శ్రీలంకకు సవాల్‌ | Sakshi
Sakshi News home page

శ్రీలంకకు సవాల్‌

Published Fri, Jun 28 2019 2:47 PM

South Africa Won The Toss And Elected To Field First - Sakshi

చెస్టర్‌ లీ స్ట్రీట్‌: వన్డే వరల్డ్‌కప్‌లో శ్రీలంక కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం చెస్టర్‌ లీ స్ట్రీట్‌ వేదికగా రివర్‌సైడ్‌ గ్రౌండ్‌లో జరగనున్న మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాతో లంకేయులు తలపడనున్నారు. ఈ మెగా టోర్నీలో ఇప్పటివరకూ లంక నాలుగు మ్యాచ్‌ల్లో రెండింటిలో నెగ్గి.. రెండు ఓడింది. వర్షం కారణంగా రెండు మ్యాచ్‌లు రద్దుకావడంతో ఆ జట్టు 6 పాయింట్లతో ఏడో స్థానంలో కొనసాగుతోంది. నాకౌట్‌కు చేరాలంటే లంక తమ చివరి మూడు మ్యాచ్‌ల్లో తప్పక గెలవాల్సిందే. దీంతో సౌతాఫ్రికాపై నెగ్గి సెమీస్‌ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలని కరుణరత్నే సేన పట్టుదలగా ఉంది. గత మ్యాచ్‌లో పటిష్ఠ ఇంగ్లండ్‌పై గెలిచిన ఆత్మవిశ్వాసంతో లంక బరిలోకి దిగనుంది. బ్యాటింగ్‌తో పోల్చితే బౌలింగ్‌లో ఆ జట్టు బలంగా ఉంది.

లసిత్‌ మలింగ, ధనంజయ డిసిల్వా, ఇసురు ఉదాన, ప్రదీప్‌ బౌలింగ్‌ విభాగానికి నేతృత్వం వహించనున్నారు. ఇంగ్లండ్‌పై వెటరన్‌ పేసర్‌ లసిత్‌ మలింగ 4 వికెట్లతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. మరోవైపు కేవలం 3 పాయింట్లతో తొమ్మిదోస్థానంలో ఉన్న దక్షిణాఫ్రికా ఇప్పటికే సెమీస్‌ రేస్‌ నుంచి నిష్క్రమించింది. లంకపై గెలిచి పరువు దక్కించుకోవాలని సఫారీలు భావిస్తున్నారు.

ఇరు జట్ల మధ్య ఇప్పటివరకు 76 మ్యాచ్‌లు జరగ్గా... లంక 31 మ్యాచ్‌ల్లో నెగ్గింది. దక్షిణాఫ్రికా 43 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ఒకటి టై కాగా, మరోదాంట్లో ఫలితం తేలలేదు. ప్రపంచ కప్‌లో ఐదు సార్లు ఎదురుపడగా మూడుసార్లు దక్షిణాఫ్రికా, ఒకసారి లంక గెలిచాయి. మరో మ్యాచ్‌ టైగా ముగిససింది. తాజా మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకుంది. టాస్‌ గెలిచిన దక్షిణాఫ్రికా కెప్టెన్‌ డుప్లెసిస్‌ తొలుత లంకను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు.

Advertisement
Advertisement