెట్ పడకుండా ఏకాగ్రత కొనసాగినంతసేపు ఎవరి పాట, ఏ పాట అన్నది పెద్దగా ప్రాధాన్య విషయం కాకపోయేదని చెప్పాడు. మీతో కలిసి సహచర బ్యాట్స్‌మెన్లు కూడా గొంతు కలిపేవారా అని అడిగితే.. 'నా పార్ట్‌నర్స్‌కు నేను పాడుతున్న సంగతి అస్సలు తెలిసేది కాదు. మేం పిచ్‌ మధ్యలో కలిసినప్పుడు గేమ్‌ గురించే మాట్లాడేవాళ్లం. పిచ్‌ ఎండ్‌కు వెళ్లాక నా సహజ ధోరణిలో నేను పాటలు పాడుకునే వాణ్ణి. నాన్ స్టైకర్స్ ఎండ్‌లో ఉన్నప్పుడు మాత్రం ఎంపైర్లతో మాట్లాడేవాణ్ని' అని సెహ్వాగ్ వివరించాడు.

Advertisement
Advertisement