దసరా ధమాకా! | Sakshi
Sakshi News home page

దసరా ధమాకా!

Published Sat, Oct 24 2015 12:16 AM

దసరా ధమాకా! - Sakshi

దసరా పండుగనాడు భారత క్రికెట్ అభిమాని సంబరపడ్డాడు. దక్షిణాఫ్రికాతో సిరీస్ మొదలైన దగ్గర్నించి పడుతూ లేస్తూ సాగుతున్న భారత క్రికెట్ జట్టు... దసరా రోజు మాత్రం సంచలన ఆటతీరు కనబరిచింది. ప్రపంచకప్ తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు మొత్తం జట్టంతా కలిసికట్టుగా ఆడి ప్రత్యర్థిని చిత్తు చేసింది. అన్ని విభాగాల్లోనూ సాధికారిక ఆటతీరుతో ధోనిసేన నాలుగో వన్డేలో దక్షిణాఫ్రికాపై గెలిచి పండుగ సంబరాన్ని రెట్టింపు చేసింది. కోహ్లి సెంచరీకి బౌలర్ల సమష్టి కృషి తోడవడంతో... సిరీస్‌లో నిలబడింది.

దక్షిణాఫ్రికా కెప్టెన్ డివిలియర్స్ విభిన్న షాట్లతో వణుకు పుట్టించినా... భారత విజయాన్ని అడ్డుకోలేకపోయాడు. ఇక సిరీస్ ఫలితం తేలేది ఆదివారం ముంబైలో జరిగే చివరి వన్డేలోనే.

 
* నాలుగో వన్డేలో భారత్ విజయం  
* విరాట్ కోహ్లి సెంచరీ
* డివిలియర్స్ శతకం వృథా  
* చివరి వన్డే ఆదివారం ముంబైలో
చెన్నై: దక్షిణాఫ్రికాతో నాలుగో వన్డేకు ముందు విరాట్ కోహ్లి వన్డేల్లో 22 సెంచరీలు చేస్తే భారత్ 21సార్లు గెలిచింది. అందుకే కోహ్లి నిలకడగా ఆడటం భారత్‌కు అవసరం. మరోసారి కూడా అదే సంప్రదాయం పునరావృతమైంది. కోహ్లి శతకంతో భారత్‌ను గెలిపించాడు. రాజ్‌కోట్ మ్యాచ్‌తో ఫామ్‌లోకి వచ్చిన భారత వైస్ కెప్టెన్ చెపాక్‌లో చెలరేగాడు.

ఫలితంగా గురువారం జరిగిన నాలుగో వన్డేలో భారత్ 35 పరుగులతో సఫారీలను ఓడించింది. ఐదు వన్డేల సిరీస్ ప్రస్తుతం 2-2తో సమమైంది. ఆఖరి వన్డే ఆదివారం ముంబైలో జరుగుతుంది. చిదంబరం స్టేడియంలో జరిగిన నాలుగో వన్డేలో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 299 పరుగులు చేసింది.

విరాట్ కోహ్లి (140 బంతుల్లో 138; 6 ఫోర్లు, 5 సిక్సర్లు) కెరీర్‌లో 23వ సెంచరీని సాధించగా, రైనా (52 బంతుల్లో 53; 3 ఫోర్లు, 1 సిక్స్), రహానే (53 బంతుల్లో 45; 4 ఫోర్లు) రాణించారు. స్టెయిన్, రబడ చెరో 3 వికెట్లు తీశారు. అనంతరం దక్షిణాఫ్రికా 50 ఓవర్లలో 9 వికెట్లకు 264 పరుగులు చేసింది. ఏబీ డివిలియర్స్ (107 బంతుల్లో 112; 10 ఫోర్లు, 2 సిక్సర్లు) ఒంటరి పోరాటంతో శతకం సాధించాడు. భువనేశ్వర్‌కు 3 వికెట్లు దక్కగా, హర్భజన్ 2 వికెట్లు తీశాడు.
 
కీలక భాగస్వామ్యాలు
ఓపెనర్లు రోహిత్ (21), ధావన్ (7) విఫలం కావడంతో భారత్ 35 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. అయితే ఆ తర్వాత రెండు సెంచరీ భాగస్వామ్యాలు జట్టు విజయానికి కీలకంగా నిలిచాయి. కోహ్లి, రహానే  మూడో వికెట్‌కు 104 పరుగులు జోడించగా...ఆ తర్వాత కోహ్లి, రైనా 18.4 ఓవర్లలోనే 127 పరుగులు జత చేశారు. ముఖ్యంగా కోహ్లి చాలా కాలం తర్వాత తనదైన శైలిలో చక్కటి షాట్లతో ఆకట్టుకున్నాడు.    

రహానేను స్టెయిన్ అవుట్ చేయడంతో ఈ భాగస్వామ్యానికి తెర పడింది.  రైనా నిలదొక్కుకునేందుకు సమయం తీసుకున్నా...  ఆ తర్వాత జోరు పెంచి 48 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్క్‌ను చేరుకున్నాడు. మరో వైపు కండరాలు పట్టేయడంతో కొంత ఇబ్బంది పడుతూ బ్యాటింగ్ కొనసాగించిన కోహ్లి... ఫాంగిసో బౌలింగ్‌లో భారీ సిక్స్‌తో 112 బంతుల్లో సెంచరీ మార్కుని అందుకున్నాడు. చివరి 5 ఓవర్లలో భారత్ 29 పరుగులు మాత్రమే చేసి 4 వికెట్లు కోల్పోవడంతో స్కోరు 300  లోపే ఆగిపోయింది.
 
డివిలియర్స్ మెరుపులు
ఒక వైపు డి కాక్ (35 బంతుల్లో 43; 6 ఫోర్లు, 1 సిక్స్) ధాటిగా ఆడే ప్రయత్నం చేసినా... ఆమ్లా (7) వైఫల్యం కొనసాగడంతో దక్షిణాఫ్రికాకు శుభారంభం దక్కలేదు.  డు ప్లెసిస్ (17), మిల్లర్ (6) కూడా విఫలమయ్యారు. 11-20 ఓవర్ల మధ్య 32 పరుగులు మాత్రమే చేసి 3 వికెట్లు కోల్పోవడం సఫారీలను దెబ్బ తీసింది. ఈ దశలో డివిలియర్స్, బెహర్దీన్ (22) కలిసి జట్టును రక్షించేందుకు ప్రయత్నించారు. అయితే స్పిన్నర్లు హర్భజన్, మిశ్రా, అక్షర్ కట్టి పడేయడంతో ఆ జట్టు పరుగులు తీయడం కష్టమైపోయింది.

ఇలాంటి స్థితిలోనూ ఎదురుదాడికి దిగి డివిలియర్స్ దూకుడుగా ఆడాడు. మిశ్రా బౌలింగ్‌లో భారీ సిక్సర్ కొట్టడంతో 98 బంతుల్లోనే అతని సెంచరీ పూర్తయింది. డివిలియర్స్ క్రీజ్‌లో ఉన్నంత సేపు ఒంటి చేత్తో గెలిపిస్తున్నట్లే అనిపించింది. అయితే భువీ వేసిన షార్ట్ పిచ్ బంతిని పుల్ షాట్ ఆడబోయి అతను ధోనికి క్యాచ్ ఇవ్వడంతో దక్షిణాఫ్రికా ఆశలు గల్లంతయ్యాయి.
 
* కోహ్లి వన్డే కెరీర్‌లో ఇది 23వ సెంచరీ. ఓవరాల్ జాబితాలో సచిన్ (49), పాంటింగ్ (30), జయసూర్య (28), సంగక్కర (25) మాత్రమే అతనికంటే ముందున్నారు.
* దక్షిణాఫ్రికాపై కోహ్లికి ఇది తొలి సెంచరీ. దీంతో అన్ని టెస్టు దేశాల (9) పైనా సెంచరీ చేసిన సచిన్, పాంటింగ్, గిబ్స్, ఆమ్లాల సరసన చేరాడు.
* డివిలియర్స్‌కు ఇది 22వ సెంచరీ. దీంతో దక్షిణాఫ్రికా తరఫున అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా నిలిచాడు.
* భారత్‌కు ఇది 450వ వన్డే విజయం. ప్రపంచ క్రికెట్‌లో ఆస్ట్రేలియా (533), పాకిస్తాన్ (451) మాత్రమే ఇంతకంటే ఎక్కువ విజయాలు సాధించాయి.
 
స్కోరు వివరాలు
భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (సి) డు ప్లెసిస్ (బి) మోరిస్ 21; ధావన్ (సి) డి కాక్ (బి) రబడ 7; కోహ్లి (సి) డి కాక్ (బి) రబడ 138; రహానే (సి) డి కాక్ (బి) స్టెయిన్ 45; రైనా (సి) డివిలియర్స్ (బి) స్టెయిన్ 53; ధోని (సి) డివిలియర్స్ (బి) స్టెయిన్ 15; హర్భజన్ (బి) రబడ 0; అక్షర్ (నాటౌట్) 4; భువనేశ్వర్ (రనౌట్) 0; ఎక్స్‌ట్రాలు 16; మొత్తం (50 ఓవర్లలో 8 వికెట్లకు) 299.
వికెట్ల పతనం: 1-28; 2-35; 3-139; 4-266; 5-291; 6-291; 7-299; 8-299.
బౌలింగ్: స్టెయిన్ 10-0-61-3; రబడ 10-0-54-3; మోరిస్ 9-0-55-1; ఫాంగిసో 9-0-51-0; తాహిర్ 9-0-58-0; బెహర్దీన్ 3-0-17-0.
 
దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: డి కాక్ (సి) రహానే (బి) హర్భజన్ 43; ఆమ్లా (సి) ధావన్ (బి) మోహిత్ 7; డు ప్లెసిస్ (సి) ధోని (బి) అక్షర్ 17; డివిలియర్స్ (సి) ధోని (బి) భువనేశ్వర్ 112; మిల్లర్ (ఎల్బీ) (బి) హర్భజన్ 6; బెహర్దీన్ (ఎల్బీ) (బి) మిశ్రా 22; మోరిస్ (రనౌట్) 9; ఫాంగిసో (సి) అక్షర్ (బి) భువనేశ్వర్ 20; స్టెయిన్ (సి) రహానే (బి) భువనేశ్వర్ 6; రబడ (నాటౌట్) 8; తాహిర్ (నాటౌట్) 4; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (50 ఓవర్లలో 9 వికెట్లకు) 264.
వికెట్ల పతనం: 1-36; 2-67; 3-79; 4-88; 5-144; 6-185; 7-233; 8-250; 9-250.
బౌలింగ్: భువనేశ్వర్ 10-0-68-3; మోహిత్ 10-0-48-1; హర్భజన్ 10-0-50-2; అక్షర్ 10-0-40-1; మిశ్రా 10-1-55-1.

Advertisement
Advertisement