Sakshi News home page

అతని ఆటలో నో స్టైల్‌, నో టెక్నిక్‌: అక్తర్‌

Published Thu, Nov 7 2019 1:06 PM

Smith Has No Technique Or Style Shoaib Akhtar - Sakshi

కరాచీ: ఆస్ట్రేలియా స్టార్‌ క్రికెటర్‌ స్టీవ్‌ స్మిత్‌పై పాకిస్తాన్‌ మాజీ పేసర్‌ షోయబ్‌ అక్తర్‌  ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తన కెరీర్‌లో చూసిన క్రికెటర్లలో ఎటువంటి టెక్నిక్‌, ఎటువంటి స్టైల్‌ లేని ఆటగాడు స్మిత్‌ అని పేర్కొన్నాడు. కాకపోతే ఈ ఆధునిక క్రికెట్‌లో అత్యంత ప్రభావం చూపే క్రికెటర్ల  జాబితాలో స్మిత్‌ కూడా ఒకడన్నాడు. పాకిస్తాన్‌తో జరిగిన రెండో టీ20లో స్మిత్‌ 51 బంతుల్లో 11 ఫోర్లు, 1 సిక్సర్‌ సాయంతో అజేయంగా 80 పరుగులు సాధించి ఆసీస్‌ గెలుపులో కీలక పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలో స్మిత్‌ గురించి అక్తర్‌ తన యూట్యూబ్‌ చానల్‌ ద్వారా వీడియో విడుదల చేశాడు.

‘నేను చాలా సందర్భాల్లో స్మిత్‌ను ఔట్‌ చేయడానికి ప్రయత్నించాను. బౌన్సర్లు రూపంలో బంతులు వేశా. కాకపోతే అతని టెక్నిక్‌ ఏమిటో అర్థం కాదు. అదే సమయంలో అతని ఆట  కూడా ఏమాత్రం సొగసైనదిగా ఉండదు. కానీ స్మిత్‌ చాలా ప్రభావం చూపే క్రికెటర్‌. స్మిత్‌ ధైర్యమే అతన్ని ఒక అసాధారణ క్రికెటర్‌గా మార్చింది. ఇటీవల తమ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో మహ్మద్‌ ఆమిర్‌ బౌలింగ్‌లో బంతికి ఎక్కడైతే పిచ్‌  అవుతుందో అక్కడకి వచ్చి ఆడాడు. అది నన్ను కచ్చితంగా ఆశ్చర్యానికి గురి చేసింది. అది ఎలా సాధ్యం. ఒక టెక్నిక్‌, ఒక స్టైల్‌ అంటూ లేకుంటూ అలా ఎలా ఆడతారో నాకు అర్థం కాలేదు. నాకు చివరకు అర్థమయ్యింది ఏమిటంటే బంతిని కచ్చితంగా అంచనా వేసి ధైర్యంగా ఆడతాడు. అదే అతన్ని కీలక క్రికెటర్‌గా ఎదిగేలా చేసింది’ అని అక్తర్‌ పేర్కొన్నాడు. స్మిత్‌  టీ20  ఫార్మాట్‌కు సరిపోడు అన్న వారికి అతను బ్యాట్‌తోనే సమాధానం చెప్పాడన్నాడు.

Advertisement
Advertisement