సఫారీల కొత్త చరిత్ర

13 Oct, 2016 11:39 IST|Sakshi
సఫారీల కొత్త చరిత్ర

కేప్ టౌన్:దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. ఆసీస్తో జరిగిన ఐదు వన్డేల సిరీస్ను వైట్ వాష్ చేసి కొత్త అధ్యాయాన్ని లిఖించింది. ఆసీస్తో ఇంతకుమునుపెన్నడూ సాధించని ఈ సుదీర్ఘ వన్డే సిరీస్ను క్లీన్ స్వీప్ చేసిన రికార్డును సఫారీలు ఎట్టకేలకు సాధించారు. ఆస్ట్రేలియాతో బుధవారం రాత్రి జరిగిన డే అండ్ నైట్ వన్డేలో దక్షిణాఫ్రికా 31 పరుగుల తేడాతో విజయం సాధించడంతో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది.

 

ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 327 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా మిడిల్ ఆర్డర్ ఆటగాడు రస్క్వో(122;118 బంతుల్లో 14 ఫోర్లు, 2 సిక్సర్లు)తో శతకం సాధించగా, జేపీ డుమినీ(73;75 బంతుల్లో 8 ఫోర్లు) బాధ్యతాయుతంగా ఆడాడు. అనంతరం మిల్లర్(39) ఫర్వాలేదనిపించడంతో దక్షిణాఫ్రికా భారీ లక్ష్యాన్ని ఆసీస్ ముందుంచింది.

అనంతరం బ్యాటింగ్ దిగిన ఆస్ట్రేలియాకు డేవిడ్ వార్నర్- ఫించ్లు మంచి ఆరంభాన్నిచ్చారు. ఈ జోడి తొలి వికెట్ కు 72 పరుగులు జోడించిన తరువాత ఫించ్(19) వెనుదిరిగాడు. అయితే ఆపై వెంటనే కెప్టెన్ స్టీవ్ స్మిత్ డకౌట్ గా పెవిలియన్ చేరగా, మరో మూడు పరుగుల వ్యవధిలో జార్జ్ బెయిలీ(2)కూడా నిష్క్రమించాడు. దాంతో కష్టాల్లో పడిన ఆసీస్ ను మిచెల్ మార్ష్(35), హెడ్(35)లు ఆదుకునే యత్నం చేశారు. అయినప్పటికీ లక్ష్యం భారీగా ఉండటంతో ఆసీస్ 48.2 ఓవర్లలో 296 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది. దాంతో దక్షిణాఫ్రికా 5-0 తేడాతో సిరీస్ ను కైవసం చేసుకుంది.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు