తొలిరోజే సఫారీలను కూల్చేశారు..! | Sakshi
Sakshi News home page

తొలిరోజే సఫారీలను కూల్చేశారు..!

Published Fri, Jan 5 2018 8:35 PM

south africa bowled out for 286 against india - Sakshi

కేప్‌టౌన్‌: టీమిండియాతో ఇక‍్కడ జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా 286 పరుగులకు ఆలౌటైంది.  టీమిండియా బౌలర్లు విజృంభించడంతో తొలి రోజు పూర్తిగా ఆడకుండానే సఫారీలు చాపచుట్టేశారు. టీమిండియా బౌలర్లలో భువనేశ్వర్‌ కుమార్‌ నాలుగు వికెట్లతో సత్తా చాటగా, రవిచంద్రన్‌ అశ్విన్‌ రెండు వికెట్లు సాధించాడు. ఇక హార్దిక్‌ పాండ్యా,  షమీ, బూమ్రాలకు తలో వికెట్‌ దక్కింది.

దక్షిణాఫ్రికా ఆటగాళ్లలో ఏబీ డివిలియర్స్‌(65;84 బంతుల్లో 11 ఫోర్లు), డు ప్లెసిస్‌(62;104 బంతుల్లో 12 ఫోర్లు)లు హాఫ్‌ సెంచరీలు చేయగా, డీ కాక్‌(43;40 బంతుల్లో 7ఫోర్లు), మహరాజ్‌(35;47 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్సర్‌) ఫర్వాలేదనిపించారు. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన సఫారీలు ఆదిలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. భారత ప్రధాన పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ వరుస ఓవర్లలో ముగ్గురు కీలక ఆటగాళ్లను పెవిలియన్‌కు పంపి శుభారంభాన్ని అందించాడు. భువీ వేసిన తొలి ఓవర్‌లో డీన్‌ ఎల్గర్‌ను డకౌట్‌గా అవుట్‌ చేయగా, మూడో ఓవర్‌లో మక్రమ్‌(5)ను పెవిలియన్‌కు పంపాడు. ఐదో ఓవర్‌లో హషీమ్‌ ఆమ్లా(3)ను భువీ అవుట్‌ చేయడంతో దక్షిణాఫ్రికా 12 పరుగులకే మూడు వికెట్లను నష్టపోయి కష్టాల్లో పడింది.

ఆ తరుణంలో ఏబీ డివిలియర్స్‌-డుప్లెసిస్‌ జోడి మరమ్మత్తులు చేపట్టింది. ఈ జోడి నాల్గో వికెట్‌కు 114 పరుగుల భాగస్వామ్యాన్ని జత చేయడంతో దక్షిణాఫ్రికా తేరుకుంది. అయితే 16 పరుగుల వ్యవధిలో ఏబీ, డు ప్లెసిస్‌లు అవుట్‌ కావడంతో సఫారీలకు మరోసారి షాక్‌ తగిలింది. కాగా, డీకాక్‌-ఫిలిండర్‌(23)ల జోడి 60 పరుగుల భాగస్వామ్యాన్ని జత చేసి రెండొందల మార్కునే దాటించారు.  ఇక చివర్లో రబడా(26; 66 బంతుల్లో 1 సిక్సర్‌) సమయోచితంగా ఆడటంతో సఫారీలు 250 పైగా పరుగుల్ని నమోదు చేయగలిగారు.


ఏబీనే బూమ్రా తొలి టెస్టు వికెట్‌..

దక్షిణాఫ్రికాతో తొలి టెస్టు ద్వారా ఈ ఫార్మాట్‌లో అరంగేట్రం చేసిన టీమిండియా పేసర్‌ జస్ర్పిత్‌ బూమ్రా.. ఏబీ డివిలియర్స్‌ వికెట్‌ను తన తొలి టెస్టు వికెట్‌గా ఖాతాలో వేసుకున్నాడు.  ఏబీ డివిలియర్స్‌ (65;84 బంతుల్లో 11 ఫోర్లు)ను నాల్గో వికెట్‌గా అవుట్‌ చేయడంతో బూమ్రాకు మొదటి టెస్టు వికెట్‌ లభించింది. ఏబీ మరింత ప్రమాదకరంగా మారుతున్న సమయంలో అతన్ని బూమ్రా బౌల్డ్‌ చేశాడు.

Advertisement

తప్పక చదవండి

Advertisement