సఫారీలు మరో'సారీ' | Sakshi
Sakshi News home page

సఫారీలు మరో'సారీ'

Published Fri, Dec 4 2015 4:41 PM

సఫారీలు మరో'సారీ'

ఢిల్లీ: దక్షిణాఫ్రికా మరోసారి తడబడింది. టీమిండియాతో ఇక్కడ ఫిరోజ్ షా కోట్ల మైదానంలో జరుగుతున్న నాల్గో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో 121 పరుగులకే చాపచుట్టేసింది. దక్షిణాఫ్రికా ఆటగాళ్లలో ఎల్గర్(17), భవుమా(22), హషీమ్ ఆమ్లా(3), డు ప్లెసిస్(0), జేపీ డుమినీ(1), విలాస్(11) ,అబాట్(4), పీడిట్(5)లు నిరాశపరచగా, ఏబీ డివిలియర్స్(42) రాణించాడు. దక్షిణాఫ్రికా ఫాలో ఆన్ లో పడినా.. విరాట్ సేన కోరకపోవడంతో టీమిండియా శనివారం రెండో ఇన్నింగ్స్ ను ఆరంభించనుంది. బౌలర్లలో రవీంద్ర జడేజా ఐదు వికెట్లతో దక్షిణాఫ్రికా వెన్నువిరచగా, ఉమేష్ యాదవ్, అశ్విన్ లకు తలో  రెండు వికెట్లు, ఇషాంత్ శర్మకు ఒక వికెట్ దక్కింది.

అంతకుముందు 231/7 ఓవర్ నైట్ స్కోరుతో  మ్యాచ్ రెండో రోజు శుక్రవారం తొలి ఇన్నింగ్స్ ను కొనసాగించిన టీమిండియా 334 పరుగుల భారీ స్కోరు సాధించింది. అజింక్యా రహానే(127; 215 బంతుల్లో  11 ఫోర్లు, 4 సిక్సర్లు) తో అద్భుత సెంచరీ చేశాడు. లంచ్ విరామ సమాయానికి మరో వికెట్  మాత్రమే కోల్పోయి, మరో 95 పరుగులను జత చేసింది. ఆ తరువాత స్వల్ప పరుగుల వ్యవధిలో మిగతా రెండు వికెట్లను భారత్ కోల్పోయింది.
 
సఫారీలకు రహానే-అశ్విన్ ల పరీక్ష


ఈ రోజు ఆటలో రహానే-అశ్విన్ ల జోడి సఫారీ బౌలర్లకు పరీక్షగా నిలిచింది . ఈ జోడి ఎనిమిదో వికెట్ కు 98 పరుగుల కీలక భాగస్వామ్యాన్నినెలకొల్పడంతో టీమిండియా పటిష్ట స్థితికి వెళ్లింది.  ఈ క్రమంలోనే సఫారీలపై మొదటి శతకాన్ని, భారత్ లో తొలి సెంచరీని సాధించిన రహానే తన దూకుడును మరింత పెంచాడు. డేన్ పీడిట్ బౌలింగ్ లో రెండు సిక్సర్లు సాధించి మంచి ఊపులో కనిపించాడు. అయితే రహానే సెంచరీ పూర్తి చేసుకున్న తరువాత మరో  27 పరుగులు చేసి ఇమ్రాన్ తాహీర్ బౌలింగ్ లో పెవిలియన్ కు చేరాడు. ఆ తరువాత అశ్విన్ (56; 140 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్ సెంచరీ సాధించాడు. ఉమేష్ యాదవ్(10నాటౌట్) తో కలిసి అశ్విన్ 38 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. అయితే 334 పరుగుల వద్ద అశ్విన్ తొమ్మిదో వికెట్ గా అవుటవ్వగా, వెంటనే ఇషాంత్ శర్మ డకౌట్ పెవిలియన్ కు చేరడంతో టీమిండియా తొలి ఇన్నింగ్స్ ముగిసింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement